Wednesday, May 19, 2021

సొంత వైద్యం హానికరం

 

వాట్సాప్, టిక్ టాక్ వీడియో మాధ్యమాలు వచ్చాక ఎంతోమంది పొద్దున్న లేచినప్పుడు పాచి ముఖంతో ఆవలింతే తీసినప్పటి నుండి రాత్రి పక్కమీద మెత్తను కౌగలించుకొని పడుకునే వరకు, వారి తాతమ్మలనాడు పాటించిన చిట్కాల నుండి నేటి కాలములో వారు వారి తెలివితో కనిబెట్టిన ఎన్నో చిట్కాల గురించి వీడియొలు పెడుతున్నారు.  చూసేవాళ్ళు కొంతమంది, వాటిలో నిజానిజాలు తెలిసికోకుండా గుడ్డిగా పాటించేస్తున్నారు.  ఈ కోవిడ్ కాలములో ఆవిరి పీల్చటము, వేడినీళ్ళు తాగటము చాలా ఎక్కువమంది పాటించారు.  మామూలుగా ముక్కు దిబ్బడ వేసినప్పుడు ఏదో ఒకటి రెండుసార్లు కాస్త వేడినీటిలో విక్స్ వేసే పీల్చుకోమనటము విన్నాను.  అంతేకాని ఆరోగ్యంగా వున్నవాళ్లు ఇలా ఆవిరి పీల్చుకోమని ఎవరు మొదలు పెట్టరో కానీ, జనాలు గుడ్డిగా దానిని పాటించడము మొదలైనది.  మన చర్మము, శరీరములో అన్నీ రంద్రాలలో ఆ ఆ చోట రక్షణ కవచాలుగా పొరలు,సూక్ష్మజీవులు,కొన్ని ద్రవాలు, వుంటాయి.  ఉష్ణోగ్రతలలో తీవ్ర మార్పులు, అనవసరంగా వాడే రసాయనాల వలన ఇవి దెబ్బతినే అవకాశము వుంటుంది.  నోట్లో బాగా వేడి నీళ్ళు పోసుకుంటే ఏమవుతుంది?  నాలుక కాలుతుంది, నోట్లో, పెదవుల్లోపలి వైపున వుండే సున్నితమైన పొర దెబ్బతింటుంది.  అలాగే, ఇష్టమొచ్చినట్టుగా మాటిమాటికి ఆవిరి పీలిస్తే ముక్కులో వుండే సన్నని పొర దెబ్బతిని సూక్ష్మజీవులకు, ఊపిరితిత్తుల్లో ప్రవేశించట్టానికి రహదారినిచ్చేస్తుంది.

ఆరోగ్యం గురుంచి ఎవరైనా చిట్కాలు చెప్పితే అవి ఏ వైద్యవిధానములో వున్నది, చెప్పేవారు ఆ వైద్యవిధానములో నిష్ణాతులేనా అని తెలుసుకోవాలి.  మీ దగ్గరలో వున్న అదే వైద్యనిపుణలను ఆ విషయము గురించి అడిగి తెలుసుకోవాలి.   ఇప్పుడు పత్రికల్లోనో, అంతర్జాలములోను నిపుణుల సమాధానాలు వస్తున్నాయి కదా, అట్లగైన తెలుసుకోవాలి.  ఆ పద్ధతి మీ పరిస్థితికి సరిపడుతుందా తెలుసుకోని పాటించాలి.  వైరల్ వీడియో అయిందని, ఎవరో మేము పాటించాము అని చెప్పితే విని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు. బాగా చదువుకున్నవారైతే, మీరు అందులో హేతుత్వము ఎంత వుందో కాస్త ఆలోచించండి.  శాస్త్రీయత వేరు, శాస్త్రం లేదా ఆచారం వేరని అనుకోవద్ధు. ఆ కాలాన్ని అనుసరించి శాస్త్రీయంగానే ఆచారం వచ్చివుంటుంది.  మూఢంగా పాటిస్తే మూఢాచారము అవుతుంది, తెలుసుకోని పరిస్థితికి తగినట్టుగా అన్వయించుకొని పాటిస్తే మంచి ఫలితన్నే ఇస్తుంది.

అలాగే వేడి నీళ్ళు తాగటము.  నీళ్ళు పరిశుబ్రమైనవి కావనుకున్నప్పుడు – బావి నీరు లేదా చెరువు, బోరు నీళ్ళు వాడుతున్నవారు,  మున్సిపాలిటీ నల్లా వస్తున్నా, అవి కలుషితంగా వున్నాయని అనిపిస్తే, నీళ్ళు మస్లబెట్టి చల్లార్చుకొని తాగటము వలన కలుషిత నీటివల్ల వచ్చే చాలా జబ్బులను నివారించవచ్చు.  వట్టినే నీళ్ళు వేడిగా తాగటముతో ప్రయోజనమేమీ వుండదు.  వేడి నీళ్లుకాని, బాగాచల్లగా వున్న నీళ్ళు మనము ఎక్కువగా తాగలేము.  ఆ ఆ వాతావరణాన్ని బట్టి సరైన ఉష్ణోగ్రత వున్న నీళ్లు తాగుతాము.  సామాన్యముగా ఏ జ్వరము వచ్చిన, ముఖ్యంగా విరేచనాలు అవుతున్నప్పుడు ఎక్కువ నీళ్ళు తాగాల్సిన అవసరము వుంటుంధి.   అలాంటప్పుడు పరిశుబ్రమైన నీళ్ళు ఎక్కువగా తాగటము మంచిది.  వాంతులు వున్నప్పుడు తప్ప, ఒంట్లో బాగలేనప్పుడు, తినలేకపోయినా నీళ్ళు లేదా వేరే ఇతర ఆరోగ్యకరమైన ద్రవపదార్థాలు (కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, పండ్లరసాలు మొ.) తాగటము ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

అంతర్జాలములో వివిధ వీడియొలు, ఆడియోల ద్వారా వచ్చేవాటిని గుడ్డిగా నమ్మోద్దు.   మన అవసరలను బట్టి ఆ ఆ రంగములో నిపుణులు చెప్పినదే నమ్మాలి.  అవసరమనుకుంటే ఒకరిద్దరి వైద్యుల అభిప్రాయాన్ని తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవటం మంచిది.


వినదగునెవ్వరు సెప్పిన

వినినంతనే వేగపడక వివరింపదగున్

గని కల్ల నిజము దెలిసిన

మనుజుడె నేర్పరి మహిలో  సుమతీ!

No comments:

Post a Comment