Wednesday, May 8, 2024

నుయ్యా? గొయ్యా?

 


తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారము జోరుగా జరుగుతుంది.  ప్రతీ పార్టీ ప్రత్యర్థి పార్టీని దుమెత్తి పోయటమే.  అది వింటే కాస్త ఆలోచన శక్తి వున్నవారికి ఏ పార్టీకి వోటువేయాలన్న భయమేస్తుంది. 

ఒకప్పుడు ఏ పార్టీకి ఎవరితో పొత్తో బహిరంగంగా తెలిసేది.  ఇప్పుడు అసలే అర్థం కాకుండా వున్నది.  తెలంగాణలో ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు జాతీయ పార్టీలుగా చెప్పుకోదగ్గవి రెండే.  కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ అయిన ఆ పార్టీ ఎప్పుడు  వేరే రాష్ట్ర, లేదా జాతీయపార్టీ భుజాన ఎక్కి కానీ పోటీ చేసింది లేదు.  లోకలు గా వుండి జాతీయంగా ఎదగలనుకునేవి మరో రెండు పార్టీలు వున్నాయి.  ఒకటి ఇక్కడ హైదరాబాదుకే పరిమితం. ఇకపోతే తెరాస/భారాస.  తెరాసగా వున్నప్పుడు అది తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ప్రజలు దాన్ని గుర్తించి బాగా ఆదరించినరు.  అదికాస్త భారాసగా మార్చబడ్డాక తెలంగాణ ప్రజలకు అది మరొక కొత్త పార్టీ అయింది కానీ అది తెలంగాణ ఆస్టిత్వ పార్టీగా మారలేక పోయింది.  అంతేకాక పార్టీ నాయకుల వేషాలు, మోసాలు తెలిసినంక భారాస తెలంగాణ ప్రజలకు భారంగా అయింది.  అందుకే మార్పు మొదలైంది.

ఇప్పుడు ప్రచారములో రెండు జాతీయ పార్టీలు కూడా భారాస ప్రత్యర్థి పార్టీకి మద్దత్తు అని ప్రచారము చేస్తున్నాయి.  భారాస కూడా రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది.  తెరవెనుక భాగోతాల సంగతి ఆ ఆ పార్టీ నాయకులకే తెలుసు.  

ఈ తికమకలే కాక ప్రజలకు మరో కొత్త సమస్య.  అది ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో వుంటాడో తెలియట్లేదు.  ఇవ్వాళ పొద్దుట ఒక పార్టీలో వుంటే రేపు ఏ కండువా కప్పుకొని కనిపిస్తాడో తెలుస్తలేదు.  నాయకలకు విలువలు లేవు. సరే.  కానీ ప్రజలు చాలావరకు అట్లా లేరు కదా!  వారి జంపింగులను ప్రజలు అసహ్యిచుకుంటున్నరు.  ఒక్కరోజులోనే ఆ ఆ నాయకుల తిట్ల ప్రవచనాలు మారిపోతున్నాయి. నిన్నటి ఉత్తమోత్తమ నాయకుడు ఇవ్వాళ ప్రజకంటకుడౌతున్నడు.  ప్రజలకు ఒక విషయము మాత్రము స్పష్టంగా అర్థమైంది నాయకులు పనిచేసేది, పార్టీ మారేది ప్రజాసంక్షేమము కోసం కాదు, వారు అధికారములో వుండే కోసం, వారి ఆస్తులు కాపాడుకోవటము మరియు పెంచుకోవటముకోసమే.

నాయకులంతా స్వార్థపరులే అని అర్థమైనంక ఎవరిని ఎన్నుకోవాలి?  ఎవడికి దోచుకునే అవకాశము ఇవ్వాలి?  ఇదీ ఇప్పుడు  ఆలోచించాల్సిన విషయము.

No comments:

Post a Comment