Saturday, January 5, 2013

Live - Let Live

 బతుకు బతుకనివ్వు

 మన సమాజం ఎటు వెళుతుందో అర్థం కావట్లేదు.  నాగరికులమని, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లని గొప్పగా చెప్పుకుంటాము.  ఆచరణలోకి వస్తే మనుషుల ప్రవర్తన మృగాల కంటే హీనంగా వుంటుంది.  వాటితో పోల్చటము  ఆ జంతువులను అవమానించటమే.  క్రూర జంతువులైన ఆకలేసినప్పుడే వేటాడి తింటాయి.  తర్వాత ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తాయి .   జంటను కోరుకుంటే దానిని రకరకాలుగా ఆకర్షించి, గూడు ఏర్పాటు చేసుకొన్నాకే కలసి పిల్లలను కంటాయి.  ఆ పిల్లలు పెద్దై స్వయం పోషక శక్తి వచ్చే వరకు పోషించి, రక్షిస్తాయి.  జంతువులాగా వాటికి అంతే తెలుసు. 
  జీవాజతులన్నిటిలో మానవుడే ఘనుడు.  తెలివితేటలే కాదు,విజ్ఞయత, విచక్షణ మానవజాతి సొంతము.  ప్రకృతి వనరులు ఉపయోగించుకోవటము, ప్రకృతి రహస్యాలుచేధించటం, దానిని తన సౌఖ్యానికి వినియోగించుకోవటం మానవులకే సాధ్యం.  స్త్రీ పురుషులు ఇద్దరు వుంటనే మానవ మనుగడ. జాతి మనుగడ సాగింపులో, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీకి కావలసిన సంరక్షణ సాకుగా పురుషుడు ఆమెను నియంత్రిస్తున్నాడు.  ఆమెను ఒక పిల్లలు కనే యంత్రంగా, తనకు సేవలు చేయాల్సిన దాసిగా, చివరకు లైంగిక సుఖాన్ని ఇవ్వాల్సిన సజీవ మాంసము ముద్దగా చూస్తున్నాడు.  స్త్రీ తన తోటి మానవి అని తనలానే తెలివితేటలు విజ్ఞయత, విచక్షణ వున్న వ్యక్తి అని మర్చిరకరకాల ఆంక్షలు విధించి ఆమెను నాలుగు గోడల మధ్య బందీని చేసాడు.  ఎల్లప్పుడూ పురుషుని ఆధీనములో వుండాలని నియమలెన్నో చేసాడు. నాగరికత అభివృద్ధి చెందిన కొద్ది సమాజములో మార్పులు, స్త్రీల స్థితిలో మార్పులు మొదలయ్యాయి.  వీటికి విజ్ఞయత, నైతికత, మానవత్వం వున్నా పురుషులు ముందు నిలిచారు.
  వ్యవసాయ,పారిశ్రామిక విప్లవము, ప్రపంచ యుద్ధాల నేపధ్యములో సమాజము సక్రమంగా ఉంచడానికి, వ్యక్తిగత -మానవ హక్కులకై స్త్రీల పోరాట ఫలితంగా ప్రపంచములో కొత్త చట్టాలు, నియమాలు వచ్చాయి.  కాని ఈ చట్టాలన్నీ  పురుషులచేతనే చేయబడుతున్నాయి.  మన చట్ట సభల్లో ఎంతమంది స్త్రీలు వున్నారు?  అలాగే చట్టాలు చేసే ఎన్ని కమిటీల్లో స్త్రీలు వుంటారు?  ఒకవేళ ఒకరో ఇద్దరో వున్నా వారి మాటలకు ఇచ్చే విలువ ఎంత?  పురుషులు వారి దృష్టితొ  సమస్యను చూసి, విశ్లేషించి పరిష్కారాలు సూచిస్తారు.  స్త్రీలు కూడా అనాది నుండి ఎక్కువగా గృహనికే, నాలుగు గోడల మధ్య జీవించటము వలన వారికి బైటి ప్రపంచము గురించి తెలిసేది చాల తక్కువ.  అది కూడా పురుషుని కన్నులతో చూడటము, అదే అభిప్రాయాన్ని ఏర్పర్చుకోవటము జరుగుతుంది.  ఈ కాలములో కూడా పురుష భావదాస్యము నుండి, పురుషాధిఖ్య భావజాలము నుండి బైట పడినది చాల కొద్ది శాతము స్త్రీలు మాత్రమే. ఈ కొద్ది శాతము స్త్రీలను అణచివేయటము, వారి స్త్రీ హక్కులు, మరియు స్వతంత్ర జీవన  భావవ్యాప్తికి అడ్డుపడటము స్త్రీల ద్వారానే పురుష సమాజం చాల నేర్పుగా చేయగలదు, చేస్తుంది కూడా.
 నాలుగు గోడలు దాటి బైటకు వచ్చిన స్త్రీని మన సమాజము, ముఖ్యంగా పురుషులు చులుకనగా చూస్తున్నారు.  పురుషాధిపత్య శృంకలాలు తెంచుకు బైటకు వచ్చిన స్త్రీని ఒక విప్లవకారినిగా, సమాజ కట్టుబాట్లకు వ్యతిరకిగా ముద్ర వేసి ఆమె బ్రతుకును ఛిద్రము చేస్తారు.  స్త్రీలు రాణులై రాజ్యాలు ఏలిన , రాజకీయాలలో నిలదొక్కుకొని మంత్రులు, ప్రధాన మంత్రులుగా వున్నా,అంతరీక్ష యానాలు చేస్తున్నా, ఆర్థికస్వతంత్రురాలై ఇంటా బైట అన్ని కార్యాలు సమర్థవంతంగా  నిర్వహిస్తున్నా, పురుషులలో, ముఖ్యంగా భారత పురుషులలో స్త్రీల పట్ల సాటి మనిషిగా గౌరవము లేదనే చెప్పాలి.  స్త్రీని తమకు లోబడి వుండి, లైంగిక వాంఛలు తీర్చే సజీవ మాంసము ముద్దగానే చూస్తున్నారు.  స్వతంత్ర భావాలతో వ్యవహరించే స్త్రీని బరితెగించినదిగ, స్త్రీ లక్షణాలు లేనిదిగా, మగరాయుడని పలురకాలుగా నిందించటము, వేధించటం, ఆమె స్థైర్యాన్ని దెబ్బ తీసే విధంగా లైంగికంగా వేటాడి మానసిక హత్య చేస్తున్నారు.  అది తట్టుకొని నిలబడ్డ వారిని శారీరకంగా చిత్రవధ చేసి చంపుతున్నారు.  ఏ శరీరము వారికి లైంగిక ఆనందాన్ని ఇస్తుందో, ఆ శరీరాన్ని జుగుప్సాకరంగా చూడటమే కాదు, పాశవికంగా హింసించి రాక్షసానందాన్ని పొందుతున్నారు.  ఇంతటి నీచ నికృష్ట గుణము విశ్వములో ఏ  జీవజాతిలో వుండదు.
 స్త్రీల పట్ల నేరాలు తగ్గడానికి సత్వర ఖచ్చితమైన కఠిన శిక్షలు కొంత వరకు పనిచేస్తాయి.  కాని సమాజములో, ముఖ్యంగా పురుషుల మానసిక వైఖరిలో మార్పు రావాలి.    అంటే కుటుంబములో -తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావాలి.  పిల్లలకు వ్యక్తుల పట్ల - ఆడైనా మగైనా గౌరవించటము నేర్పాలి.
     ఒక తండ్రి తన పిల్లల తల్లి ఇంటికే  పరిమితమై సేవలందిస్తున్నా,ఆర్థిక స్వావలంబన కలిగి ఇంట బైట వ్యవహారాలు చక్కద్దిద్దుకుంటున్నా ఒకే విధమైన గౌరవము ఇవ్వాలి.  కుటుంబ బాధ్యతల్లో తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఆమెను అన్నింటిలోను భాగస్వామిని చేయాలి. సంఘము కూడా వారిద్దరిని కుటుంబ పెద్దలు గుర్తించాలి.  ఇంట్లో అందరు అవసరాన్ని బట్టి అన్ని పనులు, ఆడ పని, మగపని అనే విభజన లేకుండా కలసి చేసుకోవాలి.  ఆడపిల్ల అణిగి మణిగి వుండాలని, మగవాడు ఏమి చేసిన చెల్లుతుందనే భావన తుడిచి వేయాలి. ఇంట బైట అందరు అట్లా వ్యవహరిస్తే, స్త్రీలను వ్యక్తిగా గుర్తించటము జరుగుతుంది.  అప్పుడు వారి పట్ల నేరాలు కూడా తగ్గే అవకాశుము వుంటుంది. లైంగిక సుఖము తాత్కాలికమే నని, సహజీవనములో వున్నా మాధుర్యము దానికి మించినదని తెలుసుకోవాలి. సహజీవనానికి కావలసినది ఆత్మీయత, అభిమానము. అవి రెండు వున్నా చోట ప్రేమ వుంటుంది.  అసలైన ప్రేమ వున్నచోట కరుణే గాని క్రౌర్యము వుండదు.
  స్త్రీ పురుషులిద్దరిది మానవ జన్మ అని, ప్రకృతి ప్రసాదించిన శారీరక విభేదాలు అర్థము చేసుకొని, ఒకరు లేక మరొకరి  జీవితమే కాదు, మానవ జాతి మనుగడే సాగదని తెలుసుకొని సామరస్యముగా బ్రతికినప్పుడే మానవ జన్మ సార్థకమౌతుంది.        

No comments:

Post a Comment