Friday, July 14, 2017

పుట్టుక




పిల్లలు కొన్నిసార్లు వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు వాళ్లు అనుకున్నవి ఇవ్వనప్పుడు, తల్లిదండ్రులు వాళ్ళని ఎందుకన్నారని మనసులో అనుకోవచ్చు, గడుసు పిల్లలైతె డైరెక్టుగా తల్లిదండ్రులనే అడుగొచ్చు.  ఒక దంపతులు పిల్లలు కావలనుకుంటరు, ఎలాంటి సంతానం కావాలో, వారి గుణగణాలు ఎలా వుండాలో కూడ కోరుకుంటరు.  పిల్లలు పుడితె వారు కోరుకున్న గుణాలు వుండొచ్చు, లేక పోవచ్చు.  మరీ చెడ్డవారైతె, కొరకరాని కొయ్యలైతె ‘కడుపున చెడబుట్టా’రని తిట్టొచ్చు, ’పుట్టకపోయినా బాగుండే’దని బాధపడొచ్చు, ’అసలు నువ్వు నా కడుపునే ఎందుకు పుట్టా’వని పిల్లలను ఏ తల్లిదండ్రులు అడగరనుకుంటా.  పిల్లలు మాత్రం ’నన్ను ఎందుకు కన్నావని’ తల్లిదండ్రులను నిలదీసినంత పని చేయొచ్చు.
నాకైతె అన్పిస్తుంది.  తల్లిదండ్రులు పిల్లలను ఎంచుకోరు.  పిల్లలె తల్లిదండ్రులను ఎంచుకుంటరు.  పురాణాల్లో మనం చదువుతం, భగవంతుడు తను జన్మించాలనుకున్నప్పుడు తల్లిదండ్రులను ఎంచుకుంటాడు.  ఒక జీవి జన్మించాలనుకుంటే ఒక అత్మ ఉండాలి.  ఆత్మకు తనకు కావల్సిన జీవితాన్ని, దానిని ఇవ్వగల తల్లిదండ్రులను ఎంచుకునే జ్ఞానం వుంటుందనే నేను భావిస్తున్నాను. దంపతులు సంతానం కావలని కోరుకుంటరు.  పిల్లలే తల్లిదండ్రులను, లేదా తల్లిని ఎంచుకుంటరు.  గిఫ్ట్ పాక్ లో ఏముందో విప్పి చూస్తె కాని తెల్వదు.

వికసించిన పుష్పము పరిమళిస్తుంది.  దానిపై వాలె భ్రమరాన్ని ఎంచుకోగలదా?  వాలిన భ్రమరాన్ని తుష్టి చేసి సృష్టి కార్యక్రమాన్ని సాగిస్తు ప్రకృతిలో వడలి పోతుంది పుష్పం.






ఎందుకు పుట్టించావని 
అడగకు
ఎందుకు జన్మెత్తావొ
తెల్సుకో
నిన్నె, నిన్నె కావలని
కోరుకోలేదు
మరి నన్నె తల్లిగా/తండ్రిగా 
ఎందుకెంచుకున్నావొ
నీకే తెలియాలి.

అజ్ఞానంలో వుండి 
వచ్చావో
ఆనందంలో ఎంచుకొనే
వచ్చావో
జీవ రహస్యం
ప్రకృతికే తెల్వాలి







జీవి నీది, జీవితం నీది
జీవనమెలాగో
శోధించు గమ్యం
సాగించు పయనం

కాలి బాటలే కాదు
రహదారులున్నయ్
అడవిలో మల్లెలున్నయ్
ముళ్ళూ వున్నయ్
లోయలో సెలయేళ్ళున్నయ్
కొండ గుహల్లొ 
కోటి రహస్యాలున్నయ్
నీ దారినెంచుకో
రారాజు వలె సాగిపోతవో
గాయలతో ఆగిపోతవో
పరిమళాలాస్వాదిస్తు 
కాంతి పుంజమై
విశ్వాన్నె చుట్టెస్తవో
ఇసుక రేణువై 
సముద్ర గర్భంలో
ఒదిగి పోతవో

జీవి నీది, జీవితం నీది
జీవనమెలాగో 
ఎంచుకునే భారమూ నీదే.




No comments:

Post a Comment