Sunday, December 20, 2015

Monkey Menace

కాజీపేట కోతులు 

అరణ్యాలు తగ్గిపోతున్నయి.  నగరాలు పెరిగిపోతున్నయి.  అడవులు నాశనము అవుతుండటంతో అడవులో ఉండాల్సిన జంతువులు పట్టణాల్లో జనావాసాల మధ్యకు వచ్చేస్తున్నయి.  ఈ మధ్యే నేను చదివిన.  ముంబైలో చిరుతలు అపార్ట్ మెంటు చుట్టుపక్కల తిరుగుతున్నాయని.  ఆ అపార్ట్మెంట్లు వో పెద్ద పార్కు పక్కనే వున్నయి.  అందులోని చిరుతలే తప్పించుకొని అప్పుడప్పుడు చుట్టు పక్కల షికారుకు వచ్చి, అవకాశముంటే ఏ కుక్కనో మేకనో లేదా అందుబాటులో వుంటె చిన్న పిల్లల్నో నోట కరచుకొని పోతున్నాయంట.  అడవులు పోయి, కావాల్సిన వేట లేకపోతె అవి మాత్రం ఏం చేస్తయి ? 
సరే.  ఆ క్రూర మృగాల సంగతి వదిలేద్దాం.  కోతుల బెడద అందరికి తెల్లిసిందె.  ఊళ్ళలోనె కాదు పట్టణాళ్ళలో వీటి బెడద బాగానే వుంటుంది.  మన దేశంలో దాదాపు అన్ని తీర్ధయాత్రా స్థలాల్లో వీటిని తప్పించుకు తిరుగటం కష్టమే అయితుంది.  సికింద్రాబాదు నుండి వరంగల్లుకు వచ్చే దారిలో వుండె అన్ని స్టేషన్లలో కోతులు చాలానే కనబడుతయి. 


 మాకు హన్మకొండ, వరంగల్లులో చెప్పనలవి కాని కోతుల బెడద వుంటుంది.  ఒక్కొక్క రోజు గుంపులుగా కోతులు వచ్చి నానా హంగామా చేస్తయి.  చుట్టు పక్కల పండ్ల చెట్లు వుంటే ఆగమాగమె.  ఆకులు, కాయలు, పండ్లు అన్ని తెంపెస్తయి.  కొమ్మ ఊయలలు ఊగుతయి.  కొమ్మల్ని విరిచేస్తయి.  ఆరేసిన బట్టలుంటే చింపేస్తయి కూడ (ఓ సారి నా కొత్త చీర చించి పడెసినవి).   పళ్ల వాసన వాటి బాగా తెలుస్తుందనుకుంటా.  చాలా సార్లు మా ఇంట్లోకి వచ్చి సరాసరి డైనింగ్ టేబుల్ మీద, లేదా అ పక్కనే షెల్ఫ్ లో అరటి పండ్లు కవరులో వున్నా, పేపరులో చుట్టి నవి వున్నా అందుకొని పోయి బాల్కని గోడపైన కూర్చొని నిమ్మళంగా తిన్న వరకు తిని పడేసి పోతవి.  కోతుల అలికిడి వినబడాగనె ( బైట ఎవరో చో,చో అని గట్టిగ అరుస్తున్నరంటే దగ్గర్లో కోతులున్నట్టె) వెంటనే నేను తలుపులు పెట్టేస్తను.


మొన్నీమధ్యే  విన్నాను, వరంగల్లులో కోతుల దాడిలో ఓ వ్యక్తీ చనిపోయాడని.   దాడిలో గాయాలు కావటము మామూలే కాని చనిపోయాడని వినటం ఇది మొదటి సారి. 
కోతులు కరిస్తే రేబిస్ వాక్సిన్ తీసుకోవాలి. 
మనం సుఖంగా జీవించాలంటే ఇతర జీవులను కూడ వాటి జాగాలో వాటిని బతకనియ్యాలి.  సో, అడవులను పరిరక్షించాలి.  పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి.  అప్పుడు మన వాతావరణము కూడా మెరుగవుతుంది.  జన జీవనం కూడ  బాగు పడుతుంది 
 




Wednesday, September 23, 2015

ప్రాణాపాయ సెల్ఫీలు



మొబైల్ ఫోన్లు వచ్చినంక ఫొటోలు తీసుడు చాల కామన్ అయిపోయింది.  ఏ చిన్న సందర్భము వున్నా ఎవరో ఒకరి దగ్గర ఫోన్ వుండటము దానితో ఫోటో తీయటము అనుకోకుండా చాలా సహజంగా, అలవాటుగా జరిగిపోతున్నది.  ఎమ్మెమ్మెస్లు, ఆ తరువాత వాట్సాప్లలో అవి ప్రపంచములో ఏదో మూలలో వున్న బంధు మిత్రులతో షేర్ చేసుకోవటము క్షణాల్లో జరిగిపోతుంది.
సెల్ఫిలు వచ్చనంక అయితే కొంతమంది కూచున్నా, పడుకున్నా, నిలబడ్డ, తింటున్నా, కొత్త ప్రదేశాలు చూస్తున్నా, ఏం చేస్తున్నా, చేయకున్న ఫోటోలు తీసుకొని సన్నిహితులకు పంపించుకోవడము, ఫేస్ బుక్ లో పెట్టుకోవడమైతుంది.  సందర్భాసందర్భాల గురించి ఆలోచించకుండ శవాల పక్కన, చెరువులు, కొండల పక్కన, అడవి జంతువుల పక్కన, కొన్ని సార్లు ప్రమాదకర పరిస్థితుల్లో వుండి కూడ సోషల్ మిడియాలో ప్రచారము కోసం, అధిక లైకులు షేర్ల కోసం అత్యుత్సాహముతో సెల్ఫీలు తీసుకుంటున్నరు. అనాలోచితంగా ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకున్నందువల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడ కోల్పోతున్నరు.  ఏ ఏడాది ఇప్పటి వరకు సొరచేపలు - శార్క్ ల వల్ల ఎనిమిది మంది చనిపోతె సెల్ఫీల వల్ల పన్నెండు మంది చనిపోయారని ఓ పత్రికలో వచ్చింది.  మరి మన దేశములో ఎంతమంది అలా చనిపోయారో?
ఆ మధ్య ఒకామె ఓ మడుగు పక్కన సెల్ఫీ తీసుకుంటుంటె ఓ మొసలి ఠక్కున వచ్చి ఆమెను నోట కర్చుకొని నీట్లోకి వెళ్లిపోయిన వీడియో వాట్సాప్ లో హల్ చల్ చేసింది.  ఇలాంటివి చూసినంకైనా సెల్ఫీ పిచ్చివాళ్ళు కాస్తా జగ్రత్తగా, సమయసందర్భాలేకాక, పరిసరాల గురించి జరుగ గల ప్రమాదాలు గురించి తెల్సికొని, తగు జాగ్రత్తలు తీసుకున్న్ తర్వాతే సెల్ఫీ తీసుకోవడమ్ మంచిది.  లేకపొతె అదే అఖరి సెల్ఫీ అయితుందేమో!
రష్యాలో ఈ ఏడు కొన్ని వందలమందు సెల్ఫీల వల్ల గాయపడ్డము, పదుల సంఖ్యలో మరణించటము జరిగింది.   ఒక 21 సం. స్త్రీ తుపాకి పట్టుకొని సెల్ఫీ తీసుకుంటుంటె అది కాస్త పేలి చనిపోయింది.  మరో ఇద్దరు యువకులు చేతిలో గ్రెనెడ్ పట్టుకొని సెల్ఫీ తీసుకుంటే దానికి సాక్ష్యంగ  ఆ సెల్ఫీతో ఫోన్ ఈ లోకంలో వుంది, వాళ్లు మాత్రం పరలోకానికి చేరుకున్నరు.  ఇలాంటివన్ని చూసినంక రష్యా ప్రభుత్వము సురక్షిత సెల్ఫి ప్రచారము మొదలు పెట్టింది.  అది ఇప్పుడు ప్రపంచమంతా ప్రచారానికి పనికి వస్తుంది.
సెల్ఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.  ముందువెనకలు చూసుకొని అందమైన సెల్ఫీలు తీసుకుంటు, అందరితో షేర్ చేసుకుంటు ఆనందంగా వుండండి.


సురక్షిత సేల్ఫీ  - రష్యా ప్రచారానికి వాడుతున్నది, గూగుల్ ఇమేజస్ నుండి తీసుకున్నది

Saturday, September 12, 2015

ప్రకృతి వరము లక్నవరము



వరంగల్లు జనాలందరికి లక్నవరము గురించి తెలిసే వుంటుంది.  లక్నవరము గ్రామములో లక్నవరము చెరువుంది.  లక్నవరము వరంగల్లు నుండి దాదాపు 70 కి.మీ. వుంటుంది.  వరంగల్లు నుండి వయా ములుగు రోడ్డు మీదుగా వెళ్ళాలి.  బస్సు లేదా స్వంత వాహనమ్ పై వెళ్ళొచ్చు.  దారి, ముఖ్యంగా ములుగు దాటినంక చాలా బాగుంటుంది.  అటు, ఇటు పొలాలు, చెట్లు, అక్కడక్కడ గుట్టలు, దారమ్మట గొర్రెలు, మేకల మందలు వెళ్ళడం, వాటి ముందు వాటి కాపరులు పోతుంటె ప్రయాణము చాల ఆహ్లాదకరంగా సాగుతుంది.

 ములుగు అడవి దారి దాటి వెళ్తుంటె జంగాలపల్లి అనే వూరు వస్తుంది.  ఇక్కడ కుడికి తిరిగి మరో ఎనిమిది కి.మీ.లు పోవాలె.  ఈ దారేమో సింగల్ రోడ్డు.  పరిసరాలు అందమైన చెట్లు పొలాలతో బాగుంటుంది కాని ఎదురుగ వేరె ఏదైన బండి వస్తె తప్పుకుంటు వెళ్లడము కాస్త చికాకైన విషయము.  మధ్యలొ వో చోట కల్వర్టు వుంది.  ఇక్కడ మరీ కష్టము.  నాకైతె అది ఎప్పుడైనా కూలి పోతుందేమొ అనిపించింది.  అంతె కాదు.  పెద్ద వాన వస్తె మునిగి పోయె అవకాశము కూడ వుంటుందనిపించింది.  ఏమో మరి.  వరంగల్లు స్మార్ట్ సిటి అవుతుంది, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలనుకుంటునప్పుడు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళె రోడ్లన్ని  బాగు చేసి వెడెల్పు చేయాల్సిన అవసరమెంతైనా వుంది.
లక్నవరము వెళ్లె బండ్లకు పార్కింగ్ స్థలము వున్నది కని సెలవు రోజుల్లొ అది ఎంత మాత్రము సరిపోదు.  చెరువుకు ఒక కి.మీ. దూరములోనె వాహనాలను అపెయ్యాలి.  ప్రతి చోట వున్నట్టె ఇక్కడ కూడ విఐపిల బండ్లు మాత్రము దగ్గరవరకు వెళ్ళొచ్చు.  పర్యావరణ రక్షణ అన్నది వాళ్ళకు వర్తించదు!  

పార్కింగ్ స్థలము పక్కనె ఒక చదునైన ప్రదేశము, అక్కడ ఒక గుండ్రటి అరుగు దాని మీద పసుపు రంగు వేసి పైన ఎర్రని గుడ్డ చుట్టిన ఒక చెక్క స్తూపము వుంది.  అది గట్టు ముసలయ్య దేవాలయము అని అక్కడ రాసివుంది.  ప్రస్తుతానికి అక్కడ గుడిలాగ ఏమి లేదు.  ఒక చౌకోటు మాత్రముంది.  మరో రెండు మూడేళ్లలో అక్కడ చిన్న దేవాలయము రావచ్చు.  లక్నవరము చూడ్డనికి వచ్చిన వాళ్లంత తప్పనిసరిగా అక్కడ దర్శనము తర్వాతె చెరువుకు వెళ్ళాలని చెప్పెవాళ్లు రావచ్చు.  ఆ ముసలయ్య ఎవరో, ఆ స్తూపము ఎందుకు పెట్టారో తెలుసికుందామంటె దగ్గరలో నాకెవరు కనబడలేదు.


లక్నవరము సరస్సు విస్తీరణము 108 చదరపు మైళ్ళు.   ఇది కాకతీయుల కాలములో, గణపతి దేవ చక్రవర్తి నిర్మించాడు.  ఈ సరస్సు గోదావరి  ఒక పాయగా భావించబడుతుంది.  చుట్టు వున్న అందమైన కొండలతో ఇది ఒక సహజ రిజర్వాయరుగా వుంటుంది.  దీని నుండి వచ్చె కుడి ఎడమల కాలువల ద్వారా చుట్టుపక్కల 6-7 గ్రామాలకు రెండు పంటలకు సాగు నీరు అందుతుంది.

ఈ సరస్సు నడుమ అందమైన ౧౬౦ మి.  పొడవున్న ఊయల వంతెన వున్నది.  వర్షాకాలంలో సరస్సు నిండా నీళ్ళున్నప్పుడు ఈ వంతెన నీళ్ళపైనున్నట్టె వుంటది.  సరస్సు మధ్యలో ఈ వంతెన మీద నడవటము వో మరుపురాని అనుభవము.  మధ్యలో ఓక ద్వీపము మీద రెస్టారెంటు, ప్రయాణికులకు వసతి గృహాలు వున్నాయి.  పిల్లల ఆట స్థలము, పడవ ప్రయాణానికి వసతులు వున్నాయి.  ఈ సరస్సులో వున్న మరో ద్వీపము పైన పర్ణశాలలు వున్నాయి.  సరస్సు నిండా నీళ్ళు వుంటె ఇవి నీళ్లలో వున్నట్టె అనిపిస్తుంది.

 
ఈ అందమైన సరస్సు వరంగల్లు పర్యటనకు వచ్చె పర్యాటకులు తప్పని సరిగ చూడాల్సినది.  వర్షాకాలములో ఈ సరస్సు అందాలు ఎంతో అద్భుతము.

Saturday, July 25, 2015

Godavari Mahapushkaralu

గోదావరి మహాపుష్కరాలు 

పుష్కరాలు వచ్చినయి .  పుణ్యస్నానాలైనయి .  ఆది పుష్కరాలు  ఇవ్వాల ఆఖరౌతున్నయి.  పోటి పడి తెలుగు రాష్ట్రాలు  రెండు పుష్క రాల గురించి బాగా ప్రచారము చేసినవి.  తెలంగాణ రాష్ట్రములో తొలి పుష్కరాలు అవటముతో ప్రజలెంతో ఉత్సాహముతో పుష్కరాలకు వెళ్లొచిన్రు.  తెలంగాణలో పండగ వాతావరణమున్నది.  తెలంగాణా  అంతట   పుష్కరాల ముచ్చట్లె.  పుష్కరాలకు పోకపోవడము ఓ పెద్ద విన్తైంది.
గోదావరికి ఈ ఏడాదంత పుష్కరాలున్నా మొదటి పన్నెండు రోజులు, ఆఖరి పన్నెండు రోజులకు బాగా ప్రాముఖ్యత వుంటుందట.  అందులోను మొదటది (ఆది పుష్కరాలు )  అంత్య (చివర వచ్చే)  పుష్కరాలకంటె మరింత ప్రాశస్త్యమని అనటంతో జనాలు పాపాలన్నీ పోగొట్టుకోవటమే కాదు పుణ్యము కూడ  మూట కట్టుకుందామని పెద్ద సంఖ్యలో నది సందర్శనానికి అందులో మునకలు  వెయ్యడానికి వెళ్ళింరు.  వేరె రోజుల్లో నదిలో స్నానం  చేసినా , మూడు మునకలు వేసినా  అంత పుణ్యం రాదంట.  సరే. పాపలు పోగొట్టుకోవటము, పుణ్యము సంపాదించుకోవటము మంచిదే కదా!  తెలియక పాపాలు చేస్తె పోని, తెలిసి చేసిన పాపలు కూడా ఈ స్నానముతో కొట్టుకుపోతయా?  నా డౌటు.  మళ్ళి  తెలిసి తెలియక పాపాలు చేస్తే మళ్ళి మన తెలుగు రాష్ట్రాల్లో అవి కడిగేసుకోవడము ఈ ఏడాదంత సులువే.  మళ్ళి ఏడాది జులై లో పుణ్యము కూడ సంపాదించుకోవచ్చు.
పుష్కరాల సందర్భంగా మరో విషయము తెలుసుకున్నాను.  మన దేశంలో వున్న నదులన్నిటికి  పుష్కరాలు వస్తాయి. ఆ లెక్కన మన దేశంలో ప్రతి ఏడు ఎక్కడో అక్కడ ఏదో నదికి పుష్కరము వస్తనే వుంటది. మన తెలుగు రాష్ట్రాల్లో వేరే నదులు కృష్ణ, తుంగభద్రా, ప్రాణహిత నదులకు కూడ పుష్కరాలు వస్తాయి. సో, ఎవరు భయపడక్కర్లేదు.  ఎన్ని పాపలు చేసినా కడిగేసుకోవడానికి నదులు, పుష్కరాలు మనకు వున్నయి.  నదులున్నంత వరకు మనం ఏం చేసిన స్వర్గములో సీటు రిజర్వన్నట్టే!
మనకు వున్న జీవనదులను మనము కాపాడుకుంటున్నామా?  నీరు లేకపోతె జీవితము లేదు, జీవనము లేదు, జీవములేదు. అభివృద్ధి పేరుతో మానవుడు చేసే  కార్యక్రమాలు  ప్రకృతి విధ్వంసానికి కారణమౌతున్నాయి.  ఆది  మానవుడు నదుల గోప్పతన్నాన్ని అవసరాన్ని గుర్తించి వాటిని   పూజించ టము  మొదలు పెట్టాడేమో .  ప్రతి తరము ఆ విషయాన్ని గుర్తుంచుకొని నదులను, నీటి వనరులను, వాటి పరిసరాలలో వుండె ప్రకృతిని  కాపాడుకోవటానికి ప్రతి ఏడు ఒక నదికి పుష్కర పూజలు ఏర్పాటు అయినైయనుకుంట.  ఆ ఏడాదంత ఆ నది పరివాహక ప్రాంతమును ప్రకృతి నియమాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాలికలు చేసుకొని మరో పుష్కరము నాటికి వాటిని అమలు చేస్తే ఎంతో బ్రహ్మాండంగా వుంటుంది!  ఆది నిండుగా వున్నా, ఎండినా అక్కడ ప్రజల చైతన్యానికి, జీవనశైలికి సూచికగా తీసుకోవచ్చు.  మహాపుష్కరాల నాటికి అక్కడ వుండె సంస్కృతి, ప్రజా జీవనము అక్కడ ప్రజలు వారి ప్రకృతిని ఎట్లా కాపాడుకున్నది అక్కడ పారే నది తెలియజేస్తుంది.
ఉత్తర భారతంలో సరస్వతి నది కేవలము అంతర్వాహినిగా వుంటుందని చెప్తారు.  అంటే ఒకప్పుడు సరస్వతి అనే నది వుండేదని, అది ఇప్పుడు ఎండి పోయిందని అనుకోవల్సిందె.  మనము పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకొనక పొతే నదులు ఎండిపొయె అవకాశమున్నది.  హైదరాబాదులో వంద ఏళ్ళ క్రితం మూసి నది ఎట్ల వుందో ఇప్పుడు ఎట్ల వుందో చూస్తె మనకు నదులు ఎట్ల మాయమైతయో, మురికి కాల్వలుగా ఎట్ల మారుతాయో అర్థమౌతుంది. అట్లాంటి స్థితి మరి ఏ నదికి రాకుండా, కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ పుష్కరాల సందర్భంగా అందరు గుర్తు పెట్టుకోవాలి.    
ఈ గోదావరి మహాపుష్కరాన్ని ఎక్కడా మొకాలులోతు మించి లేని నీళ్ళలో మనము ఘనంగా జరుపుకున్నము.  గొప్పలకు పోయి ఓ రాష్ట్రములో ప్రజల ప్రాణాలు బలి అయినవి.  ఈ  పాపము ఎవరిది?  ఈ పుణ్యము ఎవరికి?  మళ్ళి  గోదావరి మహాపుష్కరాల నాటికి ఈ నది ఎట్లా పారుతుందో, ఆ తరం ఈనాటి ఈ పుష్కరాల నుండి నేర్చుకున్న పాఠాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుందో?
పర్యావరణ రక్షణ సకల జీవుల సంరక్షణ.



Tuesday, June 16, 2015

As you sow....

దొరికితే దొంగ 

దొరికితే దొంగ, లేకపోతె అంతా దొరలే అని అందరికి తెలిసిన సామెత.  నేను చదువుకునే రోజుల్లో ఓ స్నేహితురాలు నాకు ఓ ఘటన గురించి చెప్పింది.  ఇది రాస్తుంటే అనాలోచితంగానే గుర్తుకు వచ్చింది.
ఒకసారి ఓ ఐదారుగురు స్నేహితులు కలిసి రైలు ప్రయాణము చేసి స్టేషన్లో దిగనరు.  అవతలకు పోయే గేటు దగ్గర టికెటు కలెక్టరుకు టికెటు ఇచ్చి బైటకు పొవాలె .  స్నేహితులంతా ఒకరివెనుక ఒకరు బైటకు వెళ్తూ టికెట్ కలెక్టరు టికెట్టు అడిగితె మోచేయి మడిచి బొటన వేలితో వేనుకోడిని చూపించుకుంట బైటకు వచ్చారు. ఆఖరున వున్నవాడు కాస్త మా స్నేహితురాలి తింగరి చుట్టం.  తన వాళ్ళంతా ముందుకెళ్లిన పధ్ధతి చూసిండు.  తన వెనుక ఎవరు లేరు.  వెనక్కు చూసి తటపటాయిస్తుంటే అనుమానమొచ్చిన టికెట్టు కలెక్టరు వాడిని పట్టుకో బోయినడంట.  అలర్ట్ అయిన మన వాడు 'ముందు వాళ్ళందరిని వదిలేసినరు, నన్ను కూడ వదిలేయండి, ప్లీజ్', అంటు పరగందుకోబోయిండట.  కాని అదృష్టం అడ్డం తిరిగింది. టికెట్ కలెక్టర్కు దొరికి పోయిండు.  తర్వాత law had taken its own course.
అసలు నేను తెలుగు రాష్ట్రాలో జరుగుతున్నా ఘటనల గురించి రాద్దామనుకున్న.  నిజంగ జరిగిన ఈ ఘటన గురించి రాసినంక ప్రస్తుతము ఇంక ఏమి రాయాల్సిన అవసరము లేదనిపిస్తుంది.
ఒక్కట మాత్రం నమ్మాల్సి వస్తుంది.  ఘోర పాపాలకు తగ్గ శిక్ష పడాల్సిన్దె.  తెలంగాణలో అంటారు ఎవరినైనా క్షోభ పెడితె వాళ్ళ  'ఉసురు' తగులుతుందని.  మామ ఉసురే  కాదు పన్నెండు వందల తెలంగాణ పిల్లల ఉసురు తగలక మానదు.
'A person who lives by the sword dies by it.'
  

Sunday, June 7, 2015

Telangana Celebrates

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము 

తెలంగాణా అంతట అన్ని జిల్లాల్లో తోలి ఆవిర్భావ దినోత్సవము ఈ  నెల రెండవ తేదినుండి ఘనంగా జరుగుతున్నయి .  వరంగల్లు జిల్లాలో కూడ ఈ ఉత్సవాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ బడుతున్నయి.  నగరములో ముఖ్యభవంతులు, కూడళ్ళు విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించిన్రు.  రెండవ తారీఖున నృత్య నాటకాలు,  చిత్ర ప్రదర్శన, శిల్పకళా ప్రదర్శన కూడా జరిగిన్ది.  వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు. 











Tuesday, May 12, 2015

News - Views

ధనమే ధర్మం  

ధర్మమేంటో అధర్మేంటో అర్థం చేసుకోవడము కష్టము.  అట్లనే న్యాయం, అన్యాయం కూడ.  ఒకప్పుడు ఓ విషయము, నిర్ణయము చెప్పి ఇది ఇంతే అనేవాళ్ళు.  పైసా పెడ్తె అంగట్లో అన్ని దొరికే కాలం.  అమ్మతనం కూడ (తప్పుగా అర్థం చేసుకోవద్దు, సర్రుగసి గురించి మరిచిపోవద్దు).  ఎప్పుడు ఏది తప్పౌతుందో, అది మళ్ళి ఎప్పుడు ఒప్పౌతుందో, దానికి ఎంత ఖర్చౌతుందో, కాలం పడుతుందో చెప్పటము కష్టం.  కాస్త ఓపిక, మరెన్నో కాసులు వుంటె ఏ నేరము చేసిన బతికినన్నాళ్ళు తప్పించుకు తిరగొచ్చు.  (తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతి!).  చచ్చాక ఏమైతె ఎవరికి నష్టం, ఎవరికి కష్టం.  పేదవాడికి బతికనన్నాళ్లు నేలతల్లి వడిలోనె పంటాడు.  చచ్చాక ఇంకాస్త వెచ్చాగా లోపల దాక్కుంటాడు.  ధనవంతుడు పట్టెమంచంలో పడుకున్నా, ఏసిలో అలసిసొలసి పోయినా చచ్చాక మట్టిలో కలిసిపోక తప్పదు.
ధర్మాన్ని నాలుగు కాళ్ళ కామధేనువుతో పోల్చారు.

కృతయుగంలో ధర్మము నాలుగు పాదాలు నడిచిందంట.  అప్పుడు ఎలాంటి పాపాలు, తప్పులు జరగలేదట.  త్రేతాయుగంలో ధర్మము మూడు పాదాల మీద నడిచింది.  శ్రీరాముడు తాటకిని చంపాడు.  వాలిని చెట్టు చాటు దాక్కొని చంపాడు.  రావణుడి తమ్ముడు విభీషణుడి సహకారాంతో రావణ బ్రహ్మను స్వర్గానికి పంపాడు.  ద్వాపరయుగం వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు అండగా నిలిచి, కురుక్షేత్రంలో గీత బోధన చేసి కలియుగ ఆరంభానికి స్వాగతం పలికాడు.  కలియుగంలో ధర్మము మూడు పాదాలతో కుంటుకుంటు నడుస్తుందని అన్నారు. నిజమే అని ఇన్నాళ్ళు  అనుకున్నాను.  ప్రపంచములో యుద్ధాలు ఎక్కడో అక్కడ ఎప్పుడు జరుగుతునే వున్నాయి.  మరి మరో కొత్త యుగం మొదలైందని అనుకుంటా.  ధర్మము నాలుగు కాళ్ళు విరిగిపోయాయి.  నడవలేక మూలకు పడింది.  మూలిగె శక్తి కూడ లేక తన కన్నీరు తానే తాగుతు కోమాలోకి వెళ్లిపోయింది.

Tuesday, April 28, 2015

Traffic Rules

తప్పులెన్ను వారు

కొన్నిసార్లు జరిగే సంఘటనలు గమ్మత్తు అనిపిస్తయి. చిన్నవాళ్లను చేయొద్దన్న పనులు పెద్దలు స్వేచ్చగా చేసేస్తుంటరు. పిల్లలను అబద్ధాలడొద్దని చెప్తం. పెద్దలం అవసరము, తప్పదని అబద్ధాలాడుతుంటము. ఒకసారి నేనో బస్సులో ప్రయాణిస్తున్న. ట్రాఫిక్ సిగ్నల్స్  దగ్గర బస్సు ఆగింది. కిటికీలో నుండి దిక్కులు చూస్తుంటే అవతలి వైపు ఓ మోపెడ్ మీద ఇద్దరు పిల్లలు - అబ్బాయిలు సుమారు 14 - 16 మధ్య వయస్సు వుండొచ్చు, వెళ్తున్నరు. మరి ఏమైందో, వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోలేదా లేక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారా మరి నాకైతె తెలియదు. నాకైతె వారి వయస్సు, బండి నడుపుతున్న పిల్లాడి చూస్తె చాలా చిన్నవాడనిపించింది, బహుశా డ్రైవింగ్ లైసెన్స్ లేదని ట్రాపిక్ పోలీసు ఆపిండనిపించింది. ఆ పోలీసు వెనక వున్నవాడిని దింపి, ఇద్దరబ్బాయిలు ఏదో బతిమాలుతున్న వినిపించుకోకుండ వెనక ఎక్కి కూర్చోని, ముందు వున్నఆ చిన్న పిల్లాడినె బండి నడిపింప చేసిండు. మా బస్సు ముందునుండె అడ్డంగా రోడ్డు దాటి ఇవతల వైపుకు తీసుకొచ్చిండు. ఆ పిల్లగాడు సరిగా నడపలేక పోతుంటే, వాని తోటి వున్నవాడు బండి నెట్టి రోడ్డు దాటించిండు. ఇవతలకు వచ్చినంక బండి నడుపుతున్న పిల్లగాడు బండిదిగిండు. తరువాత ఆ పోలీసు ఆ పిల్లలిద్దరికి ఏదో క్లాసు తీసుకున్నట్టనిపించింది. ఇంతలో బస్సు స్టార్ట్ అయి ముందుకు వెళ్ళింది. వాళ్ళు నాకు కనిపించలేదు. నాకు ఎక్కడ చిత్రం అనిపించిందంటె, చిన్నపిల్లాడికి నడపటము సరిగా రాకున్నా ఆ పోలీసు కూచొని బండి నెట్టించుకుంటు రావటము. పెద్ద వాడిని ఆ బండి తీసుకొని రమ్మనొచ్చు కదా! చిన్నావాడ్ని ఎట్లాగు లాక్కేళ్తే పెద్దోడు పారిపోడు కదా. లేదా పెద్దవాడి చేతే బండి నడిపించి తను వెన్క కూచొని రావచ్చు కదా. ఏమో. మొత్తానికి ఆ తతంగమంతా చూడ్డానికి తమాషాగా వుండింది.


ద్విచక్ర వాహనము నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ వుంటది.  కాని ట్రాఫిక్ పోలీసె హెల్మెట్ లేకుండా త్రిబుల్ సవారి  నడుపుతరుఆటో రిక్షాలో డ్రైవరు పక్కన ఎవరిని కూర్చో పెట్టుకోవద్దని రూల్ వుంటదికాని పోలీసె పోయే ఆటోని ఆపి వెనుక సవారి వుంటే డ్రైవరు పక్కన కూచోని పోనియ్యమంటడు. రూల్స్ వున్నయి అందరి క్షేమముకోసమె. వాటిని చేసిన వాళ్ళు, అమలు పర్చాల్సిన వాళ్ళు, ప్రజలు, అందరు పాటిస్తె ప్రమాదాలు, నేరాలు తగ్గుతాయి కదా. ఎవరికి వాళ్ళు వాళ్లకు రూల్స్ వర్తించయనుకుంటే మరి రూల్స్ ఎందుకు పెట్టాలే? సమాజ శ్రేయస్సు కోసం నిబంధనలు పెట్టినప్పుడు దేశ ప్రథమ పౌరుడితొ సహా ప్రతి ఒక్కరు హోదాలకు, రాజకీయాలకు అతీతంగా ఆ నిబంధనలు పాటిస్తె దేశము అభివృద్ధి పథములో నడవటమే కాదు అవినీతి కూడ అంతమౌతుంది కదా!

Tuesday, March 24, 2015

కుక్క బతుకు



ఈ లోకంలో ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యెకత వుంటుంది.   భిన్నమైన జీవన విధానము వుంటుంది.  జీవుల్లన్నింటిలో మానవుడె తెలివైన వాడు.  ఆడవుల్లో, కొండ గుహల్లో జంతువులతో కలిసి వున్న ఆది మానవుడు నాగరికత నేర్చి నగరాలు నిర్మించి అన్ని జీవులపై ఆధిపత్యము చేస్తున్నడు.  ప్రకృతిని నియంత్రించే స్థాయికి చేరుకున్నడు.
మానవుడు తొలుత మచ్చిక చేసుకొని తన అవసరాలకు ఉపయోగించుకున్న జంతువు కుక్క.  పెంపుడు జంతువుల్లో ముఖ్యమైనది, మానవుని జీవితంలో భాగమైనది కుక్క.  తొలుత వేట కుక్క, తర్వాత కాపలా కుక్కగ వుండి ఇప్పుడు పెంపుడు జంతువుగా మానవునితోనె కల్సి ఒకే కప్పు కింద వుంటుంది.  కుక్క అడవిని వదిలి మానవునితొ నాగరిక జీవనానికి్ అలవాటు పడింది.
కుక్క మానవునికి ఎన్నో విధాల తోడ్పడుతుంది.  దాని వాసన పసిగట్టే సునిశిత బుద్ధిని నేరస్తులను పట్టుకునేందుకు, ఇతర మానవ హానికర వస్తువులను కనుగొనడానికి రక్షణ శాఖ ఉపయోగించుకుంటుంది.  ఒంటరి మానవునికి కుక్క తోడుగా వుండి మానసికోల్లాసము కలిగిస్తుంది.
విశ్వాసానికి కుక్క మారు పేరు.  పాశ్చాత్య దేశాలతో పోలిస్తె మన దేశంలో కుక్కలను పెంచుకోవడము తక్కువే.  అయినా మనము ప్రతి ఊళ్ళొ (ఊర కుక్క) వీధిలో (వీధి కుక్క) కుక్కలను చూస్తున్నం.  ఈ కుక్కలు ఆ వాడలో వుండె వాళ్ళు దయతల్చి పెట్టె పాచితిండితో, చెత్తకుప్పల దగ్గర పడేసిన తిండితో కడుపు నింపుకుంటయి.  అవి  ఊరి మనుషులను , వాడ మనుషులను  బాగానే గుర్తుంచుకుంటయి.  అటు వైపు ఎవరైనా కొత్త వారు, అనుమానస్పద మనుషులు, జంతువులు వస్తే  మొరుగటమే కాకుండ వారి(టి)ని అక్కడ నుండి తరిమేయాడానికి ప్రయత్నిస్తయి.  ఏ ఒక్క కుటుంబము/వ్యక్తి దానికో రెండు సార్లు తిండి పెట్టినా, కాస్తా దయగా చూసినా ఇక జీవితాంతము  రుణ పడ్డట్టగా తోకాడించుకుంటు వెంట వెంట తిరుగుతాయి.  అవసరమైనప్పుడు రక్షణగ  నిలబడుతాయి.  పశుల కాపరి కుక్కలు పశువులను మేతకు తీసుకెళ్ళినప్పుడు వెంట వుండి అడవుల్లో ఇతర జంతువుల నుండి వాటిని కాపాడటానికి, పశువులు దారి తప్పకుండా చూస్తయి. ఇంటి కాపలా కుక్క ఇంటికి పెద్ద రక్షణ.  దాని నిద్ర చాలా తెలికైంది.  ఏ కొంచెం అలికిడైనా వెంటనే మెల్కోని చెవులు రిక్కించి విని, అవసరమైతె మొరిగి యజమానిని మేల్కోల్పుతుంది.  ధనవంతులు మనుషుల కంటె కాపలాకు కుక్కనే ఎక్కువ నమ్ముతరు. పెంపుడు కుక్కైతె ఇంట్లో మనిషి కిందె లెక్క.  అది పిల్లలతో అడటము, వారి వెంట బజారుకు వెళ్ళటము, వారికి రక్షణగ వుండటము చేస్తుంది.  ఈ పెంపుడు కుక్కలు మనిషి హవభావాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా కూడా మెదులుతాయి.  కొన్ని కుక్కలకు శిక్షణ ఇచ్చి అంతరిక్షములోకి కూడ పంపుతున్నరు.
మానవుని జీవితములో ఇంతగా కలిసిపోయిన జంతువు మరేది లేదు.  అయినా కుక్కను అంతా హీనంగా చూస్తము.  దానిని ఎంతగా దగ్గరకు తీస్తమో అంతె నిర్లక్ష్యంగా తంతము.  ఎన్నో సామేతలు నానుడులు కుక్కబతుకును చాలా హీనంగ చూపెడ్తయి.  చాలా తక్కువస్థాయి పనిచేస్తు, ఎవరి దగ్గరైనా జీతానికి పనిచేస్తుంటె వాడిది కుక్క బతుకని అంటము.  పిచ్చిగా ఇష్టము వచ్చినట్టు మాట్లాడుతుంటె కుక్కలా అరుస్తున్నవేందని, లేదా  వాడో పిచ్చి కుక్కని అంటము.  మనకు ఇష్టములేని, చాతకాని వ్యక్తి మనమీదికి వస్తె పోరా కుక్క అని అంటము.  ఒక నిస్సహాయ వ్యక్తికి సహాయము చేయమని మరొకరిని అడుగుతు, సహాయము చేస్తె కుక్కలా పడివుంటడని చెప్తము.  కొన్ని సార్లు సహాయము కోరే వ్యక్తె కుక్కలా మీ కాళ్ళ దగ్గర పడి వుంటనని అంటడు.  ఎవరైనా వ్యక్తి అదాటున ఏమైనా చేస్తె ఏంటి, కుక్కకు కల బడ్డట్టు అట్ల చేసినవని అడుగుతము.  మనము సహాయము చేసిన వ్యక్తి మోసం చేస్తె వాడు విశ్వాసములేని కుక్క అని అంటము.  ఎవరైనా చేసిన తప్పు మళ్ళి మళ్ళి చేస్తె కుక్క తోక వంకరన్నట్టు వాడి బుద్ధి అంతే్ అని విసుక్కుంటము.  ఎవరైనా మోసము చేస్తె బుద్ధి చెప్పాలంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బని, అట్లాగే చేతకాని వాడి సహాయంతో ఏదైనా కార్యము సాధ్యము కాదని అనడానికి,కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదనట్టు అని అంటము.  ఈ తిట్లన్ని విని పాపం కుక్క ఏమనుకుంటుందో కదా!
మానవుని జీవతములో ఒక ముఖ్య భాగమైన కుక్క నీచంగా చూడబడటానికి ఏమైనా శాపం వుందా?
ఆలోచిస్తె శాపం వుందనే నేనుకుంటున్న.  ఒక చిన్న కథ.  ఇంద్రుని దగ్గర సరమ అనె కుక్క వుంటుంది.  స్వర్గలోకం నుండి ఇంద్రుని ఆవులను ఒకసారి అసురులు దొంగ చాటుగా పాతాళానికి తీసుకుపోయినరు.  అప్పుడు సరమ వాసన ద్వార ఆ అవుల జాడ తెల్సుకొని మళ్ళి వాటిని స్వర్గలోకానికి తీసుకొచ్చింది.  అందుకు ఇంద్రుడు సంతోషించి సరమకు తన సభలో ఆసనమిచ్చి చోటు కలిపించాడు.  ఒకసారి సభకు దుర్వాస మహర్షి వచ్చాడు.  ఇంద్రుడితో సహా అందరు లేచి రుషి స్వాగతము పలికారు.  సరమ మాత్రము తోకాడించుకుంటు అట్లనే కూర్చుంది.  (అందుకేనేమో కనకపు సింహాసనము మీద కూర్చున్న కుక్క బుద్ది కుక్క బుద్ధె అంటరు).  దుర్వాస మహర్షికి అసలే కోపము ఎక్కువ కదా.  సరమ గురించి తెలుసుకొని తనకు మర్యాద ఇవ్వని సరమ, దాని సంతతికి ఎప్పుడు ఎవ్వరు మర్యాద ఇవ్వరని శపించాడు.  కుక్కలన్ని కూడ సరమ సంతానమే.  ఆ శాప కారణంగానేనేమో మనము కుక్కలను ఎన్నో విధాలుగా ఉపయోగించుకుంటున్న, ప్రేమగా చూసినా అఖరకు ‘చీ, పో కుక్క’ అంటము.
మనకు ఎంతో సహాయంగా వుండె కుక్కలను మనము కాస్త దయతో చూద్దాము మరి!

Tuesday, March 3, 2015

Sleep

నిద్ర - ఒక ముఖ్య జీవితావసరము

నిద్ర సుఖమెరగదని అంటరు.  నిజమే.  ఒళ్ళు, మెదడు అలసిపోయినప్పుడు ఎక్కడబడితె అక్కడ కాళ్ళు చాపుకొనో, ముడుచుకొనో, లేదా నిలబడి కూడ నిద్రపోవచ్చు.  ఆహార మైథునాలకంటే మనిషికి నిద్రే చాలా ముఖ్యము. వరసగా వారం రోజులు  ఒకింతైనా నిద్రపోని మనిషి చనిపోవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయమ్.
నిద్ర మనిషికి ఒక వరం.  ఎన్ని కష్టాలు వున్న కాస్త నిద్రపోయి లేస్తే మనిషికి ప్రశాంతత వస్తుంది. నూతనోత్సాహముతో, ఆలోచనతో ముందడుగు వేసె శక్తి వస్తుంది.
ప్రతి మనిషికి రోజుకి 6 - 8 గంటల నిద్ర అవసరము.  పసిపిల్లలు పుట్టిన మొదటి వారములో 20 - 22 గంటలు నిద్రపోతారు.  చక్కటి నిద్ర వారి ఎదుగుదలకు ఎంతో అవసరం.  వయస్సు పెరిగె కొద్ది నిద్ర తగ్గుతుంది.  సాధారణంగా 6 - 8 గంటలు నిద్ర సరిపోతుంది.  ముసలితనంలో కూడ 6 - 8గంటలు నిద్ర అవసరమే.  రాత్రి తొందరగా నిద్ర పోతె తెల్లారి తొందరగా లేస్తరు, ఆలస్యంగా నిద్రపోతె ఆలస్యంగా లేవడము జరుగుతుంది.  మనిషి సరిపడె నిద్రపోతె ఏమాత్రం మబ్బులేకుండా హుషారుగా లేస్తరు.  సరిపడె నిద్రపోనప్పుడు లేచినా కూడ మబ్బువుంటుంది, మళ్ళి వెంటనే పడుకోవాలనిపిస్తుంది లేద దినమంతా కునికిపాట్లు పడాల్సి వస్తుంది, కుదరకపోతె ఆ రాత్రి తొందరగా పడక ఎక్కాలనిపిస్తుంది.  సరిఅయిన నిద్ర లేనప్పుడు పనిలోకూడా ఏకాగ్రత తగ్గుతుంది.  విద్యార్థులు పరీక్షలప్పుడు నైట్ ఔట్ చేయటం పేద్ద తప్పు.  కావాలంటె ముందురోజు తొందరగా నిద్రపోయి ఉదయం తొందరగా లేవటం మంచిది.  నన్నడిగితె రాత్రి 11 నుండి పొద్దుట కనీసము 4 గంటలవరకు నిద్రపోతే మంచిది.  పరీక్ష రాసేటప్పుడు తలలో గందరగోళం వుండదు.  చదివినవి చక్కగా గుర్తుకు వస్తాయి.
నిద్ర పైకి అచేతనావస్థ అనిపించిన ఆ సమయములో శరీరములో జరిగే వివిధ ప్రక్రియలు, ముఖ్యంగా మెదుడులో జరిగె చర్యలు మనిషి శరీరక మానసిక క్లేషాలు తొలగించి లేదా తగ్గించి మరుసటి రోజును ఉత్సాహంగా నూతనోత్తెజముతో గడపేటట్టు తయారు చేస్తుంది.
నిద్రలేమి అన్నది మానసిక వ్యాధికి తొలి సూచన. ఒక వ్యక్తి ప్రతి రోజు సరిగ నిద్రపోలేక పోవటము, లేదా రెండు మూడు రోజులు అసలే నిద్రపోకుండా వున్నారంటె అప్పుడు తప్పనిసరిగా వైద్యుడిని, అవసరమనుకుంటే మానసిక వైద్యుడిని సంప్రదించాల్సిందే.  శారీరక బాధాలు - నొప్పుల వలన నిద్రలేక పోయినా, పైకి ఏ ప్రత్యేక కారణము కనిపించనప్పుడు తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి.
 మొన్నీమధ్య గూగుల్ లో చూసిన -
Good Night, Sleep Tight
Don't let Bugs Bite.


Monday, February 9, 2015

Dream City

కట్టాలంటె కూల్చాలా?

"నగరాలు ఎవరు కట్టరు, అవే అవసరాలను బట్టి మాడిఫై ఐతై  -పరిణామము చెందుతాయి", అని అన్నారు.  కరక్టె.  నగరాలు నిర్మించరు.  భవనాలు నిర్మిస్తారు. వాటిలో ప్రజలు నివసించినా, ప్రజావసరాలకు వినియోగించినా నగరాలు విలసిల్లటము జరుగుతుంది.  వేల ఏండ్ల కింద కట్టిన కట్టడాలు ఎన్నొ ఆ నాటి నగారికతకు చిహ్నంగా, చారిత్రక గుర్తులుగా ఇప్పటికి వున్నాయి.  కొన్నింటిని వారసత్వపు కట్టడాలుగా పరిరక్షించబడుతున్నయి. యుద్ధాల్లోనొ, ప్రకృతి వైపరిత్యాలవల్లో నేలమట్టమైన కోటలు, కట్టడాలను అక్కడ లభ్యమయ్యె ఆనవాళ్లతో ఆనాటి నాగరికతను, ప్రజల జీవన విధానన్ని తెలుసుకునే ప్రయత్నము జరుగుతుంది.  ప్రతి కట్టడము వెనక ఆ నాటి దేశకాల పరిస్థితుల ప్రభావము వుంటుంది.  చరిత్ర మనిషికి గతాన్ని తెలియజేయటెమే కాదు వర్తమానంలో ఎట్ల వుండాల్నో, భవిష్యత్తు ఎట్ల వుంటుందో సూత్రప్రాయంగా నేర్పుతుంది.
కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చింది.  దాని వెనక ఎందరు ఎన్ని రకాలుగా కష్టపడ్డారో, నష్టపడ్డారో ఆఖరకు అసాధ్యమని భావించినది ఎట్లా సాధ్యమైందో చరిత్ర తెలియచేస్తుంది.  ఒక నాటకము లేదా సిన్మా రక్తికట్టాలంటె తెరవెనుక ఎంత తతంగము జరుగుతుందో అందులో ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా పాల్గొన్నవారికి మాత్రమే తెలుస్తుంది.  కాని చివరఖరకు అత్యధిక గురింపు వచ్చేది కథానాయక పాత్రధారునికే.  కెసిఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు ఆ ఆరాధ్య భావము, గౌరవము వున్నది.  ఆయన చూపె అత్యద్భుత కలలను కొంతైనా నిజం అవుతాయని ప్రజలు ఆశతో, ఆసక్తితో ఓపికగా ఎదురుచూస్తున్నరు.  ఆకాశహర్మ్యాలు కాదు, ప్రజలకు నేల మీద ఇల్లు కావాలి.  అవి ఎంత తొందరగా అయితె అంత మంచిది.  ఆకలిగొన్న వాడికి పరమాన్నము, బిర్యాని అవసరము లేదు.  పప్పనం చాలు,  ఓ పండిస్తె అదే పదివేలు.  పరమాన్నం వండి వడ్డించే వరకు మరి ప్రాణం నిలబడాలి కదా!  గోల్డ్ స్టాండర్డ్ కాదు సిల్వర్ స్టాండర్డ్ పెట్టుకుంటె ఎక్కువ మంది ప్రజలు లబ్ది పొందే అవకాశముంటుందన్న భావన ఒక సందర్భములో స్వామి వివేకానంద వ్యక్త పరిచినట్టు గుర్తు.
తెలంగాణలో చాలా చోట్ల ప్రభుత్వభూములున్నాయని చెప్తున్నారు కదా.  కొత్త కొత్త కట్టడాలు అక్కడ కడితె బాగుంటది.  రవింద్రభారతి వున్నది వున్నట్టుగ వుంటె మంచిదే.  దానిని మునుపటిలాగే వాడుకోవచ్చు.  విశ్వనగరంగా మారబోతున్న హైదరాబాదులొ ఎక్కువ కళాకేంద్రాలు వుంటె మంచిదే కదా. ఏ స్థాయిలో జరిగె కళా ప్రదర్శనలు ఆ స్థాయి తగ్గ కేంద్రాల్లొ జరుగుతాయి.  ఒకటి కూలగొట్టి మరోకటి అదే స్థానంలో కడ్తాననడంలో అర్థం లేదు.
తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కొత్త నిర్మాణాల అవసరమున్నది.  కాని చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన అవసరము కూడ అంతె వుంది.
                                             **************************
 
ఈ మధ్యే వొ వూరి నుండినా దగ్గర్కి  ఒకరు వచ్చారు.  వాళ్ల వూళ్ళొ ఇదివరకు పించన్లు వచ్చే కొందరికి పించన్లు ఆగిపోయినయంట.  "రెండు వందలు వచ్చిన చాలు ఇదివరకు వచ్చినొళ్ళందరికి పించన్లు వస్తె బాగుంటది", అని ఒక ముసలమ్మ బాధ పడింది.  ఆమె పేరు మీద ఉన్న ఆస్తి కొడుకులకు పంచింది.  రికార్డులలో  మాత్రం పేర్ల మార్పు లేదట. కొడుకులు అసలు పట్టించుకోవట్లేదని, పేర్లు మార్చాలంటె పైసలు కావలని,  ఆస్తి తన పేరు మీదే వుండటముతో పించను రావట్లేదని చెప్పింది.  నెలకు రెండు వందలు వస్తె తన మందుల కర్చులు ఎల్లిపోయేదని వాపోయింది. 

Wednesday, February 4, 2015

CM - CBN

ఆంధ్ర చీఫ్ మినిస్టర్
హైద్రాబాద్ లో వుండటము చంద్రబాబుకు విదేశాల్లో వున్నట్టు వుందట.  మరి సొంత దేశానికి వెళ్లకుండా ఇంకా ఇక్కడ పట్టుకొని వేళ్లడటము ఎందుకో?  ఇదివరకు వాళ్ళ పూర్వికులు గుడారాల్లో వుంటు ఆంధ్రరాష్ట్రాన్ని పాలించలేదా!  ఆ స్పూర్తితో వెంటనే ఆంధ్రాకు వెళ్ళి అక్కడ ఫుల్ టైమ్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొందరగా సింగపూర్ చేస్తె అక్కడి ప్రజలు ఎంతైనా సంతోషిస్తరు.
ఆయనకు ఇంకా హైద్రాబాదు మీద వ్యామోహము పోలేదు.  వారానికి రెండు మూడు రోజులు హైద్రాబాదులోనె వుంటాడంట.  అప్ ఆండ్ డౌన్ చీఫ్ మినిస్టరు ఇక మీద వీకెండ్ చీఫ్ మినిస్టరుగా మారుతాడేమో.

Tuesday, February 3, 2015

Fine Rice

సన్నబియ్యం

తెలంగాణ ప్రభుత్వము హాస్టల్లకు సన్న బియ్యం సరఫర చేస్తుంది.  సంతోషమే.  తెల్లగా మల్లెపువులా అన్నంవుంటె ఎంతైనా తినబుద్ధేస్తుంది.  కాని ఈ తెల్లబియ్యం, సన్నబియ్యం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బియ్యాన్ని అతిగా పాలిష్ చేస్తెనే ఈ తెల్ల బియ్యం, సన్న బియ్యం వస్తవి.  బియ్యంలో వుండె ’బి’ విటమిన్, కొంత పిప్పి కూడ పాలిష్ చేయడంతో పూర్తిగ తౌడులో పోతుంది.  పాలిష్ చేయని బియ్యముతో వండిన అన్నము నిదానంగా జీర్ణమవుతుంది.  అందువల్ల ఆకలి కూడ తొందరగా కాదు.  తక్కువ తినడము, త్వరగా ఆకలి కాకపోవడమువల్ల స్థూలకాయము - లావు కావడము తక్కువగా వుంటుంది.  మధుమేహ వ్యాధి వున్న వారు గోధుమ లేదా జొన్న రొట్టె, గట్క తినలేకపోతె బ్రౌన్ రైస్ లేదా అన్ పాలిష్డ్ రైస్ తినవచ్చు.  లావుతగ్గాలనుకున్నవారు అన్నం మానేసి రొట్టే తినలేకపోతె కనీసం దంపుడు బియ్యం - బ్రౌన్ రైస్ తింటు వ్యాయామము చేస్తె ఒళ్లు తగ్గొచ్చు.  తిమ్మిర్లులాంటి అవస్థలు కూడా చాల తగ్గిపోతై.
మల్లెల్లాంటి తెల్లన్నం అతి త్వరగా జీర్ణమౌతుంది, అందుకే మళ్లి తొందరగా ఆకలేస్తుంది.  త్వరగా జీర్ణమవడము వల్ల తొందరగా రక్తంలో చక్కెర శాతం ఎక్కువగ పెరిగి, ఆరోగ్యంగా వున్నవాళ్ళలోనైతె అంతె త్వరగ తగ్గుతుంది.  హాస్టల్లో పిల్లలకు సామాన్యంగ రెండేసార్లు భోజనం పెడ్తరు. వాళ్లకు తిన్నాక రెండు-మూడు గంటల్లోనె మళ్ళి ఆకలేస్తుంది.  తినకపోతె చక్కరొస్తుంది.  ఆ పూట కాస్త తక్కువ తినివుంటే కళ్ళు తిరిగి కిందపడటం జరగొచ్చు కూడ.  ఆరోగ్యము పై అవగాహన కలిగి అందరు  ప్రతి రోజు పాలిష్ లేని బియ్యాన్ని వండుకుంటు, బుద్ధికి ఎప్పుడైనా తెల్లబియ్యాన్ని వండుకుంటె మంచిది.
మన దేశంలో మధుమేహ వ్యాధి (షుగర్) వున్న వారి సంఖ్య రానురాను పెరిగిపోతుంది.  గోధుమ లేదా పాలిష్ లేని బియ్యం వాడకము, తప్పనిసరిగ ప్రతి రోజు వ్యాయామము చేయటము అలవాటైతె ఈ వ్యాధి కొంతైనా తగ్గుతుంది.  

Thursday, January 8, 2015

One Step

ఒక్క అడుగు 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, KCR  ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు అయిపోయింది.  KCR గారు ప్రతి రోజు మీటింగులు పెడ్తు కొత్తకొత్త అభివృద్ధి ప్లాన్లు వెస్తున్నడు.  అన్ని వింటున్న ప్రజలు కలల్లో తెలిపోతున్నరు.  చెప్పిన వాటిల్లో సగమైన అయితే తెలంగాణ బతుకులు బంగారమే అయితై.  అది స్వచ్చమా లేక వన్ గ్రామ్ గోల్డా కాలమే నిర్ణయిస్తుంది.  ఏది జరగకున్న కనీసము చెరువుల పూడికతీత అయి నీళ్ల సౌకర్యం మెరుగైందంటే 2019లో మళ్ళి రాష్ట్రములో తెరాస రావడం ఖాయమ్.
KCR చేసిన సమగ్ర సర్వే ఆయనకు ప్రపంచ ఖ్యాతి  తెచ్చింది.  అంత ఘనమైన సమగ్ర సర్వే చేసినంక మళ్ళి పిల్లల స్కాలర్షిప్ల గురించి, పెన్షన్ల గురించి, రేషన్ కార్డుల గురించి రకరకా సర్టిఫికెట్లు అడగటము చికాకు కలిగించిన విషయము.  సమగ్ర సర్వేలో తెలుసుకున్న విషయలన్నీ  రెండు మూడునెలల్లో క్రోడికరించి పరిపాలన సౌలభ్యానికి ఉపయోగించుకుంటమన్నరు.  ఆ సర్వే రిపోర్ట్ ఇవ్వలే పేపర్లో వచ్చింది.  ఇక ప్రజా అభ్యుదయ పతకాలు ముందుకు పోవటము సులువైతుందనుకుంట.
ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంతమంది భూకబ్జకోరుల మీద కొరడ ఝులిపించినట్టె ఝులిపించి తర్వాత చాల రోజులు ఏమి మాట్లాడలేదు.  మళ్ళి మొన్న కబ్జాదారులందారు  రెగ్యులరైజేషన్ చేసుకొమ్మని నోటిఫికేషన్ ఇచ్చిన్రు.  ఇది ఎవరికి సాయం చేయడానికి?  దీని వలన వందల కోట్లు  లాభం పొందేది అన్ని ప్రాంతాల పార్టీల నాయకులు, బడా బాబులే కాదా?  మళ్ళి దాన్ని కొద్ది రోజులకోసం పక్కకు పెడుతున్నరు.  అంటె మరి కొంతమంది బడాబాబులు  ఎక్కడైన జాగలుంటె కబ్జచేసుకోవడానికి సమయమిచ్చి ఆ తర్వాత రెగ్యులరైజేషను చేస్తరా ?
తెలంగాణ సాధించిన వ్యక్తిగా KCR పై ప్రజలకు చాల గౌరవమే ఉన్నది.  వారి జీవతాలు కాస్తైన కెసిఆర్ పాలనలో బాగుపడ్తయని   బండెడు ఆశలు పెట్టుకున్నరు.  ప్లాన్ల కలలు వినివిని విసుగొస్తుంది.  Ground లెవెల్లో కాస్తైన మార్పు వస్తే అప్పుడు సంబురమైతది.
                                                      ********************

"Imitation is the best flattery" అంటరు.  ఆంధ్ర బాబు చంద్రబాబు నాయుడుకు కొత్త అలోచనలు ఏమి వస్తలేవు.  ఇంకా కాంగ్రెసును తిట్టుకుంట గతాన్నే నేమరేస్తూ , వర్తమానంలో కెసిఆర్ పథకాలనే కాపికొడ్తున్నడు.  తెలంగాణన్నా,  కెసిఆర్ అన్నా  చాల అసహనంతో వ్యవహరిస్తున్నడు.  ఇది ఒక అనుభవమున్న తెలివైన నాయకుడు చేయాల్సిన పని కాదు. ఇది ముందు ముందు ఎట్లాంటి చిక్కులు తెచ్చిపెడ్తుందో చూడాలి.
                                                       ***************************

నా చిన్నప్పుడు ఒక కథ చదివాను.
రామయ్య, సోమయ్య ఇద్దరు ఇరుగుపొరుగు వాళ్ళు.  రామయ్య తెలివైనవాడు.  కష్టపడె రకం.  సోమయ్య కూడ అన్నిట్లో సమ ఉజ్జీ అయిన ఎప్పుడు రామయ్యతో పోటి పెట్టుకొని ఆయన్ని మించిపోవాలనుకునెవాడు.  ఒకసారి ఆ ఊరికి మహిమలుగల మునీశ్వరడు వచ్చాడు. ఆ మహానుభావున్ని ఉళ్ళో ప్రతి ఒక్క కుటుంబము వారి ఇంటికి పిలిచి ఆతిథ్యము ఇచ్చెవారు.  రామయ్య, సోమయ్య వంతు వచ్చినప్పుడు సోమయ్య వెళ్లి మునీశ్వరున్ని ముందు తన ఇంటికి రావాల్సిందని ప్రార్థించి తీసుకొచ్చాడు. మునీశ్వరుడు సోమయ్య ఆతిథ్యానికి సంతోషించి ఏమి కావాలో కోరుకోమన్నడు. దానికి సోమయ్య రామయ్య ఏమి కోరుకుంటే దానికి రెండింతలు తనకివ్వమని కోరుకున్నడు. 'తథాస్తు' అని మునీశ్వరుడన్నడు   ఆ తర్వాత మునీశ్వరుడు రామయ్య ఇంటికి వెళ్లి అతని ఆతిథ్యము తీసుకున్నడు.  రామయ్యను కూడ ఏదైనా కోరిక వుంటె చెప్పితే తీరుస్తని  సెలవిచ్చాడు.  తన ఇంట్లో నుండి అంతకు ముందె సోమయ్య కోరిక విన్నాడు రామయ్య.  సోమయ్యకు గుణపాఠం నేర్పించాలనుకున్నడు.  మునీశ్వరుడిని తన ఒక కన్ను పోవాలని కోరుకున్నడు.  మునీశ్వరుడు 'తథాస్తు' అన్నడు.  ఆ తర్వాత సోమయ్యకేం అయిందో ఎవరైనా ఊహించవచ్చు.  

Sunday, January 4, 2015

Musing

నాలో నేను 

ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే రకరకా ఆలోచనా తరంగాలు ఎగిసిపడుతుంటాయి.  జీవితం అంటే ఏంటో అర్థమయ్యేసరికి జీవిత కాలం సరిపోదనిపిస్తుంది.  
అన్ని జీవరాసుల్లో పంచభూతాలు అంతర్లీనమై వున్నా బుద్ధి, మనస్సు, అహంకారం మానవులలో మాత్రమే వ్యక్తమౌతుంది. మనస్సు ఇంద్రియాలకు అలవాలామైతే అది జంతువుల్లో వున్నట్లే. ఎందుకంటె అవి పూర్తిగా ఇంద్రియాలకు లోబడే పనిచేస్తుంటాయి. వీటిలో కొంతమేరకు అహంకారము కూడ వుంటుందేమో? అవి గుంపుగా వుండటము, వాటిని సంరక్షించుకోవటము జీవనపోరాటమే కాక  స్వీయ అస్థిత్వ  అహంకారములో భాగమేనని నా కనిపిస్తుంది. 
'బుద్ధి' అన్నది మాత్రమే కేవలము మానవజాతికే పరిమితమైనది.  బుద్ధి వలన జ్ఞానము, విచక్షణ, ఇంద్రియ నిగ్రహము వృద్ది చెందుతాయి. విషయ పరిజ్ఞానము విచక్షణ కలుగజేస్తుంది.  యుక్తాయుక్త విచక్షణ మనస్సుని ఇంద్రియ ప్రలోభాలను నిగ్రహించెటట్లు చేస్తుంది.  ఇంద్రియ ప్రలోభాలు తత్సుఖాలనుండి మనస్సు విడివడితె అది ప్రశాంతమౌతుంది.  ఆ ప్రశాంతమైన మనస్సు నిశ్చల సరస్సు వలే వుండి పరమాత్మను సాక్షాత్కరింప చేసుకుంటుంది. నిశ్చలమైన సరస్సులో భూమ్యాకాశాలు, పరిసరాలు ఏ విధంగానైతే స్పష్టంగ ప్రతిబింబిస్తాయో నిశ్చల మనస్సులో కూడ  సర్వాంతర్యామి సాక్షాత్కరిస్తారు.