Tuesday, April 28, 2015

Traffic Rules

తప్పులెన్ను వారు

కొన్నిసార్లు జరిగే సంఘటనలు గమ్మత్తు అనిపిస్తయి. చిన్నవాళ్లను చేయొద్దన్న పనులు పెద్దలు స్వేచ్చగా చేసేస్తుంటరు. పిల్లలను అబద్ధాలడొద్దని చెప్తం. పెద్దలం అవసరము, తప్పదని అబద్ధాలాడుతుంటము. ఒకసారి నేనో బస్సులో ప్రయాణిస్తున్న. ట్రాఫిక్ సిగ్నల్స్  దగ్గర బస్సు ఆగింది. కిటికీలో నుండి దిక్కులు చూస్తుంటే అవతలి వైపు ఓ మోపెడ్ మీద ఇద్దరు పిల్లలు - అబ్బాయిలు సుమారు 14 - 16 మధ్య వయస్సు వుండొచ్చు, వెళ్తున్నరు. మరి ఏమైందో, వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోలేదా లేక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారా మరి నాకైతె తెలియదు. నాకైతె వారి వయస్సు, బండి నడుపుతున్న పిల్లాడి చూస్తె చాలా చిన్నవాడనిపించింది, బహుశా డ్రైవింగ్ లైసెన్స్ లేదని ట్రాపిక్ పోలీసు ఆపిండనిపించింది. ఆ పోలీసు వెనక వున్నవాడిని దింపి, ఇద్దరబ్బాయిలు ఏదో బతిమాలుతున్న వినిపించుకోకుండ వెనక ఎక్కి కూర్చోని, ముందు వున్నఆ చిన్న పిల్లాడినె బండి నడిపింప చేసిండు. మా బస్సు ముందునుండె అడ్డంగా రోడ్డు దాటి ఇవతల వైపుకు తీసుకొచ్చిండు. ఆ పిల్లగాడు సరిగా నడపలేక పోతుంటే, వాని తోటి వున్నవాడు బండి నెట్టి రోడ్డు దాటించిండు. ఇవతలకు వచ్చినంక బండి నడుపుతున్న పిల్లగాడు బండిదిగిండు. తరువాత ఆ పోలీసు ఆ పిల్లలిద్దరికి ఏదో క్లాసు తీసుకున్నట్టనిపించింది. ఇంతలో బస్సు స్టార్ట్ అయి ముందుకు వెళ్ళింది. వాళ్ళు నాకు కనిపించలేదు. నాకు ఎక్కడ చిత్రం అనిపించిందంటె, చిన్నపిల్లాడికి నడపటము సరిగా రాకున్నా ఆ పోలీసు కూచొని బండి నెట్టించుకుంటు రావటము. పెద్ద వాడిని ఆ బండి తీసుకొని రమ్మనొచ్చు కదా! చిన్నావాడ్ని ఎట్లాగు లాక్కేళ్తే పెద్దోడు పారిపోడు కదా. లేదా పెద్దవాడి చేతే బండి నడిపించి తను వెన్క కూచొని రావచ్చు కదా. ఏమో. మొత్తానికి ఆ తతంగమంతా చూడ్డానికి తమాషాగా వుండింది.


ద్విచక్ర వాహనము నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ వుంటది.  కాని ట్రాఫిక్ పోలీసె హెల్మెట్ లేకుండా త్రిబుల్ సవారి  నడుపుతరుఆటో రిక్షాలో డ్రైవరు పక్కన ఎవరిని కూర్చో పెట్టుకోవద్దని రూల్ వుంటదికాని పోలీసె పోయే ఆటోని ఆపి వెనుక సవారి వుంటే డ్రైవరు పక్కన కూచోని పోనియ్యమంటడు. రూల్స్ వున్నయి అందరి క్షేమముకోసమె. వాటిని చేసిన వాళ్ళు, అమలు పర్చాల్సిన వాళ్ళు, ప్రజలు, అందరు పాటిస్తె ప్రమాదాలు, నేరాలు తగ్గుతాయి కదా. ఎవరికి వాళ్ళు వాళ్లకు రూల్స్ వర్తించయనుకుంటే మరి రూల్స్ ఎందుకు పెట్టాలే? సమాజ శ్రేయస్సు కోసం నిబంధనలు పెట్టినప్పుడు దేశ ప్రథమ పౌరుడితొ సహా ప్రతి ఒక్కరు హోదాలకు, రాజకీయాలకు అతీతంగా ఆ నిబంధనలు పాటిస్తె దేశము అభివృద్ధి పథములో నడవటమే కాదు అవినీతి కూడ అంతమౌతుంది కదా!