జయహో తెలంగాణ
తెలంగాణ రాష్ట్రము ద్వితీయ ఆవిర్భావ దినోత్సవము జరుపుకుంటున్నది. రాష్ట్రమంతా పండుగ వాతావరణము నెలకొన్నది. ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రములో, ప్రజల్లో ఎంత మార్పో! కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజల కొన్ని ఆశలైతే నెరవేరుతున్నయి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రములో జరిగిన అన్యాయాలు విపులంగా తెలిసి ఆ దుష్ట కౌగిలి నుండి బయట పడ్డందుకు ఎంత సంతోషంగా వున్నదో. తెలంగాణ ప్రజలందరికి తెలుసు సోనియా గాంధి వల్లనే తెలంగాణ వచ్చిందని. ఎప్పుడో అప్పుడు ఇది జరగక తప్పనిదె. ఏ ప్రజలైనా, ఎంత తెలివితక్కువ వారైనా అన్యాయాన్ని ఎన్నాళ్ళు సహిస్తరు? కాలం కలిసివచ్చింది. జయశంకర్ సర్, ఇంకా ఎంతో మంది విద్యావంతులు చేసిన భావ వ్యాప్తి, KCR రాజకీయ శక్తియుక్తులు, కోదండ రామ్ నాయకత్వంలో JAC అవిశ్రాంత పోరాటము, సోనియా గాంధి మాట నిలుపుకోవాలనే పట్టుదలతో వుండటము వల్లనే ఇది సాధ్యమైంది.నాయకుడు గొప్పె. నాయకుని వెంటే ప్రజలున్నరు. నాయకులు నడిపించినరు. ప్రజలు, ముఖ్యంగ యువత త్యాగాలు చేసిన్రు. ఆట పాటలతో, అహింసతో, ప్రాణత్యాగాలతో ప్రపంచములోనే కనివిని ఎరుగని విధంగా అద్భుతంగా సాగిన పోరాటము వల్లనే తెలంగాణ సిద్ధించింది. ఇది నాయకులను చిరంజీవులను చేసింది. ప్రాంతంలో, ప్రజల్లో ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచింది.
ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ. సాధించుకున్న ఈ తెలంగాణ నిలదొక్కుకోవాలంటే KCR సరైన నాయకుడు. ఉద్యమనాయకుడు, రాజకీయ చతురుడు, మేధావి, ఆలోచనాపరుడు, అయిన కెసిఆర్ మాత్రమె ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలడని ప్రజలంతా నమ్ముతున్నరు. KCR తను ప్రాణాలు ఫణంగా పెట్టి సాధించిన రాష్ట్రాన్ని 'సుజలాం సుఫలాం సస్యశ్యామలం' చేయటానికి నిరంతరము కృషి చేయటము ప్రజలంతా గమనిస్తున్నరు. ఆ నాయకుడు కలకాలం ఆయురారోగ్యాలతో వుండాలని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని తెలంగాణ ప్రజానీకమంతా కోరుకుంటున్నరు.
జై తెలంగాణ ! జయహో తెలంగాణ !!