ఈ లోకంలో ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యెకత వుంటుంది. భిన్నమైన జీవన విధానము వుంటుంది. జీవుల్లన్నింటిలో మానవుడె తెలివైన వాడు. ఆడవుల్లో, కొండ గుహల్లో జంతువులతో కలిసి వున్న ఆది మానవుడు నాగరికత నేర్చి నగరాలు నిర్మించి అన్ని జీవులపై ఆధిపత్యము చేస్తున్నడు. ప్రకృతిని నియంత్రించే స్థాయికి చేరుకున్నడు.
మానవుడు తొలుత మచ్చిక చేసుకొని తన అవసరాలకు ఉపయోగించుకున్న జంతువు కుక్క. పెంపుడు జంతువుల్లో ముఖ్యమైనది, మానవుని జీవితంలో భాగమైనది కుక్క. తొలుత వేట కుక్క, తర్వాత కాపలా కుక్కగ వుండి ఇప్పుడు పెంపుడు జంతువుగా మానవునితోనె కల్సి ఒకే కప్పు కింద వుంటుంది. కుక్క అడవిని వదిలి మానవునితొ నాగరిక జీవనానికి్ అలవాటు పడింది.
కుక్క మానవునికి ఎన్నో విధాల తోడ్పడుతుంది. దాని వాసన పసిగట్టే సునిశిత బుద్ధిని నేరస్తులను పట్టుకునేందుకు, ఇతర మానవ హానికర వస్తువులను కనుగొనడానికి రక్షణ శాఖ ఉపయోగించుకుంటుంది. ఒంటరి మానవునికి కుక్క తోడుగా వుండి మానసికోల్లాసము కలిగిస్తుంది.
విశ్వాసానికి కుక్క మారు పేరు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తె మన దేశంలో కుక్కలను పెంచుకోవడము తక్కువే. అయినా మనము ప్రతి ఊళ్ళొ (ఊర కుక్క) వీధిలో (వీధి కుక్క) కుక్కలను చూస్తున్నం. ఈ కుక్కలు ఆ వాడలో వుండె వాళ్ళు దయతల్చి పెట్టె పాచితిండితో, చెత్తకుప్పల దగ్గర పడేసిన తిండితో కడుపు నింపుకుంటయి. అవి ఊరి మనుషులను , వాడ మనుషులను బాగానే గుర్తుంచుకుంటయి. అటు వైపు ఎవరైనా కొత్త వారు, అనుమానస్పద మనుషులు, జంతువులు వస్తే మొరుగటమే కాకుండ వారి(టి)ని అక్కడ నుండి తరిమేయాడానికి ప్రయత్నిస్తయి. ఏ ఒక్క కుటుంబము/వ్యక్తి దానికో రెండు సార్లు తిండి పెట్టినా, కాస్తా దయగా చూసినా ఇక జీవితాంతము రుణ పడ్డట్టగా తోకాడించుకుంటు వెంట వెంట తిరుగుతాయి. అవసరమైనప్పుడు రక్షణగ నిలబడుతాయి. పశుల కాపరి కుక్కలు పశువులను మేతకు తీసుకెళ్ళినప్పుడు వెంట వుండి అడవుల్లో ఇతర జంతువుల నుండి వాటిని కాపాడటానికి, పశువులు దారి తప్పకుండా చూస్తయి. ఇంటి కాపలా కుక్క ఇంటికి పెద్ద రక్షణ. దాని నిద్ర చాలా తెలికైంది. ఏ కొంచెం అలికిడైనా వెంటనే మెల్కోని చెవులు రిక్కించి విని, అవసరమైతె మొరిగి యజమానిని మేల్కోల్పుతుంది. ధనవంతులు మనుషుల కంటె కాపలాకు కుక్కనే ఎక్కువ నమ్ముతరు. పెంపుడు కుక్కైతె ఇంట్లో మనిషి కిందె లెక్క. అది పిల్లలతో అడటము, వారి వెంట బజారుకు వెళ్ళటము, వారికి రక్షణగ వుండటము చేస్తుంది. ఈ పెంపుడు కుక్కలు మనిషి హవభావాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా కూడా మెదులుతాయి. కొన్ని కుక్కలకు శిక్షణ ఇచ్చి అంతరిక్షములోకి కూడ పంపుతున్నరు.
మానవుని జీవితములో ఇంతగా కలిసిపోయిన జంతువు మరేది లేదు. అయినా కుక్కను అంతా హీనంగా చూస్తము. దానిని ఎంతగా దగ్గరకు తీస్తమో అంతె నిర్లక్ష్యంగా తంతము. ఎన్నో సామేతలు నానుడులు కుక్కబతుకును చాలా హీనంగ చూపెడ్తయి. చాలా తక్కువస్థాయి పనిచేస్తు, ఎవరి దగ్గరైనా జీతానికి పనిచేస్తుంటె వాడిది కుక్క బతుకని అంటము. పిచ్చిగా ఇష్టము వచ్చినట్టు మాట్లాడుతుంటె కుక్కలా అరుస్తున్నవేందని, లేదా వాడో పిచ్చి కుక్కని అంటము. మనకు ఇష్టములేని, చాతకాని వ్యక్తి మనమీదికి వస్తె పోరా కుక్క అని అంటము. ఒక నిస్సహాయ వ్యక్తికి సహాయము చేయమని మరొకరిని అడుగుతు, సహాయము చేస్తె కుక్కలా పడివుంటడని చెప్తము. కొన్ని సార్లు సహాయము కోరే వ్యక్తె కుక్కలా మీ కాళ్ళ దగ్గర పడి వుంటనని అంటడు. ఎవరైనా వ్యక్తి అదాటున ఏమైనా చేస్తె ఏంటి, కుక్కకు కల బడ్డట్టు అట్ల చేసినవని అడుగుతము. మనము సహాయము చేసిన వ్యక్తి మోసం చేస్తె వాడు విశ్వాసములేని కుక్క అని అంటము. ఎవరైనా చేసిన తప్పు మళ్ళి మళ్ళి చేస్తె కుక్క తోక వంకరన్నట్టు వాడి బుద్ధి అంతే్ అని విసుక్కుంటము. ఎవరైనా మోసము చేస్తె బుద్ధి చెప్పాలంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బని, అట్లాగే చేతకాని వాడి సహాయంతో ఏదైనా కార్యము సాధ్యము కాదని అనడానికి,కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదనట్టు అని అంటము. ఈ తిట్లన్ని విని పాపం కుక్క ఏమనుకుంటుందో కదా!
మానవుని జీవతములో ఒక ముఖ్య భాగమైన కుక్క నీచంగా చూడబడటానికి ఏమైనా శాపం వుందా?
ఆలోచిస్తె శాపం వుందనే నేనుకుంటున్న. ఒక చిన్న కథ. ఇంద్రుని దగ్గర సరమ అనె కుక్క వుంటుంది. స్వర్గలోకం నుండి ఇంద్రుని ఆవులను ఒకసారి అసురులు దొంగ చాటుగా పాతాళానికి తీసుకుపోయినరు. అప్పుడు సరమ వాసన ద్వార ఆ అవుల జాడ తెల్సుకొని మళ్ళి వాటిని స్వర్గలోకానికి తీసుకొచ్చింది. అందుకు ఇంద్రుడు సంతోషించి సరమకు తన సభలో ఆసనమిచ్చి చోటు కలిపించాడు. ఒకసారి సభకు దుర్వాస మహర్షి వచ్చాడు. ఇంద్రుడితో సహా అందరు లేచి రుషి స్వాగతము పలికారు. సరమ మాత్రము తోకాడించుకుంటు అట్లనే కూర్చుంది. (అందుకేనేమో కనకపు సింహాసనము మీద కూర్చున్న కుక్క బుద్ది కుక్క బుద్ధె అంటరు). దుర్వాస మహర్షికి అసలే కోపము ఎక్కువ కదా. సరమ గురించి తెలుసుకొని తనకు మర్యాద ఇవ్వని సరమ, దాని సంతతికి ఎప్పుడు ఎవ్వరు మర్యాద ఇవ్వరని శపించాడు. కుక్కలన్ని కూడ సరమ సంతానమే. ఆ శాప కారణంగానేనేమో మనము కుక్కలను ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటున్న, ప్రేమగా చూసినా అఖరకు ‘చీ, పో కుక్క’ అంటము.
మనకు ఎంతో సహాయంగా వుండె కుక్కలను మనము కాస్త దయతో చూద్దాము మరి!