Friday, June 7, 2024

గెలుపోటములు

 


సామాన్యంగా గెలుపోటములు దైవాధీనములని అంటారు.  ప్రజాస్వామ్యములో ఎన్నికల్లో అవి ప్రజాధీనాలు.  ముఖ్యంగా పల్లె ప్రజలు, వెనుకబడిన వారి ఆధీనమనుకుంట.  దైవము దీనబంధు కదా!  ఎవరు ఎన్ని చెప్పినా, ఉచితాలు ఇచ్చినా, వారి స్వంతం చేసుకున్న అన్ని మీడియాల ద్వారా ఎంత ప్రచారము చేసినా అట్టడుగున వున్న ప్రజలు,  - అంతవరకు నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసిన ఏమి చేయలేక భరించిన ప్రజలు, దీనులు, హీనులు,-  ఓటు అనే ఆయుధాన్ని సగర్వంగా వినియోగించి సాక్షాత్తు భగవంతుని అవతారము అని అహంకారము ప్రదర్శించే నాయకులకు వారి స్థానాన్ని తెలియచేస్తారు.   చదువుకున్నా, నిరక్షరాస్యులైన, ఏ కులానికి వర్గానికి చెందినా యుక్తవయస్కులైన భారతీయులందరికి ఓటు హక్కును కల్పించిన మన రాజ్యాంగానికి, రాజ్యాంగ ప్రదాతకు మనమంతా శిరస్సు వంచి నమస్కారిచాల్సిందే.

ప్రజలు ఎడ్డివారూ, గుడ్డివారు కాదు. వారు ప్రతిరోజూ జీవిస్తూ వారి స్థితి సమాజ స్థితి గమనిస్తూ ముందుకుపోతుంటారు. దానికి చదువు అవసరము లేదు. తెలివి వుంటే చాలు.  వారి నాయకుడు ఎన్నికైనప్పటినుండి వారి స్థానానికి, అక్కడి ప్రజలకు ఏమి చేస్తున్నాడో చూస్తూనేవుంటారు, తెల్సుకుంటూనేవుంటారు.  ప్రజలపట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అందరికీ తెలిసిపోతూనే వుంటుంది.  అంతా బహిరంగ రహస్యమే.  గెలిచిన నాయకులు, స్థానికంగా ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ, స్థానిక ప్రజల సమస్యలు తీర్చడానికి కాస్తైనా పనిచేస్తే ఆ నాయకుడిని పార్టీలకతీతంగా మళ్ళీ ఎన్నికునే అవకాశము ఎక్కువ. 

గెలిచిన నాయకులకు పదితరాలకు సరిపడే ఆస్తి సంపాదించిపెట్టుకోవాలనే ఆలోచన కాకుండా  తన స్థానిక ప్రజల జీవితాలు కొంతైనా బాగుపడాలని నిజాయతిగా ప్రయత్నిస్తే, సహకరిస్తే అ నాయకుడిని ప్రజలు మరుస్తరా? మళ్ళీ అడగకుండానే ఓటు వేసి గెలిపించరా?

  

Saturday, June 1, 2024

మార్పు

 


తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నరు. తెచ్చుకున్నరు.  ప్రభుత్వము మార్పుతో, ఇచ్చిన గ్యారంటీల అమలుతో స్త్రీలు లాభము పొందుతున్నారు.  కొన్ని పేద కుటుంబాలు కూడా లబ్ధి పొందుతున్నాయి.  ఇంకా పూర్తి చేయాల్సిన గ్యారంటీలు త్వరలోనే అమలు అయితాయని అంటున్నరు.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినంక పరిస్థితులు ఎలావుంటాయో వేచి చూడాలిమరి.

ఇప్పటికీ తెలంగాణ వచ్చి ఒక దశాబ్ది అయింది.  కొత్త ప్రభుత్వం వచ్చినంక బయటపడుతున్న విషయాలు వింటుంటే, చూస్తుంటే తలతిరిగి పోతుంది.  నాకు తెల్సి ఒకరు అంటుంటారు, జో తెలంగాణ లాయ వో తెలంగాణ ఖాయ”.  చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే ఘనుడు ఎంతమంది యువత తెలంగాణ కోసం ఆత్మత్యాగలు చేశారు, తెలంగాణలో అన్ని వర్గాల వారు ఎన్నిరకాలుగా  సమ్మేచేశారో, రోడ్లుఎక్కి కేసుల్లో ఇరుక్కున్నారో, ఎంతమంది మేధావులు వెంటవుండి అన్ని వర్గాల వారిని కూడగట్టుకొని నడిపిస్తే తెలంగాణ కల సాకారమయిందో మర్చిపోయిండు.  తానే రాజనుకున్నడా దొర.  తెలంగాణ తన జాగీరు అన్నట్టు మేదిలిండు. కోట్లు కోట్లు దోచుకున్నడు.  ఈ దొరకు ప్రజాస్వామ్యములో వుండాల్సిన స్థానమేంటి?  ప్రజలు నిర్ణయిస్తరు.  నిర్ణయించారు.

దశాబ్ది కాలములో కాలానుసారంగా కొన్ని మార్పులు వచ్చాయి.  కొత్త రాష్ట్రానికి కొన్ని మార్పులు వచ్చాయి.  రాష్ట్రగీతం మాత్రము రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వము రాష్ట్రగీతాన్ని రేపు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో ఆవిష్కరించటము చాలా సంతోషించాల్సిన విషయము.  తెలంగాణ ఉద్యమములో అందరినీ ఉత్సాహపరిచి గుండెలు ఉప్పొంచిన గీతం. ఇప్పుడు కూడా తెలంగాణ వారి గుండెల్లో ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపే గీతము.

కొత్తగా తెలంగాణ రాజముద్ర వస్తుందని అంటున్నరు.  ప్రభుత్వాలు మారినప్పుడంతా కొత్త రాజముద్రలు వస్తాయంటే కష్టమనుకుంట.  రాష్ట్రము ఏర్పడిన కొత్తలో కొన్ని పోరపాట్లు జర్గివుండొచ్చు.  నాటి ముఖ్యమంత్రి నియంతలాగా, లోకంలో తానే ఏకైక మేధావిలాగా ఏకపక్షనిర్ణయాలు తీసుకున్నారు కూడా.  అందులో ఓరుగల్లు వాసులకు అస్సలే నచ్చని విషయము వరంగల్లును ముక్కలు చేయటము. ఓరుగల్లు, పోరుగల్లు పిడికిలి బిగిస్తే ఎప్పటికైనా విజయభేరి మొగవలసిందే.  అందుకని దీన్ని ముక్కలు చేసి ఆ పిడికిలి బిగించే శక్తి తీసివేయాలనుకున్నడేమో ఆ రాజకీయనాయకుడు.  తనకు ఏ ప్రజాశక్తి ఎదురు తిరుగకూడదని పోరుగల్లుని ముక్కలు చేశాడు. 

ఓరుగల్లు కాకతీయ తోరణము ఒక రాచరికపు ఆనవాలు మాత్రమే కాదు.  కాకతీయ సామ్రాజ్యము అనగానే గుర్తుకువచ్చేది నారీ శక్తి, రాణి రుద్రమదేవినే కాదు సమ్మక్క సారలమ్మ పోరాటశక్తి.  కాకతీయులు ప్రజాభివృద్ధికై ప్రతి ఊరికి గుడులు కట్టటమే కాదు చెరువులు తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు.  తెలంగాణ రాజముద్రలో అమరవీరుల స్థూపం ఎంత ముఖ్యమో కాకతీయ తోరణము చారిత్రాత్మకంగా అంతే ముఖ్యమని నా భావనా.  అధికారములో వున్నవారు సామాన్యుల మాటలు పట్టించుకుంటారా? 

ప్రజాస్వామ్యములో సామాన్యులే అధికారములో ఎవరు వుండాలో నిర్ణయిస్తరు.

అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.