కొండెక్కిన కొండ చీపురు
"ఏమే రాధ, ఈ మధ్య నువ్విళ్ళుడిస్తె దుమ్మసలె పోతలేదు " ఇంట్లో పనులు చేసె రాధ చీపురు తీసుకొని ఊడుస్తుంటె అన్నది కౌసల్య .
"చీపురు గిట్ల మొట్టిదైతే దుమ్మెట్ల పోతది. ఇంక వంగబడి గట్టిగానే ఊడ్వ బడ్తిని. నెల రోజులవట్టి చెప్తున్న కొత్త చీపురుకట్ట పట్టుకరమ్మని. తెస్తలేరైతిరి". మొండి చీపురును ఆడిస్తూ అన్నది రాధ
" గివ్వెమో మార్కెట్లో దొరుకవాయే. ఆ చీపుర్లు అమ్మే లచ్చవ్వ కూడ ఈ నడ్మ కనవడ్తలేదు",
ఇంతలోనే బైట "చీపుర్లమ్మ, కొండ చీపుర్లు" అనే మాట వినొచ్చిం ది.
"అమ్మ, అమ్మ మాటల్లోనే వచ్చింది చీపుర్లు అమ్మేది. ఓ నాలుగు కొనిపెట్టమ్మ పడి వుంటై "అంది రాధ. అంటూనె చేతిలో ఉన్న చీపురు పక్కన పడేసి వాకిట్లోకి వెళ్లి, "ఓ చీపుర్లమ్మ! ఇక్కడికి రా', పిలిచింది మొండి చీపురుతో వంగి ఊడ్వటం రాధకు కష్టంగా వుంటుంది.
కౌసల్య కూడా వాకిట్లోకి వచ్చింది .
"ఓ లచ్చమ్మ బాగున్నవానే? శాన రోజులాయె, ఈ నడ్మ ఇటు కనబడ్తలేవు", పలకరిచింది కౌసల్య
"నా పానం బాగుంటలేదు. ఏం జెయ్య. అయిన చేసుకోకపోతె ఎళ్లదాయె. రెండు కట్టలియ్యమంటావా ?" నెత్తిమీద కట్టలను కింద పెట్టి కూచుంది లచ్చమ్మ
"కట్టలు బాగా సన్నగున్నయి. ఎంతకిస్తున్నవు?" వంగి చీపురుకట్ట పట్టుకొని చూస్తు అడిగింది కౌసల్య
"ఇరవై ఐదు కొకటి".
"రెండునెల్ల కింద పదిహేనుకే ఇస్తివి కదా", ఒక చీపురు పట్టుకొని అటు ఇటు ఆడిస్తూ అంది రాధ.
"ఔను పదిహేనుకిచ్చినవు , అవి ఇంత కంటే మంచిగుండె. ఇప్పుడు రెండు కలిపితే కాని ఓక కట్ట మంచిగయెటట్టు లేదు . ఎప్పడు తీసుకునేదాన్ని, బాగా సన్నగున్నై. పన్నెండు కియ్యి" . కౌసల్య బేరం మొదలు పెట్టింది.
"పడదమ్మ పడదు. నాకే ఇరువై నాలుగు పడ్డది". కచ్చితంగా చెప్పింది లచ్చమ్మ
"గట్లంటె ఎట్ల? రెన్నళ్ళకె ధరలు రెండింతలైతె ఎట్లనే? మామూలు నెల జీతాల మీద మేమెట్ల బతకలే?
"నువ్వే గట్లంటే మా అసుం టోల్లు ఏమనాలే?" ఎదురు ప్రశ్నించింది లచ్చమ్మ
"ఏం ధరలో ఏం పాడో. ఇచ్చె ధర చెప్పు". కొనక తప్పని పరిస్థితి గుర్తొచ్చింది కౌసల్యకి
"ఎప్పుడు కొనేదానివి. నీకెక్కువ చెప్తానమ్మ? కొండ చీపుర్లు దొరుకుడె కష్టముందమ్మ. పొద్దంత తిరిగి అమ్ముకుంటే కట్టకో రూపాయి పడ్తది". తన కష్టాన్ని చెప్పుకుంది
ఇంతలోనే అక్కడకు కౌసల్య కూతురు లక్ష్మి వచ్చింది. ఆమె స్కూలు డ్రెస్ వేసుకొని వెళ్ళడానికి రెడి గా వుంది.
"అమ్మ, నాకో చీపురుకట్ట కావాలే". చీపుర్లని చూసి అడిగింది.
"ఎందుకు చదువు బందు పెట్టి రోడ్లు ఊడ్వ బోతవా", చికాకుగా అంది కౌసల్య
"కాదమ్మ. మా స్కూల్లో ఎల్లుండి స్వచ్చ భారత్ ప్రొగ్రాముంది. నేను క్లాసు లీడరు కద. అందులో వున్న. ఎమ్మల్యే కూడా వస్తడట. టివి ఛానెల్ వాళ్ళు కూడ వస్తరట. అందుకని మా టీచరు ఒక చీపురు తెచ్చుకోమంది".
"ఇంక నయ్యం . పాయఖానా కడిగే బ్రషు చెంబు తెమ్మనలేదా ?"
"కాదమ్మా , మన .." లక్ష్మి మాట్లాడుతుంటే మధ్యలోనే లచ్చమ్మ అందుకుంది. " ఓ తల్లి , కొంటవో కొనవో చెప్పు. నేను పోవాలె".
"గంత తొందరపడ్తవేందె. ఇరవైకోటన్న ఇవ్వు . పొద్దున్న లేస్తే ఇల్లు వాకిలి ఊడ్వకుండ నడుస్తదా?"
"తక్కువేమీ లేదమ్మ. రెండియ్యానా?" కరాఖండిగా అంది లచ్చమ్మ
"యాభైకి మూడివ్వు. మూడు తీసుకుంటా".
"నాలుగు తీసుకున్నా వందకిస్త. కావాలంటే వున్న వాట్ల పెద్దవి ఏరి తీసుకో. నీకని ఇస్త." మాటలో కాస్త మెత్తదనము
"వామ్మో, చీపురు కట్టలు గింత పిరమైతే ఏట్లా. ఎం జేస్తం. రెండు ఇయ్యి", తప్పదన్నట్టు అన్నది.
రెండు కట్టలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది కౌసల్య .
హాల్లో కూర్చొని టీ తాగుతున్నాడు నారాయణ.
"ఇంకో రెండు తీసుకోక పోయినవా ?
"మొన్న మూడు నెల్ల కింద వచ్చినప్పుడు ఇంతకంటె మంచిగున్నవి పదిహేనుకోటిచ్చింది. ఇప్పుడు ఒక్కోటి ఇరవై ఐదంటుంది"
"బేరము విన్నలె. ఎందుకైనా మంచిది. ఇంకో రెండు తీసుకో". లేచి తన పాంటు జేబులోనుండి వంద నోటు తీసిచ్చాడు నారాయణ
"వో అమ్మ. నేను బోతా." బైటనుండి లచ్చమ్మ అరిచింది.
"తొందర పడ్తవేంది. వస్తున్న . ధర ఎక్కువనే గని మళ్ళెప్పుడోస్తవో. ఇంకో రెండివ్వు".
"గీవి మంచిగున్నై, తీసుకో. రాన్రాను ఇవ్వి కూడ దొరుకతాయో లేదొ. మా సేటు చెప్తుండె. చీపురు కట్టలన్ని డిల్లికి పోతున్నయట . అక్కడేదో పార్టి గుర్తు చీపురు కట్టేనంట. అక్కడ వాళ్ళు చీపుర్లను అందరికి పంచుతరంట. గందుకే ధరలెక్కువైనయంట". మాట్లాడుతూ వంద నోటుని తీసుకోని ఒక చిన్న పర్సులో పెట్టుకుంది. మిగిలిన చీపుర్లను కట్టగట్టుకొ తలమీద పెట్టుకొని " చీపుర్లమ్మ, కొండచీపుర్లు" అంటు వెళ్ళింది
మరో రెండు కట్టలను పట్టుకొని ఇంట్లోకి వస్తు, "విన్నావా అదేమన్నదో", భర్తను అడిగింది.
"వినబడ్డది, వినబడ్డది. ఇంకాసేపుంటె స్వచ్చ భారత్ గురించి కూడా చెప్పేదనుకుంట".
"ఈ చీపుర్ల పార్టీ ఏందో, స్వచ్చ భారత్ ఏందో ఈ ధరలు పెరుగుడెందో! స్వచ్చ భారత్ ఒక్క రోజులో అయ్యెదా? పెద్దపెద్దోలంత స్టైల్ గ డ్రెస్ ఏసుకొని,షోగ్గా తయారై ఓ గంటో, పావుగంటో రోడ్లమీద చీపురు కట్టలు పట్టుకొని ఫోటోలకు నిలబడితే ఏమొరుగుతది. ఎవరి ఇల్లు, ఎవరి వాడా, ఎవరి ఊరు వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటే మంచిది". వాస్తవాన్ని చెప్పింది కౌసల్య " చిన్నప్పటి నుండె పరిశుభ్రత, ఆరోగ్యము గురించి పాఠాలు కరెక్టుగా నేర్పితే దేశము బాగుపడదా".
"దానికి చాల టైమ్ పడుతుంది. ఇప్పుడు ఈ పెద్దోళ్ళంత చేసేది ఉత్త ప్రచారమే".
"ఏమి ప్రచారమో! మన లక్ష్మి స్కూల్లో కూడ స్వచ్చ భారత్ వుందట. దానికో చీపురు కావాలట!"
"అమ్మ, ఒక కొత్త చీపురు ముళ్ళు దులిపి పెట్టు. ఎల్లుండి నేను తీసుకెళ్త".
"ఉత్తుత్తి ఊడ్చుడికి కొత్తదెందుకు?"
"ఫోటోలు తీస్తరు, టివిలో కూడ రావచ్చు కద. మొండిదైతే ఏంబాగుంటది. నాకైతే కొత్తది కావలె . మళ్లి ఇంటికి పట్టుకొస్తలే".
"దానిని అట్లాగే పెట్టు. మా ఆఫీస్లో కూడ ఈ ప్రోగ్రాం వచ్చె వారం వుంటదనుకుంటా. ఈ ఆదివారము మన కాలనీలో కార్పరెటరును పిల్చి స్వచ్చ భారత ప్రోగ్రాం పెడ్తరట". విషయాలు వివరంగా చెప్పడు నారాయణ
"ఎన్నడు ఊడ్వనోళ్ళు ఒక్కనాడు వో గజం జాగాలో చీపురాడించి గొప్పగా ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ ఆ పని చేసె మమ్మల్ని మాత్రం ఒక్కరు ఫోటో తీయరు", నిరాశగా అంది రాధ.
"చాల్చాల్లె. నీ ఎన్క నీను చేస్తలేనా. టైం తొమ్మిది కావస్తుంది. తొందరగా ఊడ్వు. ఈ ఫోటోలు, ప్రోగ్రాములు ఏమో గని కొండ చీపుర్ల ధరలు కొండెక్కినవి. కేజ్రివాల్ చీపుర్లు పంచి ఓట్లు బాగానే తెచ్చుకుంటడెమో! "
అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది
ఇల్లంతా నాకింది
ఓ మూల నక్కింది
అట్లాంటి చీపురు ఇప్పుడు సెలబ్రిటీ అయింది. ఎంతో మంది సెలెబ్రిటల చేతిలో హస్తభూషణమై ఎన్నెన్నో ఫోటోలలో వస్తుంది. టివీలో అందంగా కనబడ్తుంది.
అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
అవినీతిని తరుముతన్నది
ఆమాద్మి గుర్తైంది
స్వచ్చతకు పేరైంది
సెలబ్రిటిలకు చెరువైంది.
No comments:
Post a Comment