Monday, May 17, 2021

ఆరోగ్యమే మహాభాగ్యము

 

కరోన వైరస్ ప్రపంచాన్ని వణికించబట్టి ఏడాదిన్నర కావస్తుంది.  అయిన ఆ మహమ్మారి ఇప్పట్లో నెమ్మదించేటట్లు లేదు.  చైనాలో మొదలైనప్పటినుడి అన్నీ మాధ్యమాల్లో వచ్చే వార్తులు, వివరాలు చూస్తూనే వున్న.  ఎందరో రాస్తున్నారు, తెలిసి కొంత, తెలియకపోయిన చాలా.  కొన్ని పిచ్చి రాతలు – సలహాలు చూసినప్పుడు చాలా చికాకు కలిగేది, కొన్నిసార్లు బాధ కూడా కలిగిది.  ఆ సూచనలు పాటించి ఎంతోమంది ఆరోగ్యం పాడు చేసుంకుంటారేమో అని.  కానీ నేను ఏమి రాయలేక పోయిదాన్ని.

కరోన ఓ కొత్త జబ్బు.  దాన్ని గురించి ప్రస్తుత పరిస్థితుల్లో మామూలు జనాలకు ఎంత తెలుసో, డాక్టర్లకు దాని కంటే కొంచెం ఎక్కువ తెలుసు.  అది వారి వైద్యవిద్యా పరిజ్ఞానము వలన.  అది ఎట్ల వస్తుందన్న దాని గురుంచి రకరకలుగా చెప్పి, ఇప్పుడు గాలి ద్వారా అంటున్నారు.  ఊపిరి తిత్తులకు వచ్చే చాలా జబ్బులు గాలిద్వారానే వస్తాయి.  ఏ సూక్ష్మజీవి అయిన  మన ఒంట్లోకి ఆహారం ద్వారనో (తినేది, తాగేది), గాలి ద్వారనో, గాయాలద్వారానో లేదా స్పర్శ ద్వారనో వస్తుంది.  కాబట్టి ప్రస్తుత పరిస్తుతుల్లో మనకు అర్థం అయ్యేదేమంటే కరోన వైరస్ ఈ అన్నీ మార్గాల్లో రావచ్చని. ఒకే ఇంట్లో వుండే వాళ్ళు ఒకే వాతావరణములో వుంటారు కాబట్టి, ఇంట్లో ఏ ఒక్కరికీ సర్ది దగ్గు వచ్చిన సామాన్యంగా అందరికీ అంటుకుంటుంది.  పకపక్క ఇండ్లవాళ్లు కలసి మెలసి వుంటే వారి నుండి వీరికి, వీరినుండి వారికి అంటుకుంటుంది.  ఇది అందరికీ తెలిసిన విషయమే కదా!

సూక్ష్మ జీవుల వలన వచ్చే జబ్బులు (infections ) రోగనిరోధక శక్తి తక్కువ వున్న వాళ్ళని, అపరిశుభ్రంగా వుండేవాళ్ళకు ఎక్కువగా వస్తాయి.  జబ్బులు రావద్దంటే మొట్టమొదట కావాల్సింది పరిశుభ్రత.  పరిశుబ్రత అంటే మన ఒళ్లే కాదు, ఇల్లు, పరిసరాలు, ఆహారం కూడా.  వీటిని మనము ఎంతవరకు పాటిస్తున్నాము ఒకసారి ఆలోచించుకోవాలి.  ఇప్పుడు ఈ వైరుసే కాదు, ఇదివరకు, ఇప్పుడు కూడా వస్తున్న దోమలు, ఈగలు  వల్ల వచ్చే జబ్బులను కూడా పరిశుబ్రత వల్ల అరికట్ట వచ్చు.  పరిశుభ్రమైన ఆహార పానీయాలు  తీసుకోవటం వలన ఎన్నో జీర్ణవ్యస్థ (వాంతులు, విరోచనాలు, కామెర్లు, టైఫోయిడ్ మొ.) జబ్బులను నివారించ వచ్చు. 

ఏవైనా జబ్బులు వచ్చిన రోగనిరోధక శక్తి చక్కగా వున్నవారికి ప్రాణాపాయం కలిగించవు.  కొంచెం ఇబ్బంది అయిన త్వరగానే తగ్గిపోతాయి. 

రోగనిరోధక శక్తి బాగా వుండాలంటే సరైన ఆహారము తీసుకోవటము, తగినంత వ్యాయామము చేయటము అవసరము. సమతుల ఆహారము తీసుకోవటానికి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు.  సమతుల ఆహారమంటే ఏమిటో, రోజు ఆహారములో ఏమేమి వుండలు అని తెలుసుకొని, మన కున్న వనరులతో అవి సమకూర్చుకోవచ్చు.  నిరుపేదలకు కాస్త కష్టం కావచ్చు కానీ వేరే అందరికీ అది అందుబాటులో వుంటుంది.  కాకపోతే కొంత ప్రణాళిక వుండాలి, కొంచెం కష్టపడాల్సి రావచ్చు.  ఉదా. మార్కెట్కు నడిచి వెళ్లాల్సి రావటము.  ఆ నడకను ఒక వ్యాయాముగా తీసుకుంటే సమస్యే లేదు.  నడక అన్నీ విధాలా మంచిదే. 

వ్యాయామము మన జీవన శైలిలో ఒక భాగంగా మనము గుర్తించట్లేదు.  బీపీ, షుగరు వస్తే తప్ప వ్యాయామము చేయాలనే ఆలోచన సామాన్యంగా చాలా చాలా తక్కువ జనాల్లో వుంటుంది.  ఎవరైనా రోజు పొద్దుటే నడవడానికి వెళుతున్నారంటే వెంటేనే అనుమానం, వాళ్ళకు బిపినో షుగరో వుందని.  చాలా మంది గృహిణులు మేము ఇంటి పని చేస్తాము కాబట్టి వేరే వ్యాయామము అవసరము లేదనుకుంటారు.  విద్యుత్తుగృహోపకరణాలు లేని రోజుల్లో, స్వీయా వాహనాలు చాలా తక్కువ వున్న రోజుల్లో, ఉమ్మడికుటుంబాలు (ఒకే ఇంట్లో ఇరవైమంది కంటే ఎక్కువ వున్న ఇళ్ళలో), ఆ కాలాల్లో సమస్త గృహకార్యాలుకు మించిన వ్యాయామము అవసరముండేది కాదు.  గృహోపకరణాలు ఎక్కువై, కుటుంబాలు చిన్నవై, అడుగు బైటపెడితే వాహానాల్లోనే అయిన ఈ రోజుల్లో వ్యాయామము కోసం రోజుకు అరగంట, కనీసం 15-20 నిమిషాలు పక్కన పెట్టుకోవటము మంచిది.  ఆలోచన వుంటే తీరిక అదే దొరుకుతుంది.  వ్యాయామము దేహదార్ధ్యాన్ని పెంచుతుంది.  హృదయం, ఊపిరితిత్తుల సామర్థ్యము పెరుగుతుంది.  ఏదైనా జబ్బు వలన వీటిపై ఒత్తిడి పడినప్పుడు తట్టుకొని సులువుగా బైటపడవచ్చు.  

శారీరక బాధలు కలిగినప్పుడు, జీవితములో వున్న నానా సమస్యల వలన మానసికంగా వత్తిడి కలగటము సహజమే.  మానసిక ఆరోగ్యానికి అధ్యామికత ఎంతో సహకరిస్తుంది.  మానసికంగా ఆరోగ్యంగా వున్న వ్యక్తి శారీరక రుగ్మతల నుండి త్వరగా బయటపడగల్గుతారు.  ఒకప్పటి కాలములో పూజలు సoధ్యావందనాలు వుండేవి.  ఇప్పుడు కూడా ఇవి జరుగుతున్నై, కానీ చాలా కొద్ది కుటుంబాలలో మాత్రమే.  శాస్త్రీయ పరిజ్ఞానము పెరిగి పూజలు సంధ్యావందనాలు  తగ్గిపోతున్నై.   చాలా వరకు పూజలు చేస్తే కేవలము వారి కోరికలు తీర్చమని విన్నపాలు పెట్టుకోవడానికి మాత్రమే.  ఫర్వాలేదు.  మనకంటే ఒక అతీత శక్తి వుంది అని నమ్ముతున్నారు కదా.  ఆ అతీత శక్తిని ఎప్పుడో ఒకసారి పూజించే బదులు రోజు పూజించవచ్చు కదా.  పూజకని ఒక 10-15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని భగవంతుని ధ్యానించవచ్చు కదా!  ఏమి చేయక్కర్లేదు, నచ్చిన భాగవణ్ణామము తీసుకొని ప్రశాంతంగా ఇతర ఆలోచనలు లేకుండా కుర్చింటే చాలు. ఆస్తికులైనా, నాస్తికులైన ప్రతిరోజు ఉదయము సాయంత్రము 10-15 ని. ప్రశాంతంగా కూర్చొని  మెదడుకు, మనస్సుకు కాస్తే విశ్రాంతి ఇస్తే మిగిలిన 23.5 గం.  అవి ఆ వ్యక్తికి మానసికోన్నతిని, వ్యవహారశైలిలో నిశ్చలతని ఇస్తాయి. 

శరీరము, మనస్సు ఆరోగ్యంగా వుండటానికి ఏమి చేయాలో చేస్తున్నా, వాటికి హాని కలిగించే వాటికి దూరంగా వుండటము అంతే అవసరము.  దురాలవాట్లు అంటే ఏమిటో అందరికీ తెలుసు.  సరదాకనో లేదా భేషజాలకు పోయో ఆరోగ్యానికి హాని కలిగించే వాటికి దూరం వుండటము కూడా ఎంతో అవసరము. 

ఎవరైనా జీవితము ఆనందంగా సాగాలని కోరుకుంటారు.  ఆనందంగా వుండాలంటే ఆరోగ్యంగా వుండటము అవసరము.  మనము మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వుండాలంటే  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.  జబ్బు వచ్చినప్పుడే ఆరోగ్య సూత్రాలు పాటించడము కాదు.  అదిది నిరంతర ప్రక్రియ.  తొలి ఊపిరి తీసుకున్నప్పటినుండి చివరి ఊపిరి ఆగిపోయేవరకు పాటించాల్సిందే.

సర్వే భవన్తు సుఖినః

సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యన్తు

మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్

గమనిక:  ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిపుణులను సంప్రదించండి.  సొంత వైద్యం ప్రమాదకరము.

 

No comments:

Post a Comment