Sunday, December 11, 2016

నోటు పోటు - 2



ఇంట్లో పైసలు అవసరాలకి
బాంకులో డబ్బు లెక్కలకి.

నగదురహిత లావాదేవిలకైనా
ముందుగా నగదు బాంకులో జమ చేయాల్సిందే!

బాంకులో డిపాసిట్లు కోట్లు
సామాన్యుల కిద్దామంటే లేవు చిల్లరనోట్లు!

5oo కోట్లతో చేసినా
500 రుపాయల్లో చేసుకున్నా
పెళ్లి పెళ్ళే కదా!

రద్దైన పెద్దనోటు, పెద్దనోటు ఎక్కడకెళ్లావంటే
పెరిగి పెద్దోళ్ల లాకర్లలో నక్కివున్నానంది.

ఏ బాత్రూంలో ఎంత ధనం వుందో
ఎవరికెరుకా?

అవును నిజం
ఎ.టి.ఎం. క్యూ అయింది
కొందిరి జీవితంలో అఖరి క్యూ.

అక్కరకు రాని నోటు
నగదు లేని బాంకు
పనిచేయని ఎ.టి.ఎం.
చేస్తున్నాయి సామన్యులను పరెషాన్
కమిషన్లు ఇచ్చిన 
కుబేరులవుతున్నరు షహంషా

నోటిచ్చి ఓట్లు కొని
కోట్లకు పడగలెత్తినరు
అదే నోటుని రద్దు చేసి
పేదలను రోడ్డుకీడ్చిన్రు

సామాన్యులే ఎప్పుడు ’బెల్ట్ టైట’ చేసుకోవాలె
ఏ కష్టమొచ్చినా వాళ్లె కదా చిక్కిపోయేది!









Wednesday, December 7, 2016

అమ్మకు వందనం


వందనం! వందనం!
అమ్మకు వందనం
అమ్మలకు అమ్మైన
అమ్మకు వందనం

ఆడదంటె 
ఆడిస్తె ఆడేదని
అణిగి వుండాల్సిందేననే
లోకంలో
ఆదిశక్తి స్వరూపమై
అమ్మలగన్న అమ్మవోలె
అందరి పాదాభివందనాలు
అందుకున్న అమ్మకు
వందనం! వందనం!

నేలకు కొట్టిన 
బంతివోలె
అంతె కసిగా 
’పురచ్చితలైవి”
ఎదిగి ఎదిగి
ఆకాశపుటంచులు అందుకొని
తారవై, సితారవై 
దేశమాత ముద్దుబిడ్డవైన
అమ్మకు వందనం
పాదాభివందనం

Image source:  Google images

Thursday, November 24, 2016

నోటు-పోటు



రూపాయి బిల్ల వచ్చి
రెండు వేల నోటుని వెక్కిరించినట్టు!


వేలల్లో కోట్లున్నాయ్! ఏం లాభం? 
వంద నోట్లు లేకపాయె!


వందకు చిల్లర లేనమ్మ
రెండు వేలకిస్తనన్నదట!


బాంకులో లక్షలు కోట్లున్నయ్,
కస్టమర్ అడిగితె వందలు లేవు!


అడుక్కుంటోడైనా వెయ్యి వద్దంటుండు,
రూపాయి బిల్లె ముద్దంటుండు!


అడుక్కునే వాడి బొచ్చెలో
రూపాయి తళతళా మెరుస్తుంది
షావుకారు సందూకులో వెయ్యి నోటు
వెలవెలా పోయి దాక్కుంది!


ఐదు రూపాయల ఛాయ్ తాగి
రెండువేల చిల్లర అడిగినట్టుంది!


ఎక్కడైనా బాయ్ ఫ్రెండ్ కాని
ఎ.టి.ఎం. దగ్గర మాత్రం కాదు!


ఎ.టి.ఎంలు ’ఔట్ ఆఫ్ ఆర్డర్’,
బాంక్ లో ’నో కాష్’
కొనేదెట్లా? తినేదెట్లా?


ఎ.టి.ఎం. లైన్లో నిలబడంగనె
చేతిలో డబ్బులు పడట్టు కాదు


వేయి నోట్లు కోట్లు ఇస్తా కాని
వంద నోట్లు మాత్రం అడక్కు


చిల్లరని చిన్న చూపు చూడకోయ్,
ఏ నోటు ఎప్పుడు రద్దౌతుందో తెల్యదోయ్


కాలం ఒక్కలా వుండదు  
పచ్చనోట్లు పోయి
గులాబి నోట్లస్తయి
గులాబి నోట్లు పోయి
మరో కొత్తవస్తవి


అశాశ్వత జీవితంలో
ఏ నోటు మాత్రం శాశ్వతం?



Friday, November 18, 2016

Black and white




బ్లాక్ ఔట్

పది శాతం జనం  దగ్గర
ఎనభై శాతం సంపద
చిల్లర కోసం
తొంభై శాతం ప్రజల ఇక్కట్లు

మొసళ్ళు చలికి కాచుకుంటున్నాయి
చేపలు గిలగిలా కొట్టుకు చస్తున్నాయ్
ఇది మోదం!? ఎంత ఖేదం!
ఎవరి ఆమోదం?  ఎవరికి ప్రమోదం?









Wednesday, November 9, 2016

మార్పు


మార్పు కావాలి, మార్పు రావాలి
కొత్త దారి 
ఎటు వెళుతుందో
  ముందుకా
  వెనిక్కా
  అటుఇటు ఎటో తెలియదా
ఏదేమైనా 
సాహసం
ముందుకు నడుపుతుంది
లేదా
అనుభవం నేర్పుతుంది.

ప్రాణంతక విన్యాసం


మాయలోకంలో మర్మాలెన్నో?
భ్రమలు సృష్టించె క్రమంలో
ప్రాణంతక విన్యాసాలు
సంచలనం కోసమా?
ప్రచారవ్యూహమా?

*********

ప్రాణం విలువెంతా?
పోతె కోట్లు పెట్టినా కొనలేనంతా!
జీవితం విలువ
బతికితె సాధించినంత
చస్తె బూడిద పిడికెడంత

Monday, November 7, 2016

పోరు


హోరాహోరుగా సాగుతుంది పోరు
తక్కువలేదు ఎవరి జోరు
గెలిచేదెవరో ఓడేదెవరో
ఆగదులే సామాన్యుని జీవన పోరు

Friday, September 23, 2016

విషాదవిశ్వనగరం


వానాకాలంలో వర్షాలని
సంతోషించానెంతో
వరదలు ముంచేస్తుంటె
కలిగెను బాధెంతో
ప్రగతి పేరుతో
పర్యావరణ సమతుల్యతను
దెబ్బతీస్తె
ముందు కాలంలో
వచ్చును కష్టాలెన్నో
ఇకనైన
ప్రకృతిని పరిరక్షించుకుందాం
పర్యావరణ పరిరక్షణే ప్రధానమైన
పురోగమన బాటలో నడుద్దాం 

Wednesday, September 21, 2016

విజేత


విధి వారిని వెక్కిరించింది
అయినా
ఆత్మస్థైర్యంతో, గుండె ధైర్యంతో
అడుగు ముందుకు వేశారు
విజయ పథంలో నడిచారు
విశ్వవిజేతలైయ్యారు.

జోహారు! జోహారు!
పారలింప్క్సి విజేతలకు
జోహారు! జోహారు!
Image: Downloaded from google images

Tuesday, September 20, 2016

దాడి


పేరట్లో పాములున్నాయ్
జాగ్రత్త, జాగ్రత్త!
బుసలు కొడుతుంటాయ్
కాటెస్తాయ్
తరిమికొట్టినా మళ్ళి మళ్ళి వస్తాయ్
సామరస్యం వాటికి తెల్యదు
సహజీవనం అసలు రాదు
జీవాకారుణ్యం అర్థం కాదు
అవి నాగులు, మిన్నాగులు
సమయం చూస్తాయ్
కాటేస్తాయ్
సహనం ఎన్నాళ్ళు?
శాంతి మంత్రం ఇంకెన్నేళ్ళు?
విషప్పురుగుల కోరలు పీకేయ్యాలె
ముక్కలు ముక్కలుగ చేసి
సముద్రగర్భంలో పడేయ్యాలె
ప్రశాంత జీవితానికి అడుగు పడాలే




Saturday, September 17, 2016

కుటిలకీయం


పార్టీ అంటె కుటుంబమంట!
కుటుంబ పార్టీ గురించి చెప్పేదేముంది

************

భిన్నత్వంలో ఏకత్వం
రాజకీయ పార్టీల సిద్ధాంతం
చందమామను చూపించి
చుక్క పోసి, ముక్క ఇచ్చి
ఓట్లేయించుకోవటం
అధికారాన్ని చేజిక్కించుకోవటం
మిత్రుత్వాలు లేవు, శత్రుత్వాలు లేవు
అంటరానితనం అసలేవుండదు
పదవులకోసం
బద్దశత్రువుతో సోపతి
ప్రాణమిత్రులను నట్టెట ముంచటం
తేడావస్తె 
వండి వడ్డిచ్చిన చేతినే
విరిచేయటం
అంతా ప్రజాభిష్టమే
కార్యకర్తల ప్రోద్బలమే
రాజకీయమే కురాజకీయమే

Thursday, September 15, 2016

హర్షాకాలం


ఎన్నాళ్ళకెన్నెళ్ళకు
వర్షాకాలంలో వానలు
రోజు రోజు వచ్చాయి
జోరుజోరుగ వచ్చాయి
వాగులు కుంటలు నిండాయి
చెరువులు అలుగులు పోశాయి
నదులు పొంగి పొర్లాయి
రైతన్నల హృదాయాలే 
ఆనందంతో మురిశాయి

Wednesday, September 14, 2016

గణేశ నిమజ్జనం


కదులుతున్నారు, కదులుతున్నారు 
గణనాథులు
నిమజ్జనానికి బయలుదేరుతున్నారు
పుష్టిగ, తుష్టిగ నైవేద్యాలు
సంతుష్టిగ నవరాత్రి ఉత్సవాలు
హారతులందుకొని గణనాథులు
ఆశీర్వదించి బయలుదేరినారు
గంగమ్మ ఒడిలోకి చేరినా
భూమాత గుండెల్లో ఒదిగినా
ఎల్లప్పుడు నిన్ను పూజించెమయ్యా
చల్లగ మమ్మల్ని చూడయ్యా

Tuesday, September 13, 2016

నీటి జ్వాల


నీరులేక జీవం లేదు
జీవనం, జీవితమే లేదు
తాగునీరు, సాగునీరు
నాగరికతకు సోపానాలు

నీటిలో జ్వాల పుట్టిస్తే
ఇది రాజకీయమా? రాక్షసీయమా?

దుష్కృత్యాలు 
కక్షలు తీర్చుకునే మార్గాలు
ప్రగతికి ప్రతిబంధకాలు
’బతుకు బతకనివ్వు’ అనుకుంటె
రాజీ కుదరక పోదు
జీవితం ముందుకు సాగు

Saturday, September 10, 2016

కొ - కొత్త పార్టీ


అంతో ఇంతో పేరుంటే
ఇబ్బడి ముబ్బడి రాబడి వుంటే
పవరంటె ఆశుంటే
రాజకీయాలతో కాస్త పరిచయముంటే
పెట్టేయ్, పెట్టేయ్ కొత్త పార్టీ
ఎలక్షన్లో ఓట్లోచ్చినా రాకున్నా
టికెట్లమ్ముకుంటే నోట్లైనా వస్తయ్

Friday, September 9, 2016

అవ్వా-బువ్వ


అవ్వా కావాలి
బువ్వా కావాలి
అవ్వ వుంటె
అడక్కుండానే బువ్వ వస్తది
అవ్వా కావాలి
బువ్వా కావలి.
ఆకలి మీద బువ్వ
పెడ్తానంటె వద్దంటానా?
కడుపునిండా తింటాను.
అవ్వ రాదని తెలుసు
లోకంలో లేదని తెలుసు
అయినా గాయి చేస్తను
అవ్వా కావాలి, అవ్వా కావలి....

Thursday, September 8, 2016

హోదా పాక్


ఓట్లకోసం నాయకులు
కోట్ల వాగ్దానాలు చేస్తరు
గెలిచినంక 
ప్లేటు ఫిరాయిస్తరు
ప్రభుత్వములో వుంటె
ఒక మాట
ప్రతిపక్షములోనైతె
మరో బాట

Wednesday, September 7, 2016

దొందు దొందే


రాజకీయనాయకులు
మాటా మాటా అనుకుంటే
అర్రల్లోనుండి
అస్థిపంజరాలు బైటపడుతై

Tuesday, September 6, 2016

గురువు


గురువు
బతుకులో అక్షరజ్యోతులు వెలిగించి
జీవితం ఆత్మవిశ్వాసంతో నింపుతాడు
జీవిత పరమార్థం తెలిపి
గమ్యం చేర  జ్ఞాన దివటీలందిస్తాడు

Saturday, September 3, 2016

స్పందన - చా - చాక్లేటు


చాక్లేట్ అంటె అందరికిష్టం
కాని వచ్చిందో కొత్త కష్టం
మిల్క్ చాక్లేట్లే కాదు
మద్యం, మత్తెకించె చాక్లెట్లొచ్చాయి
అమ్మల్లారా! అయ్యల్లారా!
కాస్త జాగ్రత్త!
పిల్లలకు చాక్లేట్లు కొన్నా,
తింటున్నా ఓ నజరేయండి
మిల్కా,  మద్యం కిక్కుదా
తెలుసుకొండి. 

Friday, September 2, 2016

స్పందన - స్టే సౌఖ్యం


కోర్ట్ కేసులెన్నివున్నా
కంగారక్కర్లేదులె
పైసా వుంటె, పవరుంటే
ఎన్ని స్టేలైనా తెచ్చుకొవచ్చు
సౌఖ్యంగా కాలం గడపొచ్చు

Thursday, September 1, 2016

స్పందన - వైద్యం



దేవుడు కాదు వైద్యుడు
ఒక విద్య నేర్చి సేవ చేసెవాడు
వైద్యం కాదు కాదు మాయ
మంత్రమసలె కాదు

చికిత్స బాధను తగ్గించె యత్నమె
జబ్బును తగ్గించె ప్రయత్నమె
ప్రాణము పోయలేడు
తీయటము అసలె చేతకాదు

జ్ఞాన సుధలు చిందిస్తు 
కాలమే మరిచి ప్రాణ రక్షణకు
కాలుడితో పోరాటం చేయగలడు
వైద్యుని జీవితం వృత్తికె అంకితం

Wednesday, August 31, 2016

స్పందన - నోటోటు


తప్పులున్నవారు తండొపతండంబు
తప్పు చేయని రాజకీయనాయకులుండరు
ఓటుకు నోటు కొత్తేమి కాదు
చిక్కినందుకొచ్చే చిక్కంత

Tuesday, August 30, 2016

స్పందన - ఓరుక(గ)ళ్ళు


జిల్లా కావలని పోరుతున్నవారిని
కుదరదు పొమన్నరు
వద్దన్నా వరంగల్లును విడదీస్తమంటున్నరు
పాలనా సౌలభ్యమా?
స్వార్థ రాజకీయ దౌర్భాగ్యమా?
హృదయము ఒక్కటిగ వున్న
జంట కవలలను విడదీస్తె
ఎంత కష్టం, ఎంత నష్టం!

Monday, August 29, 2016

స్పందన - రాజికీయం


స్క్రిప్టేమో థార్డ్ క్లాసు
 యాక్షన్ (action ) మాస్ క్లాసు
అన్నె ఆగమయిండు
తమ్ముడు తోకాడిస్తుండు!

Saturday, August 27, 2016

స్పందన - ఫనాటిక్స్


ఫాన్స్ - ఫనాటిక్స్ కొట్టుకొని
నేలరాలితె ఎట్లా?
రెక్కలు తెగిన కన్నవారి
గుండెల్లో విషాదాగ్ని చల్లారెదెలా?

Friday, August 26, 2016

స్పందన - ప్రాజెక్టీయం


ప్రేమ లేఖలు రాసుకున్నాం
వియ్యమే
ఖాయం కాలేదు.
 *****
మర్యాద ఇచ్చిపుచ్చుకున్నం
పెట్టుపోతలు పంచుకున్నం
లగ్న పత్రికలు రాసుకున్నం.
**********
కార్యం అయ్యెదెప్పుడో
కలల పంటలు పండేదెన్నడో
అప్పుడె సంబురం సంబురం.

Thursday, August 25, 2016

Wednesday, August 24, 2016

స్పందన - దొంగాట



దాగుడుమూత దండాకోర్
పులి చచ్చే పిల్లి వచ్చె
పొగబెట్టే
కలుగుల ఎలుకలు 
కదలబట్టె
దొరికేవెన్నొ, దాపుకు పోయవెన్నొ
ఆట సాగె
చూద్దాం, చూద్దాం
సైలంటుగ అబ్జర్వ్ చేద్దాం

Tuesday, August 23, 2016

స్పందన - రక్తకులం



వైద్యులారా 
తెలుసుకొండి, తెలుసుకొండి
రక్తానికి గ్రూపులే కాదు 
కులమూ వుందని

Monday, August 22, 2016

స్పందన - గెలుపోటములు


అడవిలో మొగ్గ రాలిపోయింది
తోటలో వికసించిన కుసుమం
పూజలందుకుంది.

Sunday, August 21, 2016

స్త్రీ శక్తి




స్త్రీ శక్తి అంటె ఏంటొ చూపించినరు.  ఆదరించి అవకాశమిస్తె ఎంత ఎత్తుకెరుగలరో ప్రపంచానికి చాటిన్రు.  ఆడది ఆది శక్తి అని, అపర పరాశక్తి అని పూజించక్కర్లేదు.  మెదడు, మనుసు వున్న మనిషిగా గౌరవించి, స్వేచ్చగా బతకనిస్తె చాలు.  తను బతకటమే కాదు, జాతి గౌరవాన్ని నిలుపుతుంది.  మానవ మనుగడ భువి పై సాగడానికి దివిటి అయి ముందు నడుస్తుంది, నడిపిస్తుంది.

అహర్నిశలు కృషి చేసి భారతావనికి  ఒలంపిక్స్ క్రీడల్లో గుర్తింపు తెచ్చిన అమ్మాయిలకు నా హార్దిక శుభాకాంక్షలు.

Images:  of Sindhu, Sakshi Malik and Deepa Karmakar are down loaded from google images.

Thursday, June 2, 2016

Telangana Formation Day


జయహో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రము ద్వితీయ ఆవిర్భావ దినోత్సవము జరుపుకుంటున్నది.  రాష్ట్రమంతా పండుగ వాతావరణము నెలకొన్నది. ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రములో, ప్రజల్లో ఎంత మార్పో!  కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజల కొన్ని ఆశలైతే నెరవేరుతున్నయి.  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రములో జరిగిన అన్యాయాలు విపులంగా తెలిసి ఆ దుష్ట కౌగిలి నుండి బయట పడ్డందుకు ఎంత సంతోషంగా వున్నదో. తెలంగాణ ప్రజలందరికి తెలుసు సోనియా గాంధి వల్లనే తెలంగాణ వచ్చిందని.  ఎప్పుడో అప్పుడు ఇది జరగక తప్పనిదె.  ఏ ప్రజలైనా, ఎంత తెలివితక్కువ వారైనా అన్యాయాన్ని ఎన్నాళ్ళు సహిస్తరు?  కాలం కలిసివచ్చింది.  జయశంకర్ సర్, ఇంకా ఎంతో మంది విద్యావంతులు చేసిన భావ వ్యాప్తి, KCR రాజకీయ శక్తియుక్తులు, కోదండ రామ్ నాయకత్వంలో JAC అవిశ్రాంత పోరాటము, సోనియా గాంధి మాట నిలుపుకోవాలనే పట్టుదలతో వుండటము వల్లనే ఇది సాధ్యమైంది.
నాయకుడు గొప్పె.  నాయకుని వెంటే ప్రజలున్నరు.  నాయకులు నడిపించినరు.  ప్రజలు, ముఖ్యంగ యువత త్యాగాలు చేసిన్రు. ఆట పాటలతో, అహింసతో, ప్రాణత్యాగాలతో ప్రపంచములోనే కనివిని ఎరుగని విధంగా అద్భుతంగా సాగిన పోరాటము వల్లనే తెలంగాణ సిద్ధించింది.  ఇది నాయకులను చిరంజీవులను చేసింది.  ప్రాంతంలో, ప్రజల్లో ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచింది.
ఈ తెలంగాణ ప్రజా తెలంగాణ.  సాధించుకున్న ఈ తెలంగాణ నిలదొక్కుకోవాలంటే KCR సరైన నాయకుడు.  ఉద్యమనాయకుడు, రాజకీయ చతురుడు, మేధావి, ఆలోచనాపరుడు, అయిన కెసిఆర్ మాత్రమె ఈ రాష్ట్రాన్ని   అభివృద్ధి పథంలో నడిపించగలడని ప్రజలంతా నమ్ముతున్నరు.  KCR తను ప్రాణాలు ఫణంగా పెట్టి సాధించిన రాష్ట్రాన్ని 'సుజలాం సుఫలాం సస్యశ్యామలం' చేయటానికి నిరంతరము కృషి చేయటము ప్రజలంతా గమనిస్తున్నరు.  ఆ నాయకుడు కలకాలం ఆయురారోగ్యాలతో వుండాలని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని తెలంగాణ ప్రజానీకమంతా కోరుకుంటున్నరు. 
జై తెలంగాణ !  జయహో తెలంగాణ !! 






 

Wednesday, May 11, 2016

Justice in time

విశ్వనగరానికి ఒక్క అడుగు


స్నేక్ గాంగ్ కేసు రెండేళ్లలో తేలటము దోషులకు శిక్ష పడటము తెలంగాణలో ప్రజలకు పోలీసు, న్యాయ వ్యవస్థ పట్ల కొంత నమ్మకాన్ని పెంచింది.   సామాన్యంగా ఈ రొజుల్లో ఎట్లాంటి ఘోరమైన కేసు స్టేషన్లో రిజిస్టర్ అయిన అది తేలే వరకు దశాబ్దాలు పడుతుంది.   ప్రజలు, మీడియా వెంట బడ్డ కేసులు మాత్రము రెండు మూడేళ్ళలో తేల్చే ప్రయత్నం జరుగుతుంది.   ఈ కేసు విషయంలో పోలిసుల శ్రద్ధ అభినందించాల్సిందే.  హైదరాబాదు విశ్వనగరము  కావాలంటే అక్కడ ప్రజలకు చక్కటి రక్షణ వుండాలె.  వచ్చి వుండె వాళ్ళకైన, పెట్టుబడులు పెట్టే వారికైనా ఈ ప్రదేశము క్షేమకరమనిపించాలె.  రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ బాగా పని చేయటమే కాదు, చేస్తున్న నిదర్శనము కనబడాలి.  ఈ కేసు ఆ నమ్మకాన్ని కలిగించేట్టు వుంది. ఈ విషయములో తెలంగాణ ప్రభుత్వాన్ని,పోలీసులను ఎంతైనా అభినందించాలె. 

దోషులకు శిక్ష పడ్డా  వారి లైంగిక దాడులు నిరూపణ కాకపోవడము మన వ్యవస్థ దౌర్భాగ్యము.  లైంగిక దాడుల్లో ఎప్పుడు సమాజము, వ్యవస్థలన్నీ కూడా స్త్రీనే తప్పు పట్టడము, వాళ్ళు నూటికో వెయ్యికో ఒకరు తప్ప ఎవరు న్యాయపోరాటానికి సిద్ధ పడరు.   అంతే  కాకుండ పది మంది దోషులను వదిలినా ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దనె మన న్యాయ వ్యవస్థ ఒక్క నిర్దోషి కోసం పదిమంది దోషులను వదిలేస్తే నేరాలు పెరగక  ఏమైతయి?  తెలివి, ధనము, పలుకుబడి వున్నవాడు నేరము చేస్తె శిక్ష పడె అవకాశము 10% కంటే తక్కువె.

ఏ నేరము జరిగినా పోలీసులు, నిష్పక్షపాతంగా, శ్రద్ధగా పనిచేస్తే నేరాలు బాగానే తగ్గిపోతయి.  హైదరాబాదులోనే కాదు తెలంగాణ అంతట కూడ రక్షణ, న్యాయ వ్యవస్థ  పటిష్టంగా పనిచేస్తే తెలంగాణా దేశంలోనే కాదు ప్రపంచములోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది

Thursday, April 28, 2016

Nallacheruvu




హైదరాబాద్ లో   ఒకప్పుడు  ఎన్నో  చెరువులు  ఉండేవని  అవన్నీ ఆంద్రొళ్ళ పాలనలో  కబ్జాకు గురైనవని అంటరు.  "City Of Lakes"గా  గుర్తింపు పొందిన హైదరాబాదులో ఇప్పుడు చెరువులు ఎక్కడెక్కడ వున్నాయో వెతుక్కొని, ఏ స్థితిలో వున్నయో చూసుకొని బాగుచేసుకోవాల్సిన పరిస్థితి.  KCR - తెలంగాణ ప్రభుత్వములో  "మిషన్ కాకతీయ" పేరుతో నీటి పారుదల శాఖ మంత్రి అదే పనిలో వున్నడు.  ఏట్లాగు పక్క రాష్ట్రాలు కట్టిన రకరకాల చిన్న పెద్ద ప్రాజెక్టుల కారణంగా మనకు క్రిష్ణా, గోదావరి నీళ్లు రావటము అంతంత మాత్రమె అని సీరియస్ గా  చెరువుల పూడికతీతకు పూనుకున్నరు.  ఈ పని కొంతవరకు జరిగి అప్పుడె సత్ఫలితాలు ఇస్తున్నట్టు వార్తలు వినబడుతున్నయి.  మరో రెండుమూడేళ్ళలొ చెరువులన్నీ పూడికతీసి, చెట్లు నాటే కార్యక్రమము సక్రమంగా సాగి చెట్లు పెరిగితే తెలంగాణా సస్యశ్యామలం అవుతుంది.


గత కొన్ని ఏళ్లలో చెరువులు ఎట్లా నాశనం అయ్యయో, నదులు ఎట్లా మురికి కాలువలుగా మారాయో తెలుసుకోవడానికి హుస్సేన్ సాగర్ ను మూసినదిని చూస్తే అర్థమైపోతుంది.
హైదరాబాద్ నుండి వరంగల్లు వెళ్ళే దారిలో, ఉప్పల్ దగ్గర నల్లచెరువు ఒకప్పుడు చాల పెద్దగ వుండెది.  నా చిన్నప్పుడు చూసిన గుర్తుంది.  చుట్టు పక్కల దగ్గరలో ఇల్లు కనిపించేవి కాదు.  చెరువులో బాతులు తిరుగుతూ కనిపించెవి.  రానురాను ఆ చెరువు చుట్టు ఇల్లు అపార్ట్ మెంట్లు రావటము, ఆ చెరువు చిన్నగ కావటము అక్కడ కొన్నిసార్లు కంపు వాసన రావటము బాధ కలిగించేది.

ఈమధ్యె ఆ దారమ్మట వెళ్ళ్తు నేను కొన్ని పక్షులను చూసిన.  ఆ నీటి పిట్టలను చూసి చాల సంతోషమనిపించింది.  చకచక కొన్ని ఫోటోలను తీసుకున్నాను.


చెరువుల బాధ్యత మంత్రి, హరీషరావు గారిదైతె, నగర సుందరీకరణ మంత్రి తారక రామారావు గారిది.  ఇద్దరు కలిసి ఈ చెరువును పునరుద్దరించి, దానిని ఒక చిన్న "బర్డ్ సంక్టురిగా  మారిస్తే అదో అందమైన ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతమవుతుంది.  ఆ జాతీయ రహదారిన వెళ్ళే వాళ్లు కాస్సేపు అక్కడ ఆగి ఉత్సాహంగా ముందుకు సాగుతరు



Friday, April 1, 2016

Lovely bloom

పూల దారి

ఈ మధ్యే, అంటే హోలి పండగకు ఓ రెండు రోజుల ముందు నేను కొమ్మల లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోడానికి వెళ్లిన.  హన్మకొండ నుండి వెళ్ళా లి.   హన్మకొండ నుండి వరంగల్ వెంకట్రామా టాకీస్ వరకు చాలా చోట్ల రోడ్డు డివైడర్లు వున్నయి.  వీటిల్లో చాలా వరకు చెట్లు కూడా నాటినరు.  ఎక్కువగా పచ్చ పూలవి.  వరంగల్ ఎం,జి.ఎం. నుండి   టాకీస్ వరకు చాల  పచ్చ పూల చెట్లున్నవి.  ఇవన్ని బాగానే పెద్దగై నీడనిస్తున్నవి.  అంతే  కాదు.  ఈ చెట్లన్ని కుడా విరగబూసి ఎంతొ  ఆహ్లాదాన్నిస్తున్నయి.  దాదాపు రెండు కిలోమీటర్ల దూరము ఈ పూల చెట్ల పక్కనుండి వెళ్లడము ఒక ఆనందమైన మరపురాని అనుభవము. 



మండె ఎండల్లొ అక్కడక్కడ దారమ్మట నీడనిచ్చి, పూచే చెట్లు వుంటె మామూలు ప్రయాణమే కాదు జీవనయానము కూడా సంతోషంగా వుంటుంది.  మన జీవన సౌఖ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఇంట్లోనో, ఇంటి బైటనో కొన్ని చెట్లు నాటి వాటిని సంరక్షిస్తే మన జీవితమే కాదు భావితరాల జీవితము కూడ ఆనందమయమవుతుంది.




  

Tuesday, January 26, 2016

Sammakka Saralamma Jatara




వచ్చింది, వచ్చింది.  మేడారం జాతర వచ్చింది.  తెలంగాణ రాష్ట్రంలో తోలి మేడారం జాతర వచ్చింది.  తల్లి వస్తుంది.  బిడ్డ వస్తుంది.  కుటుంబం అంతా వస్తరు.  నాలుగు రోజులుంటరు.  అందరిని ఆశీర్వదిస్తరు.  మొక్కులందుకుంటరు.  ముడుపులందుకుంటరు.  మళ్ళి రెండేళ్ళకు వస్తమని అభయమిచ్చి అడవికెళ్ళి పోతరు.
సకుటుంబ సపరివార సమేతంగా
 
కోరికలు తీరినోళ్ళు కుటుంబాలతో వస్తరు.  ముడుపులు చెల్లించుకుంటరు.  కొత్త ఆశలు ముందు పెడ్తరు.  మళ్ళి రావాలని కోరుకుంటు వేళ్తరు.

బంగారంతో తులాభారం

ఎప్పుడైనా  అమ్మవారిని, సమ్మక్కని మాఘ పౌర్ణమి నాడు గద్దెల వద్దకు తీసుకొస్తరు.  బిడ్డ ఓక రోజు ముందు వస్తుంది.  మొక్కులు చెల్లించుకునేవారు ఎక్కువుగ పున్నమి నాడే మొక్కులు చెల్లించుకుంటరు.  కాలెండర్లో చూస్తె పున్నమి 22న వున్నది.  అప్పటి వరకు జాతర అయిపోతుంది.   మరి ఈ సారి ఎందుకు ఇట్ల మర్చిన్రో?

దర్శనానికి వెళ్ళ్తున్న జనం
జరుగుతున్న అబివృద్ధి పనులు
జాతర నాటికి పూర్తాయెనా?

నాలుగు రోజుల్లో రోజుకు లక్షల్లో జనాలు వస్తే, అమ్మవార్ల గద్దెల దగ్గరకు వెళ్ళడం కష్టమని ఈ  మధ్య చాల మంది ముందె వచ్చి ముడుపులు చెల్లించుకుంటున్నరు.  జాతర ఫిబ్రవరి 17-20 వరకైతే పదిహేను రోజులనుండే ప్రజలు మేడారానికి వస్తున్నరు.

జాతరకు లక్షల మంది వస్తారని తెలిసిన, ప్రతి యేడు నెల రెనెళ్ల ముందు రోడ్డు మరి ఇతర పనులు మొదలు పెడ్తరు.  తొందరగా  పనులు కావాలని తాత్కాలికంగా ఏదో చేసామనిపింఛి దులుపుకుంటరు.  తెలంగాణ ప్రభుత్వము కాస్త శ్రద్ధ తీసుకుంటదని అనిపిస్తుంది.  పనులైతే అయితున్నయి. నాణ్యత మళ్ళి జాతర వరకు తెలిసిపోతుంది.

విద్యుదీకరణకు సాగుతున్న పనులు
జాతరనాటికి పూర్తయితే కరెంటు దీపాల వెళ్తురులో
జాతర రోజుల్లో రాత్రిలు కూడ అమ్మవార్లను దర్శించుకోవచ్చనుకుంటా

ఈ జాతర ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్న. అమ్మవార్ల  ఆశీర్వాదంతో  రాష్ట్రము చైతన్యవంతమై ప్రగతి పథంలోకి వెళ్తుందని, వ్యవసాయము చక్కగా సాగి,ప్రజల కనీసావసరాలు - కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం  అందరికి అందుబాటులో వుండాలని కోరుకుంటున్న.  అదే బంగారు తెలంగాణ.
కోమట్లను, బాపన్లను పక్కన పెడితె
తెలంగాణలో పండగంటే ముక్క, చుక్క వుండాల్సిందే
ఆమె ముఖంలో సంతోషము చూడండి


దర్శనానికి ముందు గంటలు కొడ్తున్న భక్తులు

వనదేవతకు జరుగుతున్నా అర్పణలు
అక్కడ వేసిన బెల్లం బంగారం అందుకోవటం
అమ్మవార్ల అనుగ్రహం పొందటమె


సమ్మక సారలమ్మ మట్టి విగ్రహాలు చేసి
వాటికి రంగులు వేస్తున్నతల్లి కొడుకులు
జాతర అప్పుడు గద్దెల వద్దకు పోలెకపోతె ఇక్కడకు వచ్చి మోక్కొచ్చు



దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆకలి, అలసట తప్పదు
ఇక్కడకు వచ్చి కోవా బన్ను తిని కాస్త శక్తి పొందొచ్చు  

కోయదొర
ఆ దర్జా చూడండి
చిలుకతో, మూలికలతో తయారు
జోస్యం చెపుతాడు కష్ట నష్ట నివారణలకు
చిట్కాలు చెపుతాడు, మందులు (మూలికలు) ఇస్తాడు


జాతరలో దుకాణాలు
పిల్లలకు ఏమి కొనివ్వకపోతే జాతరకు
వచ్చినట్టే కాదు