మృగజాతి
అమ్మ, అమ్మలగన్న అమ్మ
ముగ్గురమ్మలకు మూలపుటమ్మ
ఆది పరాశక్తి అమ్మ
అనంత విశ్వములో అంతర్లినమైన ఆదిశక్తి అమ్మ
ఊరూరికి అమ్మ - పోశమ్మ, మైసమ్మ, పోలేరమ్మ .....
ఇంటింటికో దేవత - బాలమ్మ, ఎల్లమ్మ .....
ఆకలైతే అన్నపూర్ణమ్మ
ఆవేదనలో అలరించే అమ్మ
దేవుడైన అమ్మ కడుపున పుట్టాల్సిందే
కడుపులో తన్నినా
ఒడిలో లాలించి పాలిచ్చి పెంచే అమ్మ.
అమ్మనే ఆడదని ఆటబొమ్మని చేసి
అంగడి బొమ్మగా మారుస్తున్నరమ్మ
కడుపులోనే చిదిమేస్తున్నారు
బతికి బట్ట కడితే
నడి రోడ్డులో బట్టలూడదీసి
రాక్షస క్రీడలతో కాలరాస్తున్నరు
అంతం చూస్తున్నరు.
మృగజాతిలో మగాడవు
ఘనుడవు నీవైతే
నిను కన్నతల్లి అఖిలాండేశ్వరి
ఆడదానిలో నీ తల్లి
నీ ఆలిలోను వుంది నీ పిల్లల తల్లి
మానవ జీవితం మమతత్వమని మరిచిపోతే
మానవ జాతికి మనుగడే లేదు, మనుగడే లేదు.