Sunday, December 20, 2015

Monkey Menace

కాజీపేట కోతులు 

అరణ్యాలు తగ్గిపోతున్నయి.  నగరాలు పెరిగిపోతున్నయి.  అడవులు నాశనము అవుతుండటంతో అడవులో ఉండాల్సిన జంతువులు పట్టణాల్లో జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నయి.  ఈ మధ్యే నేను చదివిన.  ముంబైలో చిరుతలు అపార్ట్ మెంటు చుట్టుపక్కల తిరుగుతున్నాయని.  ఆ అపార్ట్మెంట్లు వో పెద్ద పార్కు పక్కనే వున్నయి.  అందులోని చిరుతలే తప్పించుకొని అప్పుడప్పుడు చుట్టు పక్కల షికారుకు వచ్చి, అవకాశముంటే ఏ కుక్కనో మేకనో లేదా అందుబాటులో వుంటె చిన్న పిల్లల్నో నోట కరచుకొని పోతున్నాయంట.  అడవులు పోయి, కావాల్సిన వేట లేకపోతె అవి మాత్రం ఏం చేస్తయి ? 
సరే.  ఆ క్రూర మృగాల సంగతి వదిలేద్దాం.  కోతుల బెడద అందరికి తెల్లిసిందె.  ఊళ్ళలోనె కాదు పట్టణాళ్ళలో వీటి బెడద బాగానే వుంటుంది.  మన దేశంలో దాదాపు అన్ని తీర్ధయాత్రా స్థలాల్లో వీటిని తప్పించుకు తిరుగటం కష్టమే అయితుంది.  సికింద్రాబాదు నుండి వరంగల్లుకు వచ్చే దారిలో వుండె అన్ని స్టేషన్లలో కోతులు చాలానే కనబడుతయి. 


 మాకు హన్మకొండ, వరంగల్లులో చెప్పనలవి కాని కోతుల బెడద వుంటుంది.  ఒక్కొక్క రోజు గుంపులుగా కోతులు వచ్చి నానా హంగామా చేస్తయి.  చుట్టు పక్కల పండ్ల చెట్లు వుంటే ఆగమాగమె.  ఆకులు, కాయలు, పండ్లు అన్ని తెంపెస్తయి.  కొమ్మ ఊయలలు ఊగుతయి.  కొమ్మల్ని విరిచేస్తయి.  ఆరేసిన బట్టలుంటే చింపేస్తయి కూడ (ఓ సారి నా కొత్త చీర చించి పడెసినవి).   పళ్ల వాసన వాటి బాగా తెలుస్తుందనుకుంటా.  చాలా సార్లు మా ఇంట్లోకి వచ్చి సరాసరి డైనింగ్ టేబుల్ మీద, లేదా అ పక్కనే షెల్ఫ్ లో అరటి పండ్లు కవరులో వున్నా, పేపరులో చుట్టి నవి వున్నా అందుకొని పోయి బాల్కని గోడపైన కూర్చొని నిమ్మళంగా తిన్న వరకు తిని పడేసి పోతవి.  కోతుల అలికిడి వినబడాగనె ( బైట ఎవరో చో,చో అని గట్టిగ అరుస్తున్నరంటే దగ్గర్లో కోతులున్నట్టె) వెంటనే నేను తలుపులు పెట్టేస్తను.


మొన్నీమధ్యే  విన్నాను, వరంగల్లులో కోతుల దాడిలో ఓ వ్యక్తీ చనిపోయాడని.   దాడిలో గాయాలు కావటము మామూలే కాని చనిపోయాడని వినటం ఇది మొదటి సారి. 
కోతులు కరిస్తే రేబిస్ వాక్సిన్ తీసుకోవాలి. 
మనం సుఖంగా జీవించాలంటే ఇతర జీవులను కూడ వాటి జాగాలో వాటిని బతకనియ్యాలి.  సో, అడవులను పరిరక్షించాలి.  పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి.  అప్పుడు మన వాతావరణము కూడా మెరుగవుతుంది.  జన జీవనం కూడ  బాగు పడుతుంది