Thursday, January 30, 2014

News - Views

ముగిసిన రభస
"హమ్మయ్య ఒక ఘట్టం ముగుసింది."
"అవునవును.  దీనితో అందరి గుణాలు బైటపడ్డయ్."
"ఇంతకు రూల్ 77 అని తీర్మానము బెట్టి కిరణ్ ఏం
సాధించిండంటవ్? దానికి చంద్రబాబు కూడ సపోర్ట్.  జేపీ
వత్తాసు.  దీనివల్ల ఎవరికేం లాభమైంది?"
"ఎవ్వరికి లాభం లేదు.  మళ్ళి మాట్లాడితె వాళ్ళ తెలివి
తక్కువతనము, టక్కరితనం బైటపడ్డది."
"ఆ తీర్మానము పెట్టి తెలంగాణ వాళ్ళు సభకు అడ్డుపడెటట్టు
చేసింన్రు.  వాళ్ళు అడ్డుపడకుండా వుంటె ఇంక కొంతమంది
సభ్యులు మాట్లాడేవాళ్లు కదా.  "సోమవారము వరకు ఆగండి.
నేను బ్రహ్మాండంగా మాట్లాడుతను.  చాలా బాగ మాట్లాడతను",
అని చంద్రబాబు గొప్పగా సభలో అన్నడు. ఇప్పటి వరకు రెండు కళ్ళు,
ఇద్దరు కొడుకులు, కొబ్బరి చిప్పలు, ఆపరేషను కోతలు అన్న చంద్రబాబు
మళ్ళేం కొత్త థీయరి ముందు పడ్తడో వినాలని నాకేంతో వుండే."
"అసలు చంద్రబాబును మాట్లాడకుండా చేయలనేమో ఈ నాటకము."
"ఏమో.  కిరణ్ కుమారైతె డైలీ సీరియల్‍లాగ మూడు రోజులు మాట్లా
డిండు.  తరువాత వేరె వాళ్లకు అవకాశ మివ్వాల్సింది కదా.  చంద్ర
బాబు మాట్లాడె అవకాశము కోల్పోవటం ప్లాన్ ప్రకారమైనా, అనుకో
కుండా అయినా అది ఆయన దురదృష్టము."
"ఆయన దురదృష్టమో, అదృష్టమో!  రాష్ట్ర విభజన అడ్డుకొని 1200
మందికి చావుకు కారణమైనోడికి రోగము కుదిరిందనుకుంట."
"కాని చంద్రబాబు రేపటి రోజు "ఈ కేంద్రము ఏ హక్కుతో రాష్ట్రాన్ని
విడదీసింది.  ప్రతిపక్షనాయకుడినైన నా అభిప్రాయాన్ని తెలిపే
అవకాశమీయలేదు.  ఏక పక్షంగా రాష్ట్రాన్ని విభజించింది. తెలుగు
జాతిని చీల్చింది", అంటు సీమాంధ్రలో ప్రచారము చేస్తడు కదా!"
"కాని ప్ర్జజలు తెలివితక్కువోళ్లేం కాదు.  ఈ రాష్ట్రము విడిపోక తప్ప
దన్నప్పుడు మనకు కావల్సిన వాటి గురించి అడగాలని అనుకున్నరు.
ఒక్కరంటె ఒక్కరు ఆ మాటే అడగలేదు.  ఎంతసేపు ఈ విభజన అడ్డు
కుంటమని పేలటమే.  ఇప్పుడున్న ఈ నాయకులు మళ్ళి ఎలక్షన్లో
ఎంత మంది గెలుస్తరో చూడాలే."
"ఈ కిరణ్ కుమార్‍ రెడ్ది చేసిందంతా సొంత తెలివేనంటవా?"
"రేపటి రోజు అతను కొత్త పార్టీ పెట్టుకుంటడో, లేకపోతే కాంగ్రెసు అతనికే
నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందో చూస్తె తెలిసి పోతుంది."
"ఎవరు చేసిండ్రో, చేయించిన్రోగని వీళ్లు తెలంగాణ ప్రజలను పెట్టుకున్న
గోస అంతింత కాదు.  ఆ దేవుడె వాళ్లకు శిక్షవేయాలి."  

Saturday, January 25, 2014

News - Views

చెండాట
"ఈ కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళెమో కిరికిరి పెడుతుండు, ఏందిది?"
"ఏం కిరికిరి పెట్టినా తెలంగాణ వచ్చుడు ఖాయమంటున్నగద."
"బిల్లు వెనిక్కి పంపిస్తరట.  చంద్రబాబే ఐడియా ఇచ్చిండంట!"
"చంద్రబాబు కిరణ్ణు ఫూల్ చేద్దామని చూస్తుండు.  లేకపోతె
వారం కిందనే గడువడిగే బదులు బిల్లు వెనిక్కి పంపమని 
చెప్పాల్సిండె.  కిరణ్ తెలివితక్కువోడని ఆంధ్రలో తన పవరు
పెంచుకుంటుండు."  
"ఆయన పవరు పెంచుకునుడేందోగని తెలంగాణ ప్రజలను మాత్రం
పరేషాన్ చేస్తుండ్రు.  ఈ రూల్ 77 రాష్ట్రపతి ఆర్టికల్ 3 కింద పంపిన
తెలంగాణ్ బిల్లుకు వర్తిస్తుందంటావా?"
"బిల్లు చర్చింకుంట, ఇంకా సమయము కావలని ఒకటికి రెండుసార్లు
అడుగుతున్నరు.  అట్లాంటప్పుడు వెనిక్కి ఎట్ల పంపుతరు?  అల్రడి 
అందరు రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయలను స్పీకర్‍కు ఇచ్చిండ్రు  
కూడ. సీమాంధ్రలో ఓట్లకోసం ఆడె నాటకమంతా."  
"ఆ మహానుభావుడు, దార్శనీకుడైనా బాబా సాహేబ్ అంబెద్కరను
మొక్కాలి.  మంద బలముతో ఈ ఆంధ్రోల్లు ఎప్ఫటికైనా తెలంగాణ
రానిచ్చె వాళ్లా? వీళ్ళ బాధ మనం ఇంకెన్ని రోజులు భరించాలో?"
"ఒక్క నెల.  అంతకంటె ఎక్కువ కాదులే."  
"ఏమో?  రోజులు లెక్కబెడుతున్న.  వీళ్ల దిగజారుడు మాటలు, దిగ
జారుడు రాజకీయాలు చూస్తె అసలు 'where we are going'
అర్థం కావట్లేదు.  కేంద్రము బిల్లు పెట్టి, అందరి అభిప్రాయాలు పంపమంటే
అన్ని ప్రాంతాల వాళ్ళని కూచోబెట్టి మాట్లాడలేదంటరు.  విభజన తప్పదు,
మీ అవసరాలు చెప్పండనె కదా అసెంబ్లిలో బిల్లు గురించి చర్చించి చెప్పమన్నది.
అవసరాలు చెప్పకుండ కేంద్రాన్ని, రాష్ట్రపతిని తిడుతున్నరు.  ఇంక వేరె 
కూచోబెట్టి అడిగేదేంది?"  
"వాళ్ళకు తెలుసు విభజన తప్పదని.  అయినా డ్రామాలాడుతున్నరు.  ప్రజలు
తెలివి తక్కువ వాళ్లనుకుంటున్నరు.  కాని ఎలక్షన్లప్పుడు ఈ నాటకాల రాయుల్ల
సంగతి చూసుకుంటరు."
"అవును.  సామన్యుడు రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఉన్న ఏకైక ఆయుధం
ఓటు.  ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు దాన్ని తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలె."  

Tuesday, January 14, 2014

Sankranti

పతంగుల పండుగ 

నా చిన్నప్పుడు సంక్రాంతి పండగంటె పతంగుల పండగె.  దీపావళి
అయిపోయినంక కొద్ది రోజులనుండె పతంగులు ఎగురేసుడు మొదలు
పెట్టేవాళ్ళు.  అది క్రిస్మస్ సెలవుల నుండి కొద్దికొద్దిగా ఎక్కువై సంక్రాంతి
నాటికి జోరెక్కువైయ్యెది.  సంక్రాంతి తరువాత స్కూల్లు తెరిచినంక ఆగి
పోయేది.  అదే సమయంలో ఆడపిల్లలు ఇంటి ముందు రకరకాల కొత్త
ముగ్గులు నేర్చుకొని వెయ్యటము, కనుము రోజు రథము ముగ్గుతో ఈ
ముగ్గుల పోటి ఆగిపోయేది.  రథము ముగ్గుల గురించి పత్రికల్లో ఎన్ని
జోకులో!  
సంక్రాంతి నాడు ఆవుపేడ పట్టుకొచ్చి గొబ్బెమ్మ్ల చేయటము
అందులో పెట్టడానికి వెతికి వెతికి గర్బపోసలు పట్టుకొచ్చి గుచ్చిపెట్టడము
పిల్లల పని.  గొబ్బెమ్మకు బొట్లు పెట్టి, కడపకు రెండు చివర్ల పెట్టటము,
వాకిట్లో పెట్టడము, వాటి పక్కన నవధాన్యాలు పోసి, రేగుపళ్ళు, చెరుకు
ముక్కలు పెట్టటము ఓ చక్కటి ఙ్ఞాపకం.  అందుకోసం తెచ్చిన రేగుపళ్లు 
అమ్మచూడకుండ గుట్టుకు మనటము, చెరుకు ముక్కలు చప్పరించటము
చిన్న అల్లరి పని.  నవధాన్యాలను కోడి పిల్లలు, పిట్టలు తింటుంటె చూడటము
సరదాగా వుండేది.  ఆ నాటి హైద్రాబాదు - సికింద్రాబాదులొ మామూలు మధ్య
తరగతి బస్తీలో ఇది చాలా సాధారణము.
పండగ నాడు ఇంట్లో పెద్దవాళ్ళు స్పెషల్ వంటల ప్రిపరేషన్లొ వుంటె పిల్లలు, 
ముఖ్యంగా మగపిల్లలు, పతంగులు ఎగరేయటములో, 'కాట్' అయి కింద
పడుతున్న పతంగులు పట్టుకోవడంలో బిజిగా వుంటరు.  చిన్న చెల్లెల్లు
తమ్ముళ్ళకు చక్రి పట్టుకునే పని వుండెది.  రకరకాల పతంగులు, రకరకాల
పేర్లు - నామందార్, డొప్పన్, గిల్లార్, లంగోట్, గుడ్డిదార్, గుడ్డిలంగోట్, నామ
డొప్ప, బాచ్‍కోర్ మొ.  ఆ పతంగులకు కన్నాలు కట్టడము ఓ పెద్ద టెక్నికల్
పని.  ఆ కన్నాల సరిగ్గ కడితేనె పతంగి మంచిగ ఎగురుతుందని నమ్మకము.
గాల్లో గిర్కిలు కొడ్తుంది తప్ప ఏ మాత్రము పైకి ఎగురదని భయము.
పిల్లలు చాలసార్లు పెద్దవాళ్లతో, అనుభవమున్నవాళ్లతో పతంగి 'కన్నాలు' 
కట్టించుకుంటారు.  తరువాత దానికిమాంజ కట్టాలె.  మాంజాల్లో కూడ రకాలు, 
రంగులు.  ఈ మాంజలు పండగకు నెలరోజుల ముందునుండె తయారు చేసి పెట్టుకుంటరు. 
 సీసముక్కలు చాలా మెత్తటిపొడి చేసి, మెత్తగ ఉడికిన అన్నము, కావలసిన రంగు కలిపి, 
దాన్ని పిడికిట్లో పట్టుకొని, గోడకు కొట్టిన రెండు మొలల మధ్య కట్టిన దారం వరసలకు
రుద్దుతారు.  ఈ మాంజదారం తట్టుకొని, చుట్టుకొని పక్షులకి, మనుషులకు
కోసుకపోవటము, కొన్ని సార్లు ప్రాణాలు పోవడము జరిగేది! అట్లా వార్తలు 
వచ్చేవి.  
పతంగికి ముందు కొంత మాంజదారం, దాని తరువాత సాదా ట్వైన్ దారముండేది.
మగపిల్లలు, దోస్తులతోనో, బంధువులతోనో గుంపులు, గుంపులుగా ఇండ్లముందు, 
లేదా మిద్దె మీద, లేదా దగ్గరలో వున్న మైదానములో కాని పతంగులు ఎగురేసేది.
అందులొ కొందరు డోలు కూడ దగ్గ్రర పెట్టుకునేటోళ్ళు.  పతంగులు ఎగిరేసేటప్పుడు
పక్కన ఎగురుతున్న పతంగితో 'పేంచ్' ఎయ్యటము, లేదా పేంచ్లో చిక్కుకోవటము 
తప్పదు. 'పెంచ్' పడటమంటె పతంగుల యుద్ధమన్నట్టే.  పక్కవాడి వదులుతున్నడా,
లాగుతున్నాడా అన్నదాన్ని బట్టి ఇవతలి వాడి రెస్పాన్స్ వుండేది.  అప్పుడు చక్రి
పట్టుకోవడము, దాని దారము వదలటము ఓ పెద్ద ఇష్యు.  దారం గుంజుతుంటే, 
దస్తికొట్టాలా మెల్లగ చుట్టాలా ఓ ఆర్డర్.  పేంచ్ అవతలి వాడు మాంజతో మాములు 
ట్వైన్తొ పెంచ్ పెడ్తె అది ఎవరిదొ తెలిస్తె వాడిమీద అరవడమే.  మాంజ, మాంజలో
వున్న పతంగిలే పేంచ్ వేయాలి.  అది 'కీంచ్ కాట్' కావచ్చు, 'డీల్' కావచ్చు.
పతంగి కాట్ చేయ్యగానే చేసినోడి గ్రూప్ పెద్దగా 'అఫా' అని అర్సుడు, డోలు ఉన్నోడు
అది 'ఢం ఢం' అని బజాయించుడు.  పతంగి కాట్ అయినోడు గబగబా దారం 
చక్రికి చుట్టేసికుంటడు.  లేకపోతే అది కిందికి అందితె దారిలో ఎవడన్నా మంచి
మాంజ అయితె కొట్టేస్క పోతడని భయం.  కొంత మంది బీద పిల్లలు, వాళ్ల 
పతంగులన్ని అయిపోగొట్టుకున్నోళ్లు ఓ కట్టెకు పై చివరకు ఓ కంప కట్టినది 
పట్టుకొని మెడలన్ని నొప్పి పుట్టేవరకు ఆకాశకెల్లె చూసుకుంట నిలబడ్తరు.  
ఎక్కడైన పతంగి కాట్ కాంగనే అది ఎటు పడ్తుందనుకుంటె ఆ దిక్కు చూసుకుంట
ఉరుకుడె, ఆ పతంగిని ఆ కట్టేతో పట్టుకుందామని.  ఆ ఉరుకుట్ల  పిల్లలకు దెబ్బలు 
తగలటమే కాదు, మోర్లనో, మోటరు కిందనో పడటము,  అట్లాగే మిద్దలమీద 
ఎగిరేసోటోళ్ళు ఎగురేసుకుంటనో, కింద పడబోయెదాన్ని పట్టుకోబోయి జారి 
పడటము అప్పుడప్పు జరిగేవి.  అందుకని పెద్దవాళ్ళు ఆప్పుడప్పుడు 
వచ్చి జాగ్రత్తలు చెప్పడము జరిగేది.  అట్ల్లాగె వచ్చి తినిపొమ్మని చెప్పటము 
జరిగేది.  బాగా ఆకలేస్తె గాని తిండికి పోవుడు కష్టమే.  లేదా కొన్న 
పతంగులన్ని అఫా అన్న కావాలె.  
సంక్రాంతి నాడు సాయంత్రము ఒకరో, ఇద్దరో దీపం పతంగు లెగిరేసెటోల్లు.  
అవి ఆకాశంలో చుక్కల్ల కాసెపు అటు, ఇటు కదిలేవి.  తర్వాత దించేటోళ్ళు.  
వాటికి పేంచ్‍లు వుండవు. ఎక్కడో ఎవరో ఒకరు మూడునాల్గు పతంగులను 
కలిపి సీర్యలు పతంగులు ఎగిరేస్తు అట్ల కాసేపు ఆశ్చర్యంగ చూట్టమే.
చిన్నపిల్లలు, ఆడ పిల్లలకు పతంగి బాగా పైకి ఎగిరినంక వాళ్ళ అన్నదమ్ములు
కాసేపు దారం పట్టుకునే అవకాశమిచ్చేటోళ్ళు.  మొత్తానికి సంక్రాంతి పండుగ
మగపిల్లల పండగనిపించేది.
సికింద్రాబాదు, హైద్రాబాదులో జరిగినంత బాగా పతంగుల పండుగ తెలంగాణలో 
వేరే ఎక్కడైనా జరుగుతుందా?  ఆంద్రాలో అయితె అసలే జరగదు.  వరంగల్లులో 
అయితె సంక్రాంతి అంటె సకినాలు, అరిసెలు, ఇంక కొన్ని పిండి వంటలే.  
పతంగులు ఎగిరేసుడు తక్కువే.
ఏది ఏమైనా సంక్రాంతి పండగ రాష్ట్రములో వాళ్ల వాళ్ల ఆచారలను బట్టి అందరు 
గొప్పగానే జరుపుకుంటరు.  

Saturday, January 11, 2014

News - Views

ఎవడు? ఎక్కడివాడు? 
"కిరణ్ కుమార్ రెడ్డికో అనుమానం వచ్చింది."
"దాన్ని హరీశ్ రావ్ తీర్చెసిండు కదా."
"అవుననుకో.  అసలు కిరణ్‍కు తాను హైద్రాబాది అనె ఫీలంగ్
బలంగా వున్నట్టుంది, కాని తెలంగాణ వాడని మాత్రమనుకోడు.
అలా అనుకునేవాడైతె ఆనాడు అసెంబ్లిలో "రాసి పెట్టుకో! తెలంగాణకు
ఒక్క రూపాయివ్వను" అనేవాడా?"
"హైద్రాబాది ఫిలింగ్ కూడ ఏముందో నాకు డౌటే.  ఆ ఫీలింగే వుంటే తను
చదువుకున్న కాలేజిల్లో పిల్లల మీద పోలీసుల జులుం ఎట్ల చేయిస్తడు.
ఆంధ్రాలో సమ్మె నడిపించిండు.  ఒక్కనాడైనా ఒక్కడిని కొట్టిన్రా? అరెస్టు
చేసిండ్రా?  అక్కడ స్టూడెంట్ల పట్ల దౌర్జన్యం చేయాలని కాదు.  కాని మన
తెలంగాణ స్టూడెంట్లను ఎన్ని విధాల హింసించిన్రు!"
"ఆయనకు తెలంగాణలో సీటోస్తది, ఓట్లు కూడ పడ్తయని అంటున్నడు."
"ఓట్ల్లు కాదు, సొట్లు పడ్తయి.  ఈ ఆంధ్ర లింకున్నోల్లంతా అంతే.  ఇక్కడ
పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ అన్ని హక్కుల్లు అనుభవించుకుంట అక్కడి
పాట పాడ్తరు."
"వాళ్లకు చాలానే జాతి అహంకారము.  తెలంగాణ వాళ్లంటె చిన్న చూపు.
పైగా తెలుగు మాట్లాడుతున్నాము కాబట్టి ఒకే జాతని పైకి చెప్పుడు.
విడదీయడం దారుణమంటు గగ్గోలు!  వాళ్ల అహంకారానికి మన అత్మ
గౌరవానికి జరిగిన పొరాటం ఈ తెలంగాణ ఉద్యమము.  అర్వై ఏండ్ల ఈ
పోరాటం ఎప్పుడెప్పుడు ఓడుస్తుందాని ఎదురుచూసిడైతుంది."
"ఇంకో నెలరోజులకంటె ఎక్కువ పట్టదనుకుంట."
"ఏమో?  నాలుగేండ్లబట్టి ప్రతి పండగప్పుడు మళ్ళిసారి దీన్ని మన
తెలంగాణలో జరుపుకుంటమని అనుకుంటు ఆశపెట్టుకుంటున్నము.  ఈ
ఏడన్న అన్ని పండగలు తెలంగాణలో అనుకుందామంటె ఇప్పుడు సంక్రాంతి
పండుగ అయిపోతనేవున్నది.  సమ్మక్క జాతరవరకన్న బిల్లు పార్లమెంటులో
చర్చకు రావలని కోరుకుంటున్న."
"ఆ విప్లవ వనదేవతల అనుగ్రహముతో ఆసరికి బిల్లె పాసౌతుంది, చూస్తుండు."
"ఆ అమ్మల అనుగ్రహముండాలని మొక్కుతా."