Saturday, July 25, 2015

Godavari Mahapushkaralu

గోదావరి మహాపుష్కరాలు 

పుష్కరాలు వచ్చినయి .  పుణ్యస్నానాలైనయి .  ఆది పుష్కరాలు  ఇవ్వాల ఆఖరౌతున్నయి.  పోటి పడి తెలుగు రాష్ట్రాలు  రెండు పుష్క రాల గురించి బాగా ప్రచారము చేసినవి.  తెలంగాణ రాష్ట్రములో తొలి పుష్కరాలు అవటముతో ప్రజలెంతో ఉత్సాహముతో పుష్కరాలకు వెళ్లొచిన్రు.  తెలంగాణలో పండగ వాతావరణమున్నది.  తెలంగాణా  అంతట   పుష్కరాల ముచ్చట్లె.  పుష్కరాలకు పోకపోవడము ఓ పెద్ద విన్తైంది.
గోదావరికి ఈ ఏడాదంత పుష్కరాలున్నా మొదటి పన్నెండు రోజులు, ఆఖరి పన్నెండు రోజులకు బాగా ప్రాముఖ్యత వుంటుందట.  అందులోను మొదటది (ఆది పుష్కరాలు )  అంత్య (చివర వచ్చే)  పుష్కరాలకంటె మరింత ప్రాశస్త్యమని అనటంతో జనాలు పాపాలన్నీ పోగొట్టుకోవటమే కాదు పుణ్యము కూడ  మూట కట్టుకుందామని పెద్ద సంఖ్యలో నది సందర్శనానికి అందులో మునకలు  వెయ్యడానికి వెళ్ళింరు.  వేరె రోజుల్లో నదిలో స్నానం  చేసినా , మూడు మునకలు వేసినా  అంత పుణ్యం రాదంట.  సరే. పాపలు పోగొట్టుకోవటము, పుణ్యము సంపాదించుకోవటము మంచిదే కదా!  తెలియక పాపాలు చేస్తె పోని, తెలిసి చేసిన పాపలు కూడా ఈ స్నానముతో కొట్టుకుపోతయా?  నా డౌటు.  మళ్ళి  తెలిసి తెలియక పాపాలు చేస్తే మళ్ళి మన తెలుగు రాష్ట్రాల్లో అవి కడిగేసుకోవడము ఈ ఏడాదంత సులువే.  మళ్ళి ఏడాది జులై లో పుణ్యము కూడ సంపాదించుకోవచ్చు.
పుష్కరాల సందర్భంగా మరో విషయము తెలుసుకున్నాను.  మన దేశంలో వున్న నదులన్నిటికి  పుష్కరాలు వస్తాయి. ఆ లెక్కన మన దేశంలో ప్రతి ఏడు ఎక్కడో అక్కడ ఏదో నదికి పుష్కరము వస్తనే వుంటది. మన తెలుగు రాష్ట్రాల్లో వేరే నదులు కృష్ణ, తుంగభద్రా, ప్రాణహిత నదులకు కూడ పుష్కరాలు వస్తాయి. సో, ఎవరు భయపడక్కర్లేదు.  ఎన్ని పాపలు చేసినా కడిగేసుకోవడానికి నదులు, పుష్కరాలు మనకు వున్నయి.  నదులున్నంత వరకు మనం ఏం చేసిన స్వర్గములో సీటు రిజర్వన్నట్టే!
మనకు వున్న జీవనదులను మనము కాపాడుకుంటున్నామా?  నీరు లేకపోతె జీవితము లేదు, జీవనము లేదు, జీవములేదు. అభివృద్ధి పేరుతో మానవుడు చేసే  కార్యక్రమాలు  ప్రకృతి విధ్వంసానికి కారణమౌతున్నాయి.  ఆది  మానవుడు నదుల గోప్పతన్నాన్ని అవసరాన్ని గుర్తించి వాటిని   పూజించ టము  మొదలు పెట్టాడేమో .  ప్రతి తరము ఆ విషయాన్ని గుర్తుంచుకొని నదులను, నీటి వనరులను, వాటి పరిసరాలలో వుండె ప్రకృతిని  కాపాడుకోవటానికి ప్రతి ఏడు ఒక నదికి పుష్కర పూజలు ఏర్పాటు అయినైయనుకుంట.  ఆ ఏడాదంత ఆ నది పరివాహక ప్రాంతమును ప్రకృతి నియమాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాలికలు చేసుకొని మరో పుష్కరము నాటికి వాటిని అమలు చేస్తే ఎంతో బ్రహ్మాండంగా వుంటుంది!  ఆది నిండుగా వున్నా, ఎండినా అక్కడ ప్రజల చైతన్యానికి, జీవనశైలికి సూచికగా తీసుకోవచ్చు.  మహాపుష్కరాల నాటికి అక్కడ వుండె సంస్కృతి, ప్రజా జీవనము అక్కడ ప్రజలు వారి ప్రకృతిని ఎట్లా కాపాడుకున్నది అక్కడ పారే నది తెలియజేస్తుంది.
ఉత్తర భారతంలో సరస్వతి నది కేవలము అంతర్వాహినిగా వుంటుందని చెప్తారు.  అంటే ఒకప్పుడు సరస్వతి అనే నది వుండేదని, అది ఇప్పుడు ఎండి పోయిందని అనుకోవల్సిందె.  మనము పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకొనక పొతే నదులు ఎండిపొయె అవకాశమున్నది.  హైదరాబాదులో వంద ఏళ్ళ క్రితం మూసి నది ఎట్ల వుందో ఇప్పుడు ఎట్ల వుందో చూస్తె మనకు నదులు ఎట్ల మాయమైతయో, మురికి కాల్వలుగా ఎట్ల మారుతాయో అర్థమౌతుంది. అట్లాంటి స్థితి మరి ఏ నదికి రాకుండా, కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పుష్కరాల సందర్భంగా అందరు గుర్తు పెట్టుకోవాలి.    
ఈ గోదావరి మహాపుష్కరాన్ని ఎక్కడా మొకాలులోతు మించి లేని నీళ్ళలో మనము ఘనంగా జరుపుకున్నము.  గొప్పలకు పోయి ఓ రాష్ట్రములో ప్రజల ప్రాణాలు బలి అయినవి.  ఈ  పాపము ఎవరిది?  ఈ పుణ్యము ఎవరికి?  మళ్ళి  గోదావరి మహాపుష్కరాల నాటికి ఈ నది ఎట్లా పారుతుందో, ఆ తరం ఈనాటి ఈ పుష్కరాల నుండి నేర్చుకున్న పాఠాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుందో?
పర్యావరణ రక్షణ సకల జీవుల సంరక్షణ.