సామాన్యంగా గెలుపోటములు దైవాధీనములని అంటారు. ప్రజాస్వామ్యములో ఎన్నికల్లో అవి ప్రజాధీనాలు. ముఖ్యంగా పల్లె ప్రజలు, వెనుకబడిన వారి ఆధీనమనుకుంట. దైవము
దీనబంధు కదా! ఎవరు ఎన్ని చెప్పినా, ఉచితాలు ఇచ్చినా, వారి స్వంతం చేసుకున్న అన్ని మీడియాల
ద్వారా ఎంత ప్రచారము చేసినా అట్టడుగున వున్న ప్రజలు, - అంతవరకు నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసిన ఏమి చేయలేక
భరించిన ప్రజలు, దీనులు, హీనులు,- ఓటు అనే ఆయుధాన్ని సగర్వంగా వినియోగించి
సాక్షాత్తు భగవంతుని అవతారము అని అహంకారము ప్రదర్శించే నాయకులకు వారి స్థానాన్ని తెలియచేస్తారు. చదువుకున్నా, నిరక్షరాస్యులైన, ఏ కులానికి వర్గానికి చెందినా యుక్తవయస్కులైన
భారతీయులందరికి ఓటు హక్కును కల్పించిన మన రాజ్యాంగానికి, రాజ్యాంగ
ప్రదాతకు మనమంతా శిరస్సు వంచి నమస్కారిచాల్సిందే.
ప్రజలు ఎడ్డివారూ, గుడ్డివారు కాదు.
వారు ప్రతిరోజూ జీవిస్తూ వారి స్థితి సమాజ స్థితి గమనిస్తూ ముందుకుపోతుంటారు. దానికి
చదువు అవసరము లేదు. తెలివి వుంటే చాలు. వారి
నాయకుడు ఎన్నికైనప్పటినుండి వారి స్థానానికి, అక్కడి ప్రజలకు
ఏమి చేస్తున్నాడో చూస్తూనేవుంటారు, తెల్సుకుంటూనేవుంటారు. ప్రజలపట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అందరికీ తెలిసిపోతూనే
వుంటుంది. అంతా బహిరంగ రహస్యమే. గెలిచిన నాయకులు, స్థానికంగా
ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ, స్థానిక ప్రజల సమస్యలు తీర్చడానికి
కాస్తైనా పనిచేస్తే ఆ నాయకుడిని పార్టీలకతీతంగా మళ్ళీ ఎన్నికునే అవకాశము ఎక్కువ.
గెలిచిన నాయకులకు పదితరాలకు సరిపడే ఆస్తి సంపాదించిపెట్టుకోవాలనే
ఆలోచన కాకుండా తన స్థానిక ప్రజల జీవితాలు కొంతైనా
బాగుపడాలని నిజాయతిగా ప్రయత్నిస్తే, సహకరిస్తే అ నాయకుడిని
ప్రజలు మరుస్తరా? మళ్ళీ అడగకుండానే ఓటు వేసి గెలిపించరా?




