Friday, May 31, 2013

Hysterectomy

గర్భాశయము - కాన్సేర్ భయము



వరంగల్లు ఓ చారిత్రాత్మక నగరము.  ఈ మధ్యె టూరిజమ్ శాఖా ప్రత్యేకంగా
గుర్తించింది కూడ.  ఈ నగర చరిత్ర, ఇక్కడ పోరాట స్ఫూర్తి తలచుకుంటె
నాకెంతో గర్వంగా ఉంటుంది.  కాని ఈ మధ్య ఈ పట్టణం ఖ్యాతి మరో రకంగ
ఛానల్లకు, పత్రికలకు ఎక్కటం బాగానే కలవర పరచింది.
ఈ జిల్లాలో 6 సం. లోపు పిల్లలో అబ్బాయిల కంటె అమ్మాయిలు చాలా
తక్కువ ఉన్నారని, దానికి స్కానింగ్ సెంటర్లు, డాక్టర్లు కారణమని, కొన్ని
స్కానింగ్ సెంటర్లను మూసివేయటము, ఆ తరువాత కొద్ది రోజులకె అవి
తిరిగి తెరుచుకొని పని చేయటము జరిగింది.  భ్రూణ హత్యలు కొంచెం
తగ్గాయని వింటున్నాము.  జిల్లా వైద్యాధికారి చొరువతో, చర్యలతో స్కానింగ్
సెంటర్లు తగు జాగ్రత్తలు తీసుకోవడము, భయానికి, అదివరకు అతిగా అబార్షనులు
చేసె డాక్టర్లు వాటిని కాస్త తగ్గించటము జరుగుతుంది.
ఇంతలోనె మళ్ళి మరో కథనం -" గర్భసంచులు-కాసుల సంచులని".  ఇక్కడె కాదు.
రాష్ట్రములో మరికొన్ని చోట్ల కూడ జరుగుతున్నాయి.  హిస్టరెక్టమి లేదా గర్భాశయము
తీసివేసె ఆపరెషన్ పట్టణాల్లో కంటే పల్లెల్లో, తాండాల్లో ఎక్కువగ జరుగుతున్నాయి.  వీటికి
కారణాలు, అవగాహనారాహిత్యము, కాన్సేర్ ఫోబియా - కాన్సేర్ వస్తుందనె భయము.
ఆ భయముతోనె కదా హాలివుడ్ ఆక్టరమ్మ ఒకరు రెండు వక్షోజాలు - మాస్టేక్టమి, 36 సం.కె,
ఆపరెషన్ చేయించుకుంది.  తొందర్లోనె హిస్టరెక్టమి +ఊఫొరెక్టమి (అండాశయలు తీసివెయటము)
ఆపరేషను కూడా చేసుకుంటానని చెపుతుంది.
ప్రతి ఒక్కరికి కాన్సెర్ అంటె భయమే కద.  తెల్లబట్ట  అవుతుందంటె స్త్రీలు డాక్ట్రర్ దగ్గరకు వెళ్తారు.
"ఇట్లా అయితె కాన్సేర్ వస్తుందంట కదా," అని భయాన్నీ వెళ్ళబుచ్చుతారు.  గైనకాలజిస్టులు చూస్తె , తగు
పరీక్షలు చేసి సామాన్యంగా అంతా బాగుంటె ధైర్యం చెప్పి మందులు రాసి పంపించేస్తారు.
ఇతర స్పెషలిస్టులు చూస్తె, ఒకసారి లేడి డాక్ట్రర్ దగ్గర పరీక్ష చేయించుకోమని పంపించేస్తారు.  నిజాయితి
తక్కువ వున్నవాళ్ళైతె , ఆ స్త్రీకి ఇద్దరు పిల్లలు వున్నారు, ఇంకా సంతానము అవసరము లేదనుకుంటే
"ఏమో, ముందు ముందు ఎట్లుంటదో ఏమి చేప్తం.  ఊరికె మందులు వాడె బదులు ఆపరేషను
చేసుకుంటే పని వొడుస్తది కద" అని అనొచ్చు.  అలాగె కాస్త అటు ఇటుగా రక్తస్రావము అయినా, పొత్తి
కడుపు నొప్పి వచ్చినా ఇట్లాగె మాట్లాడొచ్చు.  స్త్రీలు,  కొన్నిసార్లు వాళ్ళకు తెలిసినవాళ్ళు ఎవరైన ఇలాంటి
బాధలే పడి చనిపోయినట్టు వినటము జరిగితే,  ఆ పరిస్థితులలో, భయానికి లోనై ఆపరేషను సిద్ధ
పడటము జరుగుతుంది.  చిన్న వయస్సు, నలభైలోపు వాళ్ళకు, అంతా బాగుంటె నిజాయితి అయిన
గైనాకాలజిస్టులు వాళ్ళను సమాధానపరచి పంపించేస్తారు .  ఆ స్త్రీలు వినకపోవచ్చు.  కొన్నిసార్లు
డాక్టరు తను చేయకపోతె ఆ స్త్రీ మరెవరి దగ్గరకైన పోయి ఆపరేషను చేసుకుంటుందని భావించి తానే ఆపరేషను
చేయవచ్చు.
ఏ వయస్సులోనైన అనవసర ఆపరేషను తప్పె.  కాని మూడు పదులు కూడా దాటని స్త్రీలకు హిస్టరెక్టమి
చేయటము వలన వారి మానసిక, శారీరక, లైంగిక ఆరోగ్యము కొంత బలహీన పడె అవకాశము వుంది.
అండాశయాలు తీసివేయకపోయినా తొందరలోనె వాటి పనితనము తగ్గి ముట్లు ఆగిపోయినప్పుడు కలిగె
బాధలు మొదలు కావచ్చు.  ఐదు పదులకు అటు ఇటుగ హిస్టరెక్టమి చేసినప్పుడు అండాశయాలు
కూడా సమాన్యంగ తీసెస్తారు, అండాశయ కాన్సేర్ ముప్పు తగ్గించాలని (అందుకె ఏ.జొ ఆపరేషను
చెసుకోబోతుంది).  ముట్లు క్రమంగ తగ్గిపోతున్నపుడు వచ్చె మార్పులు చాలవరకు నిదానంగా వస్తాయి
కాబట్టి స్త్రీకి తట్టుకోవడము తేలిక అవుతుంది, మరీ కష్టమనిపించదు.  కాని ఆపరేషను అప్పుడు
అండాశయాలు తీసివేయటము వలన కలిగె మార్పులు ఆకస్మికము కాబట్టి తట్టుకోవడము కష్టము
కష్టమనిపిస్తుంది .  కొద్ది రోజులపాటు హార్మోనలు తీసుకోవలసి వస్తుంది .  ఏ వయస్సులో హిస్టరెక్టమి ఆపరేషన్
చేసుకున్న ముదిమి కొంచెం ముందె వస్తుంది.
తప్పనిసరి అయినప్పుడు ఏ వయస్సులోనైన హిస్టరెక్టమి చేసుకోవలసిందే - ముఖ్యంగా కాన్సేర వ్యాధి
వున్నప్పుడు.  వస్తుందనె భయానికి మాత్రం కాదు.
హిస్టరెక్టమి తప్పనిసరిగ చేసుకొవలసిన పరిస్థితులు:
  - గర్భాశయ కాన్సెర్, పాప్ స్మియర్ టెస్టులో ముందుముందు కాన్సేర్ వచ్చె సూచనలు
   కనబడినప్పుడు.
 - గర్భాశయములో కణతులు వుండి అధిక రక్తస్రావము అయితున్నప్పుడు
 -ఎలాంటి కణితులు లేకున్నా, దీర్ఘకాలము మందులు సక్రమపద్దతిలో వాడిన అధిక రక్తస్రావమై
   స్త్రీని రక్తహీనతకు, అనారోగ్యానికి గురిచేస్తున్నప్పుడు
 -‘ఎండొమెట్రియొసిస్’తో పాటు కణితులు వున్నప్పుడు
  - పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి గర్భాశయము దాని చుట్టు కణితులు ఏర్పడటము, ఎప్పుడు
    పొత్తికడుపులో నొప్పివుండటము
  - గర్భాశయము మొత్తంగా యోని బైటకు జారినప్పుడు
  - అండాశయాలకు కాన్సేర్ వచ్చినప్పుడు వాటితో పాటు తీసెవేయల్సిందె.

ఏ కాన్సెర్ గురించి భయపడి గర్భాశయము తీసుకోవాలనుకుంటారో - అది గర్భాశయ ముఖద్వార
కాన్సేర్.  ఇది రావాడానికి కొన్ని ఏళ్ళ ముందె మనము పాప్ స్మెయర్ ద్వారా తెలుసుకోవచ్చు.
శృంగార, వైవాహిక జీవతము మొదలు పెట్టిన స్త్రీలు 25వ ఏటి నుండి మాములుగ ప్రతి రెండేళ్ళ
కొకసారి ఈ పరీక్ష చేసుకోవాలి.  రిపోర్ట్లులను బట్టి కొన్నిసార్లు కాస్త ముందు లేదా కాస్త లేటుగ
డాక్టరు సలహాను బట్టి చేసుకోవాలి.  దానివలన కాన్సెర్ సూచన ఏ కొద్దిగ వున్న ఆపరేషను
చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ గర్భాశయ ముఖద్వార కాన్సేర్ తగ్గించడానికి టీకా కూడ వచ్చింది.  శృంగార జీవతము
మొదలు పెట్టకముందే, కుదరకపోతె, 40 ఏళ్ళ వరకు కూడా డాక్టరు సలహా ప్రకారము ఆ టీకా వేసు
కోవడము మంచిది.
 ఏదైన ఆపరేషను చేసి జబ్బు వున్న భాగాన్ని తీసివేసాక తప్పనిసరిగ దానిని పరీక్షకు (బయాప్సి) పంపిస్తె
అసలు జబ్బు విషయము, ముందు ముందు తీసుకొవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కూడ
వస్తుంది.

*ఇది సాధారణ అవగాహన కోసం క్లుప్తంగా రాసినది.  మీకు సమస్య వున్నప్పుడు మీకు నమ్మకము
వున్న డాక్టరును సంప్రదించి చికిత్స చేసుకోవాలి.

No comments:

Post a Comment