Wednesday, December 31, 2014

Happy 2015


నూతన సంవత్సర శుభాకాంక్షలు 
2014 మరి కొద్ది సేపట్లో ముగుసిపొతుంది.  మరి కొత్త సంవత్సరము మొదలు కాబొతుంది.  కాలము నిరంతరమైంది.  ప్రతిరోజు కొత్తదే. ప్రతిక్షణము మళ్ళి రానిదే.  కాని ఎప్పుడొ ఒకసారి కూర్చోని మనము చేసినదాని గురించి, చేయాల్సిన దాని గురించి, దాని మంచి చెడ్డలు సింహవలోకనము చేయడానికి ఓ సందర్భము కావాలి.  కొత్త సంవత్సరము, పుట్టినరోజు అందుకు ఎంతో సముచితము.
యువత కొత్తసంవత్సరాన్ని ఆహ్వానించటము రాన్రాను ఆడంబరంగా జరుగుతుంది.  ఈ జరుపుకోవడములో అదుపు తప్పిన ఆటపాటలు, మద్యపానము ఎక్కువైతుందె తప్ప కొత్తగా ఓ వ్యక్తిలో ప్రగతి, క్రమశిక్షణ, సదాచారం వైపు ఓ అడుగు ముందుకు పడటము తక్కువగా జరుగుతుంది.  రాత్రి పన్నెండింటివరకు రకరకాల కార్యక్రమాలు చూడటము, మద్యము సేవించి, పన్నెండింటికి "హాప్పి న్యూ ఇయర్ " అంటు బిగ్గరగా అరుస్తు రోడ్ల మీద పడటము మళ్ళి తెల్లారి జీవితము యథాతథంగా సాగించటము!  ఏదో సాధించాలనుకున్న వాళ్ళు కొద్ది మంది కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవటం, అందులో కొన్నైనా అమలు చేసి సాధించాలనుకున్నవి కొంతవరకైన సాధించటం చాల సంతోషించ దగ్గ విషయము.
2015 సంవత్సరము అందరిలో మానవత్వపు విలువలు పెంచాలని, అందరి జీవితాలు ఆరోగ్యంగా, ఆనందంగా  వారు కోరుకున్న గమ్యాని చేరుకోవాలని కోరుకుంటున్నాను.
నేను 1979 ఇలా ఆహ్వానించాను.  ఇప్పుడు కూడా 2015ను అట్లాగే అహ్వానిస్తున్నాను.
ఓ నూతన వత్సరమా!
రా! రా! రా! 
ఆశలు నిండిన హృదయముతో 
ఆశయాలు పండిచుకునే తలపులతో 
ఆహ్వానిస్తున్నాను నిన్ను 
రా! రా! రా!
ఓ నూతన వత్సరమా !
వస్తు వస్తు నీవు 
ఏం తెస్తున్నావు?
అడగాల్సిన పనిలేదులే 
తెస్తావు నీవు 
అందరికోసం ఆన్ని 
అందుకునే సామర్థ్యము 
ఎందరికున్నదో మరి!
పట్టుదల పన్నీరుతో   
కడుగుతాను నీ పాదాలు 
వివేకమనె పీటపై 
కూర్చుండజేస్తాను నిన్ను 
చురుకుదనమే నైవేద్యమిచ్చి 
నీ పూజ చేస్తాను 
నా జీవితాలయములో 
దేవతగా నిలుపుకుంటాను నిన్ను.
రా! రా! రా!
ఓ నూతన  వత్సరమా!
రా!రా! రా!  

Tuesday, December 9, 2014

December 9, Initiation of Telangana State formation

తెలంగాణ ఏర్పాటుకు తొలి అడుగు
డిసెంబర్ తొమ్మిది 2009 తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైన రోజు.  ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఎంతొ ఉత్కంటతో టీవిలకు అంటుకపోయి ఇటు KCR  పరిస్థితిని, అటు దేశ రాజధానిలో జరుగుతున్న చర్చోపర్చల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న సందర్భము.  తెల్లారితే అసెంబ్లీ కి  తెలంగాణ విద్యార్థుల రాలీ.  కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా వుంది.  ఆ రోజే కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి జన్మదినము.  ఆమె ఎలాంటి సంబారల్లో మునగకుండ ఎందరితోనొ చర్చలు జరిపింది.  తను ఇచ్చిన ఎలక్షన్ వాగ్దానాన్ని నిలుపుకొవటానికి నిజాయితిగా, శ్రద్ధతో అందరి సహకారముతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసింది.  రాత్రి పదకొండున్నరకు దేశ హోమ్ మంత్రి, "The process of forming the Telangana State will be initiated", అంటు మీడియా ముందు, ప్రపంచం ముందు ప్రకటించాడు .  ఆ ప్రకటన తెలంగాణ ప్రజల గుండెల్లో అనందజల్లులు కురిపించింది.  ఆ అమృత వాక్కులు కెసిఆర్ ప్రాణాలను నిలబెట్టాయి.
కాంగ్రేసు నాయకులు, తెలంగాణ ప్రజలు కూడా అది శ్రీమతి సోనియా గాంధి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆమె పుట్టినరోజు కానుకగా పొగిడారు.  ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుందని సంతోషించారు.  సోనియాగాంధి తెలంగాణ దేవతగా కొనియాడారు .  కాని ఆ తెల్లారి నుండి జరిగిన ఘటనలు, తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు చనిపోతున్నా సోనియా గాంధి మౌనము, కాంగ్రెసు నాయకుల నిర్లక్ష్యము, వారు  అంధ్ర గవర్నమెంటుకు అందిస్తున్న సహకారాము తెలంగాణ ప్రజలకెంతో కోపము, నిస్పృహ కలిగించింది.  ఏ ఒక్కనాడైనా  శ్రీమతి సోనియా గాంధి తానూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని, విద్యార్థులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక్క ప్రకటన చేసినా, ఇక్కడి   కాంగ్రెసు నాయకులు ప్రజల పట్ల కాస్త సానుభూతిగా వ్యవహరిస్తు ఆంధ్ర CM కిరణ్ కుమార్ రెడ్డి అవకతవక మాటలకు, చేతలకు గట్టిగా అడ్డుతగిలిన కాంగ్రెసును తెలంగాణ ప్రజలు కాస్తైన నమ్మేవారు.  సోనియా మౌనము. కాంగ్రెసు నాయకుల అధికార దాహము వారికి చావు దెబ్బ అయింది.
తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు - సోనియా గాంధి పట్టుదల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని.  ఆ స్థానములో వేరే ఎవరున్న అది జరిగేది కాదని.  సోనియా గాంధి పార్టి ఓడిపోయినా తెలంగాణ ప్రజలు ఆమెను గుండెల్లో పెట్టుకొని పూజిస్తరు. వచ్చిన రాష్ట్ర అస్థిత్వము నిలుపుకునేకోసము తెరాసకు ఓట్లు వేసి గెలిపించినా తెలంగాణ ప్రజలు సోనియాకు తమ కల సాకారము చేసిన వ్యక్తిగా మనస్ఫూర్తిగా వినమ్రంగా నమస్కరిస్తరు.
శ్రీమతి సోనియా గాంధి పుట్టిన రోజు తెలంగాణలో ఒక కాంతి కిరణం మెరిసిన రొజు.  తెలంగాణ ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు.
Many many Happy Returns of The day to Mrs. Sonia Gandhi.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!!

Monday, December 1, 2014

AIDS


ఎయిడ్స్ 
ఎయిడ్స్, ఎయిడ్స్, ఎయిడ్స్ 
ఎయిడ్స్ అంటె ఏమిటి?
దడ పుట్టించే 
ఎయిడ్స్ అంటె ఏమిటి?
AIDS - ఎయిడ్స్  అంటె 
Acquired Immuno Deficiency Syndrome
పేరు పెద్దది, అంటుకుందంటె 
అవుతుంది బతుకు చిన్నది. 
వస్తుంది చిన్న వైరస్ తో 
శరీర కణాలతో ఐక్యమై
స్వాహా చేస్తుంది 
స్వరక్షణ శక్తిని. 
వివాహేతర బంధం 
వినాశనాల బంధనం 
కనీసం కండోమ్స్ తో 
కష్టాన్ని కాస్త తగ్గించుకో. 
పదిక్షణాల సౌఖ్యంకోసం
పరులతో సంభోగిస్తె 
పదేళ్ళలో పంపుతుంది పరలోకానికి 
స్వర్గ సౌఖ్యాలు పొందటానికి. 
నూరేళ్ళ జీవతం నిండుగా 
గడపాలంటే 
నీ సంసారంలోనే  సంతృప్తి వుంది 
తెలుసుకో  
కట్టుకున్న దానితో జీవితం 
కమనీయ కలగా చేసికో. 

ఇది నేను 1996 డిసెంబర్ లో రాసింది.   ఎయిడ్స్ వ్యాధి సంభోగము, వ్యాధి వున్న వారి రక్తము ఎక్కించుకోవటము మరియు ఆ  జబ్బు వున్న తల్లి నుండి గర్భస్త శిశువుకు అంటుకుంటుంది. అప్పటికింకా ఎయిడ్స్ చికిత్స లేని జబ్బు. ఇప్పుడు చికిత్స వున్నా ఈ జబ్బు వచ్చిందంటే మొత్తంగా పోవటము మాత్రము జరగదు.  కాని జీవితాన్ని కొంతవరకు పొడిగిస్తుంది.   తల్లి  నుండి గర్భస్థ  శిశువుకు సంక్రమించకుండ నివారిస్తుంది. 
ఎయిడ్స్ వ్యాధి నివారించాలంటే వివాహేతర సంభోగాలకి దూరంగా వుండాలి. జబ్బు సోకితే తగిన చికిత్స శ్రద్ధగా క్రమము తప్పక వాడాలి.  గర్భవతి అయితే వెంటనే మందులు వాడితే శిశువుకు రాకుండా ఆపవచ్చు. తప్పనిసరి పరిస్థితిలో రక్తము ఎక్కించుకోవల్సి వస్తే తగిన పరీక్షలు చేసిన తరువాతే రక్తము ఎక్కించుకోవాలి. 

Saturday, November 29, 2014

Telangaana Assembly

 తొలి తెలంగాణ శాసన సభ  
తెలంగాణ అసెంబ్లీ మూడు వారాల పాటు చక్కగా సాగింది.  మధ్యలో ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చిన ఆఖరకు అంత సామరస్యంగా ముగిసింది.  రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరిగిన పూర్తిస్థాయి సమావేశాలు ముందు అనుకున్నదానికంటే వారము రోజులు ఎక్కువే జరిగినవి.  చాలా ఏండ్లనుండి చూసిన సమావేశాలకు ఈసారికి ఎంత తేడా వుందో!  సమావేశాలు పొద్దంతా జరిగినవి.  రాత్రి పదకొండు దాటినంక కూడ సాగినవి.  ప్రతి ఒక్క సభ్యునికి మాట్లాడే అవకాశము దక్కింది.  ప్రతి సభ్యుడు  రాష్ట్ర అవసరాల గురించే కాక ప్రత్యేకంగా వారివారి నియోజక వర్గాల అవసరాలగురించి శాసన సభలో చెప్పటం జరిగింది.  ఇప్పుడు ప్రజలు తమ శాసన సభ్యుడు సభలో వున్నాడా, వాళ్ళ అవసరాల గురించి మాట్లాడిండా , ఏమి మాట్లాడిండొ ప్రత్యక్ష ప్రసారములో చూడవచ్చు. అవసరమైతే నియోజకవర్గానికి వచ్చినప్పుడు నిలదీయవచ్చు. తెలంగాణ  శాసన సభలో మొత్తానికి అన్ని పార్టీల నాయకులు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వుండటము తెలంగాణ ప్రజలను సంతోష పెట్టే విషయమ్.  తె తెదేపా నాయకులే కాస్త మారాల్సిన అవసరముంది. మారని వాళ్ళకు తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెప్తరు.
తెలంగాణ ప్రగతి గురించి, బంగారు తెలంగాణ నిర్మాణము గురించి KCR గారు ప్రణాళికలు రచించటములో చాలానే కష్టపడుతున్నరు.  ప్రజలకు ఎన్నెన్నో ఆశలు, కలలు కలిపిస్తున్నరు.  చెప్పినదాంట్లో సగమైన అయితే తెలంగాణ ప్రజల జీవతము ఎంతో బాగుపడుతుంది.  ప్రజలు అతడిని దేవుడని ఫొటొ పెట్టుకొని రోజు దండం పెట్టుకుంటరు.
మన రాష్ట్రము, మన నాయకులు, మన శాసనసభ, మనకోసం ప్రణాళికలు - ఎన్నో ఏళ్లుగా  వేచి సాధించుకున్న కల.  ప్రగతి ప్రణాళికలు సక్రమంగా సాగి తెలంగాణ దేశంలోనే కాదు, ప్రపంచములోనే ఓక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మరో పదియేళ్లలొ ఎదగాలని ఆశిద్దాము.
జై తెలంగాణ!

Friday, November 14, 2014

Swaccha Bharat


కొండెక్కిన కొండ చీపురు 
"ఏమే రాధ, ఈ మధ్య నువ్విళ్ళుడిస్తె దుమ్మసలె పోతలేదు " ఇంట్లో పనులు చేసె రాధ చీపురు తీసుకొని ఊడుస్తుంటె అన్నది కౌసల్య .
"చీపురు గిట్ల మొట్టిదైతే దుమ్మెట్ల పోతది.  ఇంక వంగబడి గట్టిగానే ఊడ్వ బడ్తిని. నెల రోజులవట్టి చెప్తున్న కొత్త చీపురుకట్ట పట్టుకరమ్మని. తెస్తలేరైతిరి".  మొండి చీపురును ఆడిస్తూ అన్నది రాధ
" గివ్వెమో మార్కెట్లో దొరుకవాయే.  ఆ చీపుర్లు అమ్మే లచ్చవ్వ కూడ ఈ నడ్మ కనవడ్తలేదు",
ఇంతలోనే బైట "చీపుర్లమ్మ, కొండ చీపుర్లు" అనే మాట వినొచ్చిం ది.
"అమ్మ, అమ్మ మాటల్లోనే వచ్చింది చీపుర్లు అమ్మేది.  ఓ నాలుగు కొనిపెట్టమ్మ పడి వుంటై "అంది రాధ. అంటూనె చేతిలో ఉన్న చీపురు పక్కన పడేసి వాకిట్లోకి వెళ్లి, "ఓ చీపుర్లమ్మ! ఇక్కడికి రా', పిలిచింది  మొండి చీపురుతో వంగి ఊడ్వటం రాధకు కష్టంగా వుంటుంది.
కౌసల్య  కూడా వాకిట్లోకి వచ్చింది .
"ఓ లచ్చమ్మ బాగున్నవానే?  శాన రోజులాయె, ఈ నడ్మ ఇటు కనబడ్తలేవు",  పలకరిచింది కౌసల్య
"నా పానం బాగుంటలేదు.  ఏం  జెయ్య.  అయిన చేసుకోకపోతె ఎళ్లదాయె. రెండు కట్టలియ్యమంటావా ?"  నెత్తిమీద కట్టలను కింద పెట్టి కూచుంది  లచ్చమ్మ
"కట్టలు బాగా సన్నగున్నయి. ఎంతకిస్తున్నవు?"  వంగి చీపురుకట్ట పట్టుకొని చూస్తు అడిగింది కౌసల్య
"ఇరవై  ఐదు కొకటి".
"రెండునెల్ల కింద పదిహేనుకే ఇస్తివి కదా",  ఒక చీపురు పట్టుకొని అటు ఇటు ఆడిస్తూ అంది రాధ.
"ఔను పదిహేనుకిచ్చినవు , అవి ఇంత కంటే మంచిగుండె.  ఇప్పుడు రెండు కలిపితే కాని ఓక కట్ట మంచిగయెటట్టు  లేదు .  ఎప్పడు తీసుకునేదాన్ని, బాగా సన్నగున్నై. పన్నెండు కియ్యి" .  కౌసల్య బేరం మొదలు పెట్టింది.
"పడదమ్మ పడదు.  నాకే ఇరువై నాలుగు పడ్డది". కచ్చితంగా చెప్పింది లచ్చమ్మ
"గట్లంటె ఎట్ల? రెన్నళ్ళకె ధరలు రెండింతలైతె ఎట్లనే?  మామూలు నెల జీతాల మీద మేమెట్ల  బతకలే?
"నువ్వే గట్లంటే మా అసుం టోల్లు ఏమనాలే?"  ఎదురు ప్రశ్నించింది లచ్చమ్మ
"ఏం ధరలో ఏం పాడో.  ఇచ్చె ధర చెప్పు".  కొనక తప్పని పరిస్థితి గుర్తొచ్చింది కౌసల్యకి
"ఎప్పుడు కొనేదానివి.  నీకెక్కువ చెప్తానమ్మ?  కొండ  చీపుర్లు దొరుకుడె కష్టముందమ్మ. పొద్దంత తిరిగి అమ్ముకుంటే కట్టకో రూపాయి పడ్తది".  తన కష్టాన్ని చెప్పుకుంది
ఇంతలోనే అక్కడకు కౌసల్య  కూతురు లక్ష్మి వచ్చింది.  ఆమె స్కూలు డ్రెస్ వేసుకొని  వెళ్ళడానికి రెడి గా వుంది.
"అమ్మ, నాకో చీపురుకట్ట కావాలే".  చీపుర్లని చూసి అడిగింది.
"ఎందుకు చదువు బందు పెట్టి రోడ్లు ఊడ్వ బోతవా",  చికాకుగా అంది కౌసల్య
"కాదమ్మ. మా స్కూల్లో ఎల్లుండి స్వచ్చ  భారత్ ప్రొగ్రాముంది.  నేను క్లాసు లీడరు కద.  అందులో వున్న.  ఎమ్మల్యే కూడా వస్తడట.  టివి ఛానెల్ వాళ్ళు కూడ వస్తరట.  అందుకని మా  టీచరు ఒక చీపురు తెచ్చుకోమంది".
"ఇంక నయ్యం . పాయఖానా కడిగే బ్రషు చెంబు తెమ్మనలేదా ?"
"కాదమ్మా , మన .." లక్ష్మి మాట్లాడుతుంటే మధ్యలోనే లచ్చమ్మ  అందుకుంది. " ఓ తల్లి , కొంటవో  కొనవో చెప్పు.  నేను పోవాలె".
"గంత తొందరపడ్తవేందె.  ఇరవైకోటన్న ఇవ్వు . పొద్దున్న లేస్తే ఇల్లు వాకిలి ఊడ్వకుండ నడుస్తదా?"
"తక్కువేమీ లేదమ్మ.  రెండియ్యానా?" కరాఖండిగా అంది లచ్చమ్మ
"యాభైకి మూడివ్వు.  మూడు తీసుకుంటా".
"నాలుగు తీసుకున్నా వందకిస్త.  కావాలంటే వున్న వాట్ల పెద్దవి  ఏరి తీసుకో.  నీకని ఇస్త."  మాటలో కాస్త మెత్తదనము
"వామ్మో, చీపురు కట్టలు గింత పిరమైతే ఏట్లా. ఎం జేస్తం.  రెండు ఇయ్యి",  తప్పదన్నట్టు అన్నది.
 రెండు కట్టలు తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది కౌసల్య .
హాల్లో కూర్చొని టీ  తాగుతున్నాడు నారాయణ.
"ఇంకో రెండు తీసుకోక పోయినవా ?
"మొన్న మూడు నెల్ల కింద వచ్చినప్పుడు ఇంతకంటె మంచిగున్నవి పదిహేనుకోటిచ్చింది.  ఇప్పుడు ఒక్కోటి ఇరవై ఐదంటుంది"
"బేరము విన్నలె.  ఎందుకైనా మంచిది. ఇంకో రెండు తీసుకో".   లేచి తన పాంటు జేబులోనుండి వంద నోటు తీసిచ్చాడు  నారాయణ
"వో అమ్మ. నేను బోతా."  బైటనుండి లచ్చమ్మ అరిచింది.
"తొందర పడ్తవేంది. వస్తున్న .  ధర ఎక్కువనే గని మళ్ళెప్పుడోస్తవో.  ఇంకో రెండివ్వు".
"గీవి   మంచిగున్నై, తీసుకో.  రాన్రాను ఇవ్వి కూడ దొరుకతాయో లేదొ.  మా సేటు  చెప్తుండె.  చీపురు కట్టలన్ని డిల్లికి పోతున్నయట .  అక్కడేదో పార్టి గుర్తు చీపురు కట్టేనంట.  అక్కడ వాళ్ళు చీపుర్లను అందరికి పంచుతరంట.  గందుకే ధరలెక్కువైనయంట".  మాట్లాడుతూ  వంద నోటుని తీసుకోని  ఒక చిన్న పర్సులో పెట్టుకుంది.  మిగిలిన చీపుర్లను కట్టగట్టుకొ తలమీద పెట్టుకొని " చీపుర్లమ్మ, కొండచీపుర్లు"  అంటు వెళ్ళింది
మరో రెండు కట్టలను పట్టుకొని ఇంట్లోకి వస్తు, "విన్నావా అదేమన్నదో",  భర్తను అడిగింది.
"వినబడ్డది, వినబడ్డది. ఇంకాసేపుంటె స్వచ్చ భారత్ గురించి కూడా చెప్పేదనుకుంట".
"ఈ చీపుర్ల పార్టీ ఏందో, స్వచ్చ  భారత్ ఏందో ఈ  ధరలు పెరుగుడెందో!  స్వచ్చ భారత్ ఒక్క రోజులో అయ్యెదా?  పెద్దపెద్దోలంత స్టైల్ గ  డ్రెస్ ఏసుకొని,షోగ్గా తయారై ఓ గంటో, పావుగంటో రోడ్లమీద చీపురు కట్టలు పట్టుకొని ఫోటోలకు నిలబడితే ఏమొరుగుతది. ఎవరి ఇల్లు, ఎవరి వాడా, ఎవరి ఊరు వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటే మంచిది". వాస్తవాన్ని చెప్పింది కౌసల్య  " చిన్నప్పటి నుండె పరిశుభ్రత, ఆరోగ్యము గురించి పాఠాలు కరెక్టుగా నేర్పితే దేశము బాగుపడదా".
"దానికి చాల టైమ్ పడుతుంది. ఇప్పుడు ఈ పెద్దోళ్ళంత చేసేది ఉత్త ప్రచారమే".
"ఏమి ప్రచారమో! మన లక్ష్మి స్కూల్లో కూడ స్వచ్చ భారత్ వుందట.  దానికో చీపురు కావాలట!"
"అమ్మ, ఒక కొత్త చీపురు ముళ్ళు దులిపి పెట్టు.  ఎల్లుండి నేను తీసుకెళ్త".
"ఉత్తుత్తి ఊడ్చుడికి కొత్తదెందుకు?"
"ఫోటోలు తీస్తరు, టివిలో కూడ రావచ్చు కద. మొండిదైతే ఏంబాగుంటది.  నాకైతే కొత్తది కావలె .  మళ్లి ఇంటికి పట్టుకొస్తలే".
"దానిని అట్లాగే పెట్టు.  మా ఆఫీస్లో కూడ ఈ ప్రోగ్రాం వచ్చె వారం వుంటదనుకుంటా. ఈ ఆదివారము మన కాలనీలో కార్పరెటరును పిల్చి స్వచ్చ భారత ప్రోగ్రాం పెడ్తరట".  విషయాలు వివరంగా చెప్పడు నారాయణ
"ఎన్నడు ఊడ్వనోళ్ళు ఒక్కనాడు వో గజం జాగాలో చీపురాడించి గొప్పగా ఫోటోలు తీసుకుంటున్నారు.  ప్రతిరోజూ ఆ పని చేసె మమ్మల్ని మాత్రం ఒక్కరు ఫోటో తీయరు",  నిరాశగా  అంది రాధ.
"చాల్చాల్లె.  నీ ఎన్క నీను చేస్తలేనా.  టైం తొమ్మిది కావస్తుంది. తొందరగా ఊడ్వు.  ఈ ఫోటోలు, ప్రోగ్రాములు ఏమో గని కొండ చీపుర్ల ధరలు కొండెక్కినవి.  కేజ్రివాల్ చీపుర్లు పంచి ఓట్లు బాగానే తెచ్చుకుంటడెమో! "


అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
మా ఇంటికొచ్చింది
ఇల్లంతా నాకింది
ఓ మూల నక్కింది

అట్లాంటి చీపురు ఇప్పుడు సెలబ్రిటీ అయింది.  ఎంతో మంది సెలెబ్రిటల చేతిలో హస్తభూషణమై ఎన్నెన్నో ఫోటోలలో వస్తుంది.   టివీలో అందంగా కనబడ్తుంది.


అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
అవినీతిని  తరుముతన్నది
ఆమాద్మి గుర్తైంది
స్వచ్చతకు పేరైంది
సెలబ్రిటిలకు చెరువైంది.  



Wednesday, November 12, 2014

Telangaana Assembly

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ తొలి  బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఆరు నుండి జరుగుతున్నయి.  కొత్త రాష్ట్రములో సమావేశాలు సజావుగా సాగుతున్నందుకు సంతోషమనిపించింది.  అది కాస్త ఇవ్వాల ఆవిరైంది.  ఏ పార్టి వాళ్ళైన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాల్సిందే.  తెదేపా తెలంగాణ నాయకులు తప్పనిసరిగా తెలంగాణ ప్రజల పక్షము తీసుకోక తప్పదు.  తెలంగాణ ప్రగతికై అడుగు వేయక తప్పదు.  కరుడుగట్టిన ఆంధ్ర పక్షపాతి, రెండు కళ్ళతో ఆంధ్ర వైపే దృష్టి సారించే బాబుగారి నాయకత్వములో పనిచేస్తున్న తెతెదేపా నాయకులు వారి రాజకీయ భవిష్యత్తుకై తెలంగాణను 
బంగారు తెలంగాణ చేయటానికి ఇక్కడి ప్రభుత్వానితో చేయి కలుపక తప్పదు.  అందుకనే తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ అవసరాలకు కేంద్రానికి పంపించే లేఖకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెల్పినవి.  ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అమోదించాయి.
తెలంగాణలో వుంటె జాతీయ పార్టీలు వుండాలి లేద తెరాస వుంటుంది .  ఎం ఐ ఎం ఒక ఎక్సెప్షన్.  తెలంగాణలో తింటూ, తెలంగాణలో పంటు ఆంధ్రకు అప్ అండ్ డౌన్ చేస్తూ ఆ రాష్ట్రాన్ని ఏలుతున్న చంద్రబాబు తెదేపాను ఎన్నటికి  జాతీయ పార్టీని చేయలేడు .  ఆ అవకాశాన్ని 2010లోనె బాబు జారవిడుచుకున్నడు.  తెలంగాణను అష్టకష్టాలు పెట్టాలన్న ముందుచూపుతోనె పోలవరము ముంపు మండాలాలను ఆంధ్రలో కలుపుకున్నడు.  పిపిఎలు రద్దు చేసి తెలంగాణను కరెంటు కష్టాలలో ముంచి ఎంతొ మంది రైతుల మరణానికి కారణమైనడు.  అట్టి నాయకుని కింద తెతెదేపా   నాయకులు ఎన్నాళ్ళు పనిచేస్తరో చూడాలే.
సభను సరిగ్గా జరగకుండ ఆంద్ర నాయకుడు ఎన్ని పన్నాగాలైన పన్నుతడు.  దానిలో భాగమేననుకుంట నిజామాబాదు ఎంపి పైన ఆరోపణ.  తప్పుడు ఆరోపణ చేసి పొరపాటు ఒప్పుకోకుండా రాద్ధాంతం చేసి సభ వాయిదా పడేటట్టు చేసారు.  మళ్ళీ ఇట్లా కాకుండా తెలంగాణ ప్రభుత్వపక్ష నాయకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటా.  

Thursday, August 14, 2014

Telangana Survey

ఉల్కెందుకు ?

 తెలంగాణా ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలుపరచేందుకు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది.
అందుకని ముందుగా సర్వే చేయాలని నిర్ణయం తీసుకొని దానిని పకడ్బందిగా చేయాలంటే ఒక్క రోజులో అయితే బాగుంటుందని అనుకొని ఈ నెల పంతొమ్మిది మంగళవారం (19-8-2014) ఖరారు చెసింది.  మంగళ వారమైతే సామాన్యంగా  తెలుగు వారెవరు ఫంక్షన్లు, ప్రయాణాలు పెట్టుకోరు.  తప్పని పరిస్థితిలోనైతేనే routine పనులకి తప్ప ఇంటి సరుకులు కొనడానికికూడ కొందరు బైటకు వెళ్లరు.  దానికి ముందు సోమవారం అష్టమి - గోకులాష్టమి అవుతుంది.  పండగ చేసుకునే వాళ్ళంత ఇంట్లోనే వుంటారు. పంద్రాగస్టు జెండా ఎగెరేసినంక ఉద్యోగస్తులు ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే 19 తారీఖు వరకు ఇంట్లో వుండి 20 తారీఖు పొద్దుటే మళ్లి డ్యుటిలో చేరొచ్చు.  గవర్నమెంటు ఆ రోజు సెలవని ప్రకటించింది కాబట్టి ప్రైవేటులో కూడ అంతా సెలవే.   ఈ తేదీని ఎంతో ముందుగ ప్రకటించడము జరిగింది కాబట్టి తెలంగాణా  సామాన్య ప్రజలంతా కూడ సర్వే కోసం సన్నద్ధ మౌతున్నరు.
ఈ సర్వే గురించి ఆంధ్రొళ్ళకు ఉల్కెందుకో? దీని గురించి కేంద్రానికి షికాయితులు, కోర్టులో కేసులెందుకో? వారిలోనైన సామాన్యులకు కలిగే నష్టమేమి?  ఏమున్నా, ఇటు తెలంగాణలో కాని, ఆంధ్రలో కాని  ఇబ్బడి ముబ్బడిగా,అడ్డగోలుగ   దోపిది డారుల్లాగా  ఆస్తులు - ముఖ్యంగా భూములు  సంపాదించుకున్న బడాబాబులకే కాస్త ఇబ్బందేమొ.  అయినా వారి మార్గాలు వారికి ఉంటాయిలె.  కేవలము తెలంగాణలో ఏ పని సరిగ్గా సాగనియోద్దనే కుళ్ళు ఆలోచనతో సీమాంధ్ర రాజకీయనాయకులు ఆడుతున్న కుతంత్రము.  వాళ్ళ కుతంత్రము అర్థమైన తెలంగాణా ప్రజలు రెట్టింపు పట్టుదలతో ఈ సర్వేను విజయవంతం చేయాలనే పట్టుదలతో వున్నరు.
ఈ సర్వె ఒక చరిత్రాత్మక సర్వే.  ఈ సామాజిక ఆర్థిక సర్వే తెలంగాణా ప్రగతికి తోడ్పడటమే కాదు మున్ముందు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయదలచుకున్నదేశంలోని  అన్నిరాష్ట్రాలకె కాదు ప్రపంచానికే దిక్సూచి కాగలదు.
ఇతర రాష్ట్రాల్లో, లేదా దేశాల్లో వున్న తెలంగాణ స్థానికుల వివరాలు సర్వే పాల్గొన్న సభ్యుల నుండి తెలుసుకున్నవిషయాలు హొమ్ శాఖ ద్వారా నిర్దారించుకోవచ్చు.  తరతరాలుగా తెలంగాణలో స్థానికులైన వారెవరు కేవలం ఈ సర్వే మూలంగా స్థానికత కోల్పవడమన్నది అసంభవము.
తెలంగాణ వారుగా, తెలంగాణా వాదులుగా ఈ సర్వే  విజయవంతం చేయటము ప్రజలందరి బాధ్యత.   

Saturday, July 12, 2014

News - Views

ఆంధ్ర ప్రజల సహనం 

తెలంగాణ రాష్ట్రము ఏర్పడి నెల పది రోజులైంది.  తెలంగాణ సీఎం చకచక తన పనులు తాను  చేసుకుంటు ముందుకెళ్తున్నడు.  ఇతర మంత్రులు కూడ తామేమి తక్కువ కాదన్నట్టు వారి వారి శాఖ పనులను ఉత్సాహంగ చేస్తున్నరు.  తెలంగాణ వచ్చిన నెలలోనే బొనాలు, రంజాను పండుగ రావటముతొ రాష్ట్రములో ప్రజలు నీటి కరువు కూడ మర్చిపోయి సంబురాలు చేసుకుంటున్నారు.
పక్కవాళ్ళు సంతోషంగా ఉంటె ఓర్వలేని వాళ్లు వుంటరు.  అర్జంటుగా ఎలాంటి చర్చ లేకుండా, స్థానికుల విన్నపాలకి విలువ ఇవ్వకుండా ఇద్దరి నాయుల్ల కోరిక మేరకు ఖమ్మంలోని ఏడు మండలాలను ఏట్లో ముంచె నిర్ణయం తీసుకుంది పార్లమెంటు.  స్థానికులకు ఇష్టములేకుండ ఆ ప్రాంతాన్ని బలవంతంగా  మరో ప్రాంతంలో కల్పటము రాజ్యాంగ విరుద్ధము కదా.  ఈ ప్రాంత ప్రజలకు కొత్త కేంద్ర ప్రభుత్వము 'అచ్ఛే దిన్ '   ఏమో కాని 'చచ్చే దినా'లను ముందుకు తెచ్చింది.  తెలంగాణ ప్రజలంతా సంతోషంగా పండగ చేసుకోకుండ అయితుంది.
 కేంద్రము ఆంధ్రలోని ఇద్దరు నాయుళ్ళ చేతుల్లో వుందాని అందరికి అనిపిస్తుంది.  అయినా ఇంకా ఆంధ్ర రాజధాని ఎక్కడో తేలకపోవడం అనుమానాలకు తావిస్తుంది.  చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును పదిహేనేళ్ళు కావాలని అడగటము,  ఆం. ప్ర .  తెలంగాణ ఉమ్మడి గవర్నరుకు అత్యధిక పవర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరడంలో చాలానే స్వార్థముంది.  కేవలము రాజకీయనాయకులు, ధనికస్వామ్య బడాబాబులకోసం హైదరాబాదులో పర్మినెంటుగ మకాం పెడదామని అనుకుంటునట్టుంది.  అందుకే ఆంధ్రలో రాజాధాని గురించి అలోచించకుండ హైదరాబాదులో కూర్చోని రోజుకో శ్వేత పత్రము విడుదల చేస్తు కాలం గడుపుతున్నడు.  సామాన్య ఆంధ్ర ప్రజల సహనాన్ని మెచ్చుకోవాలి.  వారి రాష్ట్రము వారికి వున్నా వారి రాజకీయనాయకులు, సిఎం సహా మంత్రులందరు హైదరాబాదులోనే తిష్ట వేసి అక్కడి నుండే పాలన చేస్తున్నా  భరిస్తున్నరు.  ఎన్నాళ్ళు ఓపిక పడుతారో చూడాలి. ఆంధ్ర నాయకులు ఆంధ్ర - తెలంగాణ మధ్య up & down పాలన ఉద్యోగము చేస్తున్నట్టుంది.  ఎంతకాలం ఇలా సాగదీస్తరో చూడాలె.  
చంద్రబాబు నాయుడు ఎంతసేపు నేను హైదరాబాదు develop చేసానని చెప్పుకుంటున్నడె తప్ప ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని development గురించి కలలు  కల్పించటము తప్ప్పిస్తే ప్లాన్లేవి ముందు పెడుతలేడు.  వర్తమానము, భవిష్యత్తులో ఏమి చేయలేనివాడే గతంలో చేసినపనుల గురించి మాత్రమె మాటిమాటికి గొప్పగా చెప్పుకుంటు బతుకుతాడంట!

Monday, July 7, 2014

Lovely Daughter


అమ్మాయి 
మనసున మమతలు ముసిరిన వేళ
ప్రేమ పరిమళాలు వెదజల్లిన వేళ
ఆనందమె జీవిత మైన  వేళ
నన్ను నేను చూసుకుందామనుకున్న
నువ్వు కావలని కోరుకున్న.

నా జీవములో జీవివై
నా ప్రాణములో ప్రాణమై
నాలో ఒక భాగమై మెదిలావు
నా కలల కలిమివై నిలిచావు.

పేగు బంధం తెంచుకొని
నన్ను అమ్మను చేసిన
అమ్మవు నీవు, ఆత్మ బంధువె నీవు
బంధానాలు ఏవి లెకున్నా
ఈ అనుబంధం కల కాలం నిలిచేనమ్మ.


Sunday, May 11, 2014

Mother


అమ్మ

అమ్మవు నీవే
అఖిలము నీవే
అండమైనా, పిండమైనా
బ్రహ్మాండములోనైనా శక్తివి నీవే.
జీవము నీవే, జీవితము నీవే
ఆత్మను పరమాత్మను
అనుసంధానము చేసె
నిగూఢ వాహినివి నీవే.
అవని భారము నీదే
నీటిలో ప్రాణము నీవే
అగ్నిలో స్వచ్ఛత నీవే
వాయువులో ఆయువు నీవే
ఆకాశములో అనంతత్వము నీవే.

Tuesday, March 18, 2014

News - Views

కొండా రాజీకీయాలు
కొండా సురేఖ తెరాసాలో చేరటం సంతోషించదగ్గ విషయము.
ఒక బిసి మహిళ ఆ స్థాయికి ఎదగటం అంత సులువైన పని
కాదు.  చాలా ఏళ్ళ నుండి నేను ఆమేను ఫాలో అవుతున్నాను.
ఆమెకు వరంగల్ ప్రజలలో మంచి పేరుంది.  తనకు తెలిసిన
వారెవరైనా కష్టాల్లో వుంటె వెంటనె వచ్చి పరమార్శిస్తుంది.  తను
నమ్మిన సిద్ధాంతలకు కట్టుబడి చక్కగా మాట్లాడె వాక్చాతుర్యం
ఆమె  స్వంతం.
రాజశేఖర్రెడ్డి, ఆయన కుటుంబముపట్ల వున్న గౌరవము, విశ్వాస
ముతో మంత్రి పదవికి రాజీనామా చేయటము, కాంగ్రేసును వదలి
వైకాపాలో చేరటము ఆమె చేసిన పెద్ద తప్పు.  దానికి ఆమె కారణాలు
ప్రత్యేకంగా ఏముండెనో మరి?  కాని కేంద్రము నుండి తెలంగాణ ప్రకటన
వచ్చినంక ఎప్పుడైతె వైకాపా ఎమ్మెల్యెలు రాజీనామా చేసిన్రో, జగన్
సమైక్యానికే పూర్తిగా కట్టుబడి వుంటానని తెగేసి చెప్పండో అప్పుడు
వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేసింది.  అప్పట్లోనె కాంగ్రేసులో చేరె
ప్రయత్నం చేసినా మరి ఏమైందో తెలియదు.  ఇప్పుడు ఈ ఎన్నికల
సమయంలో పొన్నాలను కల్సినా ఏమైందో కాని తెరాసా గూట్లో వచ్చి
వాలింది, భర్తతో సహా.  ఆమెకు, ఆమె  భర్తకు ఏమి హామీలు వచ్చాయో
మరి!  తెరాసాలో చేరింది కాబట్టి ఆమే ఎక్కడ పోటి చేసినా గెలిచె
అవకాశాలు బాగానే వుంటాయి.  ఇక నుండైనా ఆమె  సెంటిమెంట్లకు
పోకుండా తన స్థాయిలో తెలంగాణ, ముఖ్యంగా వరంగల్ జిల్లా
అభివృద్ధికి పాటుపడాలి.
ఇక్కడ KCRను కూడ మెచ్చుకోవాలి.  తనను ఘాటుగా విమర్శించిన
కొండా సురేఖను పార్టీలో చేర్చుకోవటము ఆయన రాజకీయ విఙ్ఞతకు
నిదర్శనం.
రాజకీయాల్లో ఏకైక సిద్ధాంతము అధికారములోకి రావటామే.  అందుకోసం
ఎన్ని రాజీకీయాలైనా చేస్తరు.  ప్ర్జజాసేవా కూడ రాజకీయల్లో పదవిలోకి
రావటము ఓ ముఖ్యమైన మార్గమని గుర్తిస్తె ప్రజల జీవితాలు బాగు
పడటెమే కాదు,  రాజకీయాల్లో కుళ్లు కాస్తైనా తగ్గుతుంది కదా.

Friday, March 14, 2014

News - Views

ఎలక్షన్ల పండగ - 2014
ఎలక్షన్ల పండగ వస్తుంది.  ముహుర్తాలు ఖరారైనయి.  రాష్ట్రములో,
దేశములో పార్టీలు పండగకు తయారవటము మొదలైంది.  ప్రజలను
మాటలతో మాయజేసి ఓట్లు దండుకునే వ్యూహాలకు పార్టీల సింగారింపు
మొదలైంది.
పార్లమెంటు ఎన్నికలకు జాతీయ, ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమౌతున్నయి.
జాతీయ పార్టీలైన కాంగ్రేసు, భాజపాలకు స్వంతంగా ప్రభుత్వమేర్పాటు
చేయలేమని ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు రకరకాల ఎత్తులు వేస్తున్నయి.
కామ్రేడుల గురించి చెప్పె పనేలేదు.  వాళ్ళు దేశంలో జాతీయ స్థాయిలో
ఎప్పుడు పొత్తులేకుండ ముందుకు పోలేదు.  కొలకత్తాలో తృణమూల్
వచ్చాక వారి అస్థిత్వము ముప్పులో వుందనే చెప్పాలి.  ఇప్పుడంతా
పార్లమెంటులో ప్రాంతీయ పార్టీలదే హవా అని అన్ని ప్రాంతీయ పార్టీలు
రకరకాల ఎత్తుగడలతో, పొత్తులతో అధికారంలోకి రావడానికి అడుగు
లేస్తున్నయి.
ప్రస్తుత ఆం.ప్ర. పరిస్థితి మరీ గందరగోళంగా వుంది.  అర్జంటుగా కొత్త
కొత్త పార్టీలు పెట్టేస్తున్నరు.  అంతా అధికారము ఎంత తొందరగా అయితె
అంత తొందరగా పొందాలనే.  ఇప్పుడు అరచేతిలో చెందమామను చూపించే
వాళ్లు రేపు అధికారంలోకి వస్తె అద్దంలో చూపిస్తారు.  ప్రజలు అమాయకులు
కాకున్నా వారికి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి.  ప్రతి నాయకుడు,
పార్టీ, వేరే పార్టీ, నాయకుడిని తిట్టడమే.  ఒకరి గుట్టు మరొకరు రట్టు చేయడమే.
ఎవరూ వద్దని కొందరు NOTA వత్తినా ఆయా పార్టీల వాళ్ళు వేసె ఓట్లతో ఎవరో
ఒకరు గెలవక తప్పదు.  నూట్లో తొంభై మంది NOTA వత్తిన వచ్చె పది ఓట్లలో
ఎవరికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళు అధికారములోకి రావచ్చు కదా!
కిరణ్ కుమార్ రెడ్డికి అధికారమిచ్చి కాంగ్రేసుకు కొరివితో తలగోక్కున్నట్టైంది.
స్పీకర్‍గా వుండి చెల్లని రాజీనామాల విషయం దాచిపెట్టి ఏపీని అద్రగాణం
చేసిండు.  సీఎమ్ అయ్యాక తెలంగాణ ఉద్యమము అణిచేయాలని తెలంగాణ
స్టూడెంట్సును నానా ఇబ్బందులు పెట్టాడమే కాదు, స్వంత పార్టీ ఎమ్మెల్యేలను,
ఎమ్పీలను అరెస్టు చెసిండు.  చివరాఖరకు "నేను అధిష్టానానికి వ్యతిరేకము
కాదు, నిర్ణయానికి మాత్రం వ్యతిరేకమ"ని ధిల్లీలో దీక్ష చేసిండు.  ఇప్పుడు
‘జై సమైక్యాంధ్ర’ అని పార్టీ పెట్టి విడిపోయిన రాష్ట్రాని కలుపుతానంటు బెర్లిన్
గోడ ముచ్చట చెపుతున్నడు.  బెర్లిన్ గోడ ప్రజల కోరికవల్ల కూలగొట్టబడింది.
కాని ఇక్కడ తెలంగాణ ప్రజలు అరవై ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్నరు.
ఏ మాత్రం బుద్ధున్నోడు మళ్ళి సమైక్యమని ఎట్లంటడు?  కిరణ్ కుమార్ రెడ్డి
సుప్రీం కోర్టుకు వెళ్ళి తిరిగి రాష్ట్రాన్ని సమైక్యం చేస్తనని సీమాంధ్రులకు
చెప్పటం ఆ ప్ర్జజల చెవుల్లో కాలిఫ్లవర్ పెట్టడమే.  నాకైతె అన్పిస్తుంది, కిరణ్
చుట్టువున్నవాళ్ళు కిరణ్ణు ఎక్కించి, ఎలక్షన్ల తరువాత ఆయన్ను
ముంచేస్తారని.  రెణ్ణెళ్లలో అంతా బైట పడుతుంది.
చంద్రబాబు నాయుడు హైద్రాబాదు నేనె కట్టానంటాడు.  నిజాం తరువాత అంత
గొప్పవాడిని నేనెంటాడు.  తెలంగాణ చరిత్రలో తన పేరు వుంటుందని చెప్పు
కుంటాడు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో గాంధి పేరు, మౌంట్‍బాటన్ పేరుతో
పాటు జనరల్ డయ్యరును ఎవరు మరిచిపోరు కదా.  ఎన్డియే హయాంలో
తెలంగాణ ఆపింది నేనెని ఘనంగ చెప్పుకున్నబాబు, 2009లో తెలంగాణకు
అడ్డుపడి 1200ల తెలంగాణ పిల్లల ఉసురు పోసుకోవడానికి కారణమైన
విషయాన్ని చరిత్ర ఎలా మర్చిపోతుంది్?  మామను వెన్నుపోటు పొడిచి
గద్దేనెక్కిన బాబు, తరువాత భాజపా హవాతో మళ్ళి అధికారంలోకి వచ్చాడు.
సొంతంగా ఏభై సీట్లు కూడా గెలవలేక పోయిన బాబు తెరాసాతో పొత్తు పెట్టుకొని
2009లో ఎక్కువ సీట్లు కొట్టాడు.  ఇక ఇప్పుడు మళ్ళి భాజపాతో పొత్తు
పెట్టుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నడు.  సీమాంధ్రను సింగపూర్
చేస్తడట!  ఈ వెన్నుపోటు వీరుడిని సీమాంధ్రులు పసుపు కుంకుమలతో
ఎలా ఆదరిస్తరో చూడాలి.
పసుపు పార్టీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ మధ్య అండర్ గ్రౌండ్ పోయినట్టున్నడు.
చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా ఏం చేసినా దాని పరమార్థం విప్పిచెప్పుతు
బాబును వెనుకేసుకొచ్చేటోడు.తెలంగాణలో ఎన్ని విమర్శలు ఎదురైనా
దులుపెసుకుంటు KCRను విమర్శించె పని పెట్టుకొన్నమోత్కుపల్లి కూడ
ప్రస్తుతం సైలెంట్ అయిపోయిండు.  తెలంగాణ వస్తె నేనె ముఖ్యమంత్రినని ఆశ
పెట్టుకున్న ఎర్రబెల్లి, రాజ్యసభ ఎన్నికల్లొ మొండి చెయ్యి అందుకున్న మోత్కుపల్లికి
చంద్రబాబు తెలంగాణలో BCని ముఖ్యమంత్రిని చేస్తాననడం అస్సలే మింగుడు
పడలేదనుకుంట.  ఇన్నాళ్లు వీళ్ళిద్దరు బాబును వెనుకెసుకొచ్చినందుకు దక్కిన
ఫలితానికి విచారములో మునిగిపోయారనుకుంటా.  మరి ఎప్పుడు పైకి తెలుతారో,
ఎట్లా తేలుతారో ఏ పార్టీలో తేలుతారో చూడాలి. ఇంతకు తెలంగాణలో తెదేపాకు
ఎన్ని ఓట్లు పడతాయి?
ఇక వైకాపా కొస్తె ముందు తెలంగాణ ఇవ్వటం కేంద్ర నిర్ణయానికి వదిలేసినా
తరువాత సమైక్య జెండా పట్టుకొని తెలంగాణలో పార్టీని పాతరేసిండు.
కోర్టు కేసుల్లో ఆస్తుల attachment అయితుంటే ఆ నష్టం పూడ్చు
కోవడానికి టికెట్లు అమ్ముకుంటున్నడు.  దానితో పార్టీ కాస్తా ఖాళి అయితుంది.
ఉన్నోళ్లు పదుల కోట్లు పెట్టి టికెట్టు తీసుకున్నంక గెలిస్తే ప్రజల సొమ్ము ఎన్ని
వేల కోట్లుదోచుకుంటరో?  వైకాపా వాళ్ళను ఎన్నుకునేటప్పుడు వాళ్ళు
ప్రజల ధనాన్ని కొల్లగొట్టడములో వాళ్ల నాయకునికే పాఠాలు నేర్పుతరని మరవద్దు.
తెరాసా తెలంగాణ ఇంటి పార్టీగా గుర్తింపు పొందింది.  తెలంగాణ వాదులంతా
ఇంటి పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నరు.  అట్లైతేనె కేంద్రములో
కోట్లాడి విభజన సమయములో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కొంతవరకైనా
సరిదిద్దుకొవచ్చని, రాష్ట్రములో అధికారములో వుంటె ఉమ్మడి రాజధాని వల్ల
పదేళ్లలో ఆంధ్రోళ్ల వల్ల అన్యాయాలు కాస్తైనా తగ్గుతాయని సామాన్య జనం ఆశ.
కాని KCR వ్యూహాలేంటో?  తెలంగాణ తొలి CM దళితుడెనన్న  KCR
ఆ విషయాన్ని ప్రజలు యాది మరిచింన్రని అనుకుంటున్నడా?  తన
పార్టీలోల్ల్లందరితోను తెలంగాణ పునర్మిణము కావాలంటె KCR తెలంగాణ
రాష్ట్ర CM కావాలని ఇంటా బైటా మీడియా ముందు కూయిస్తున్నడు.
ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణకు vision వున్న గట్టి నాయకుడు కావలిసిందె.
కాని ఎలక్షన్లో గెలిచాక కాంగ్రేసుతో విలీనమై కొడుక్కో బిడ్డాకో ముఖ్యమంత్రి
పదవి అప్పగించి జాతీయస్థాయిలో పదవి పొందడని గారెంటి ఏంటి?  ఈ
మధ్యే ఒక ఉత్తరాది నాయకుడు రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉండవు.
అధికారములోకి రావటమే ఏకైక సిద్దాంతమని సెలవిచ్చాడు.  తెలంగాణ
ఉద్యమాన్ని పద్నాలుగేళ్ళు నడిపి, ఓట్లు, సీట్ల ద్వారనె రాష్ట్రాన్ని సాధించు
కుందామని చెప్పి ఆ విధంగా రాష్ట్రాని సాధించిన KCRను తెలంగాణ ప్రజలు
దేవుడని పూజిస్తరు.  రాజకీయ ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చి
దానిని కలకాలం తెలంగాణ పార్టీగ బ్రతకనిచ్చి, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బాట
వేస్తె KCRకు తెలంగాణలో గుళ్ళు కట్టడం ఖాయం.  మరి KCR ఏం చేస్తాడో
వేచి చూడాలి.
మొత్తానికి ఈసారి రాష్ట్ర ఎన్నికలు ఎంతో ఉత్కంఠను రేపుతున్నాయి.  క్రితం
ఐదేళ్ళలో జరిగిన ఏ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు.  సీమాంధ్రలోనైన,
తెలంగాణలోనైనా ప్రజల తీర్పు రాజకీయ నాయకులను ఆలోచింప
జేసిదిగా వుంటుందని, ప్రజల బాగోగులు పట్టించుకోక మభ్య పెట్టే నాయకులు
సన్యసించ వల్సిందేనని తెలియజేస్తుందని అనుకుంట.

Wednesday, February 12, 2014

Sammakka Saralamma


అడవి బిడ్డవు నీవు సమ్మక్క
అడవిలో పుడ్తివి సమ్మక్క
అడవిలో పుడ్తివి సమ్మక్క
అడవిలో నిలిస్తివి సమ్మక్క
ప్రజలంత నీవాళ్లె సమ్మక్క
ప్రజలంతా నీవాళ్లె సమ్మక్క
ప్రజలకోసం నీవు సమ్మక్క
ప్రభువులతోనే పోరాడావు సమ్మక్క
ముక్తికోసం సమ్మక్క 
విముక్తికోసం సమ్మక్క
భుక్తికోసం సమ్మక్క 
భూమికోసం సమ్మక్క
ప్రభువులతో నీవు సమ్మక్క
సమరము చేస్తివి సమ్మక్క
మా భూమి మాదేనని సమ్మక్క
నీవు రణమే చేస్తివి సమ్మక్క
ప్రజల కోసం సమ్మక్క 
ప్రాణాలే ఇస్తివి సమ్మక్క
అడవిలో శక్తివి సమ్మక్క
ఆదిపరాశక్తివె సమ్మక్క
అడవి బిడ్దవు నీవు సమ్మక్క
ఆరాధ్య దైవానివి సమ్మక్క

**********************

అమ్మలకు మొక్కరా, తమ్ముడా!
అడవి తల్లులకు, మొక్కరా!
తల్లిబిడ్డలు అడవిబిడ్డలు
పోరుగడ్డపై ఓరుగల్లు రాజుతో
పోరాడినారు తమ్ముడా,
ప్రజల గుండెల్లో దేవతలై 
వెలసినారు తెలుసుకోరా.

రాచరికాలు పోయినా
రాజకీయాలున్నాయిరా
బక్కోడికి బుక్కెడు బిచ్చమేసి
కోట్లు దోచుకుంటున్నారురా
ప్రాజెక్టులంటు ప్రజలనే
ముంచేస్తున్నారురా
ప్రగతి అంటు ఊళ్లనే
బొందలు చేస్తున్నారురా
చెట్టు చేలని తుడిచి పెట్టి
విషవలయాలనే సృష్టిస్తున్నారురా
బడుగు జీవుల భవితనే
బజారుపాలు చేస్తున్నారు, తెలుసుకోరా.

ఆత్మగౌరవంతో బతకాలంటె తమ్ముడా,
పోరుచేయక తప్పదురా
అమ్మలనే మొక్కరా, తమ్ముడా
వారి శౌర్యాని తల్చుకొని
వారసత్వాన్ని అందుకొని
అడుగు ముందుకెయ్యరా తమ్ముడా
జయము నీ సొంతమే తెలుసుకోరా.

Thursday, February 6, 2014

News - Views

నల్లారి నాటకాలు
సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆం.ప్ర
అసెంబ్లీలో 'T' బిల్ల్లుకు వ్యతిరేకంగ గొంతు చించుకొని గొంతు
నొప్పి తెచ్చుకున్నాడేమో, అందుకు ఢిల్లీలో ఇక అరిచే ఓపిక లేక
మౌనదీక్ష చేప్పట్టిండనుకున్నా.  కాని దీక్షలో కూర్చున్న నల్లారి
వారు హుషారుగ అందరితో చిరునవ్వు చిందిస్తు ముచ్చటించారు.
అది మౌనదీక్షనా, ముచ్చట్ల దీక్షనా అని అందరికి డౌటు.  అయినా
ఎదురుగ కనబడెది నిజం, మళ్లి డౌటు పడాల్సిన అవసరమేముంది?
సీమాంధ్రులు నిరవధిక నిరాహారదీక్ష అంటె, ఇంటి ముందు టెంట్
వేసుకొని దినమంతా కూచోని రాత్రి, వో రెండు గంటలు చీకట్లో, ఇంట్లో
పనులు చక్కదిద్దుకోవటం.  మౌనదీక్ష అంటె తోటి మంత్రులను, అందు
లోను మహిళా మంత్రులపై దాడి చేయించి, పిడికిలెత్తి బెదిరించి, వెక్కిరింతగ
నవ్వుకుంటు వేదికకు వెళ్ళటము అక్క్డడ హుషారుగా అందరితో ముచ్చట
పెట్టటం.  ఆంధ్రోల్ల మాటలకు అర్థాలే వేరులే.
నల్లారి నల్లికుట్లోడె కాదు, నికృష్టుడు.  కిరణ్ రెడ్డి కిరికిరి రెడ్డె కాదు, కిరాతక
రౌడి.
రాష్ట్రములో 80% మంది సమైక్యాన్ని కోరుకుంటున్నారట!  సమైక్యము పేరుతో
రాజ్యసభ ఎన్నికల్లో నిలబడ్డ ఇద్దరు కాస్తా వెనుకాముందు పోటి నుండి
విరమించుకున్నారు, గెలవలేమని భయంతోనెనని వాళ్ళె ఒప్పుకున్నారు.
మరి సమైక్యం ఎక్కడుంది?  సమైక్యము గెలవలేదంటె, ఓడిపోయిందని వాళ్ళే
బట్టబయలు చేసుకున్నరు.  ఈ నాటకాలు ఇంకా ఎన్ని రోజులు చూడాలో?
ఈ దౌర్జన్యానికి ముగింపు ఎప్పుడు?

Thursday, January 30, 2014

News - Views

ముగిసిన రభస
"హమ్మయ్య ఒక ఘట్టం ముగుసింది."
"అవునవును.  దీనితో అందరి గుణాలు బైటపడ్డయ్."
"ఇంతకు రూల్ 77 అని తీర్మానము బెట్టి కిరణ్ ఏం
సాధించిండంటవ్? దానికి చంద్రబాబు కూడ సపోర్ట్.  జేపీ
వత్తాసు.  దీనివల్ల ఎవరికేం లాభమైంది?"
"ఎవ్వరికి లాభం లేదు.  మళ్ళి మాట్లాడితె వాళ్ళ తెలివి
తక్కువతనము, టక్కరితనం బైటపడ్డది."
"ఆ తీర్మానము పెట్టి తెలంగాణ వాళ్ళు సభకు అడ్డుపడెటట్టు
చేసింన్రు.  వాళ్ళు అడ్డుపడకుండా వుంటె ఇంక కొంతమంది
సభ్యులు మాట్లాడేవాళ్లు కదా.  "సోమవారము వరకు ఆగండి.
నేను బ్రహ్మాండంగా మాట్లాడుతను.  చాలా బాగ మాట్లాడతను",
అని చంద్రబాబు గొప్పగా సభలో అన్నడు. ఇప్పటి వరకు రెండు కళ్ళు,
ఇద్దరు కొడుకులు, కొబ్బరి చిప్పలు, ఆపరేషను కోతలు అన్న చంద్రబాబు
మళ్ళేం కొత్త థీయరి ముందు పడ్తడో వినాలని నాకేంతో వుండే."
"అసలు చంద్రబాబును మాట్లాడకుండా చేయలనేమో ఈ నాటకము."
"ఏమో.  కిరణ్ కుమారైతె డైలీ సీరియల్‍లాగ మూడు రోజులు మాట్లా
డిండు.  తరువాత వేరె వాళ్లకు అవకాశ మివ్వాల్సింది కదా.  చంద్ర
బాబు మాట్లాడె అవకాశము కోల్పోవటం ప్లాన్ ప్రకారమైనా, అనుకో
కుండా అయినా అది ఆయన దురదృష్టము."
"ఆయన దురదృష్టమో, అదృష్టమో!  రాష్ట్ర విభజన అడ్డుకొని 1200
మందికి చావుకు కారణమైనోడికి రోగము కుదిరిందనుకుంట."
"కాని చంద్రబాబు రేపటి రోజు "ఈ కేంద్రము ఏ హక్కుతో రాష్ట్రాన్ని
విడదీసింది.  ప్రతిపక్షనాయకుడినైన నా అభిప్రాయాన్ని తెలిపే
అవకాశమీయలేదు.  ఏక పక్షంగా రాష్ట్రాన్ని విభజించింది. తెలుగు
జాతిని చీల్చింది", అంటు సీమాంధ్రలో ప్రచారము చేస్తడు కదా!"
"కాని ప్ర్జజలు తెలివితక్కువోళ్లేం కాదు.  ఈ రాష్ట్రము విడిపోక తప్ప
దన్నప్పుడు మనకు కావల్సిన వాటి గురించి అడగాలని అనుకున్నరు.
ఒక్కరంటె ఒక్కరు ఆ మాటే అడగలేదు.  ఎంతసేపు ఈ విభజన అడ్డు
కుంటమని పేలటమే.  ఇప్పుడున్న ఈ నాయకులు మళ్ళి ఎలక్షన్లో
ఎంత మంది గెలుస్తరో చూడాలే."
"ఈ కిరణ్ కుమార్‍ రెడ్ది చేసిందంతా సొంత తెలివేనంటవా?"
"రేపటి రోజు అతను కొత్త పార్టీ పెట్టుకుంటడో, లేకపోతే కాంగ్రెసు అతనికే
నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందో చూస్తె తెలిసి పోతుంది."
"ఎవరు చేసిండ్రో, చేయించిన్రోగని వీళ్లు తెలంగాణ ప్రజలను పెట్టుకున్న
గోస అంతింత కాదు.  ఆ దేవుడె వాళ్లకు శిక్షవేయాలి."  

Saturday, January 25, 2014

News - Views

చెండాట
"ఈ కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళెమో కిరికిరి పెడుతుండు, ఏందిది?"
"ఏం కిరికిరి పెట్టినా తెలంగాణ వచ్చుడు ఖాయమంటున్నగద."
"బిల్లు వెనిక్కి పంపిస్తరట.  చంద్రబాబే ఐడియా ఇచ్చిండంట!"
"చంద్రబాబు కిరణ్ణు ఫూల్ చేద్దామని చూస్తుండు.  లేకపోతె
వారం కిందనే గడువడిగే బదులు బిల్లు వెనిక్కి పంపమని 
చెప్పాల్సిండె.  కిరణ్ తెలివితక్కువోడని ఆంధ్రలో తన పవరు
పెంచుకుంటుండు."  
"ఆయన పవరు పెంచుకునుడేందోగని తెలంగాణ ప్రజలను మాత్రం
పరేషాన్ చేస్తుండ్రు.  ఈ రూల్ 77 రాష్ట్రపతి ఆర్టికల్ 3 కింద పంపిన
తెలంగాణ్ బిల్లుకు వర్తిస్తుందంటావా?"
"బిల్లు చర్చింకుంట, ఇంకా సమయము కావలని ఒకటికి రెండుసార్లు
అడుగుతున్నరు.  అట్లాంటప్పుడు వెనిక్కి ఎట్ల పంపుతరు?  అల్రడి 
అందరు రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయలను స్పీకర్‍కు ఇచ్చిండ్రు  
కూడ. సీమాంధ్రలో ఓట్లకోసం ఆడె నాటకమంతా."  
"ఆ మహానుభావుడు, దార్శనీకుడైనా బాబా సాహేబ్ అంబెద్కరను
మొక్కాలి.  మంద బలముతో ఈ ఆంధ్రోల్లు ఎప్ఫటికైనా తెలంగాణ
రానిచ్చె వాళ్లా? వీళ్ళ బాధ మనం ఇంకెన్ని రోజులు భరించాలో?"
"ఒక్క నెల.  అంతకంటె ఎక్కువ కాదులే."  
"ఏమో?  రోజులు లెక్కబెడుతున్న.  వీళ్ల దిగజారుడు మాటలు, దిగ
జారుడు రాజకీయాలు చూస్తె అసలు 'where we are going'
అర్థం కావట్లేదు.  కేంద్రము బిల్లు పెట్టి, అందరి అభిప్రాయాలు పంపమంటే
అన్ని ప్రాంతాల వాళ్ళని కూచోబెట్టి మాట్లాడలేదంటరు.  విభజన తప్పదు,
మీ అవసరాలు చెప్పండనె కదా అసెంబ్లిలో బిల్లు గురించి చర్చించి చెప్పమన్నది.
అవసరాలు చెప్పకుండ కేంద్రాన్ని, రాష్ట్రపతిని తిడుతున్నరు.  ఇంక వేరె 
కూచోబెట్టి అడిగేదేంది?"  
"వాళ్ళకు తెలుసు విభజన తప్పదని.  అయినా డ్రామాలాడుతున్నరు.  ప్రజలు
తెలివి తక్కువ వాళ్లనుకుంటున్నరు.  కాని ఎలక్షన్లప్పుడు ఈ నాటకాల రాయుల్ల
సంగతి చూసుకుంటరు."
"అవును.  సామన్యుడు రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఉన్న ఏకైక ఆయుధం
ఓటు.  ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు దాన్ని తప్పకుండ సద్వినియోగం చేసుకోవాలె."  

Tuesday, January 14, 2014

Sankranti

పతంగుల పండుగ 

నా చిన్నప్పుడు సంక్రాంతి పండగంటె పతంగుల పండగె.  దీపావళి
అయిపోయినంక కొద్ది రోజులనుండె పతంగులు ఎగురేసుడు మొదలు
పెట్టేవాళ్ళు.  అది క్రిస్మస్ సెలవుల నుండి కొద్దికొద్దిగా ఎక్కువై సంక్రాంతి
నాటికి జోరెక్కువైయ్యెది.  సంక్రాంతి తరువాత స్కూల్లు తెరిచినంక ఆగి
పోయేది.  అదే సమయంలో ఆడపిల్లలు ఇంటి ముందు రకరకాల కొత్త
ముగ్గులు నేర్చుకొని వెయ్యటము, కనుము రోజు రథము ముగ్గుతో ఈ
ముగ్గుల పోటి ఆగిపోయేది.  రథము ముగ్గుల గురించి పత్రికల్లో ఎన్ని
జోకులో!  
సంక్రాంతి నాడు ఆవుపేడ పట్టుకొచ్చి గొబ్బెమ్మ్ల చేయటము
అందులో పెట్టడానికి వెతికి వెతికి గర్బపోసలు పట్టుకొచ్చి గుచ్చిపెట్టడము
పిల్లల పని.  గొబ్బెమ్మకు బొట్లు పెట్టి, కడపకు రెండు చివర్ల పెట్టటము,
వాకిట్లో పెట్టడము, వాటి పక్కన నవధాన్యాలు పోసి, రేగుపళ్ళు, చెరుకు
ముక్కలు పెట్టటము ఓ చక్కటి ఙ్ఞాపకం.  అందుకోసం తెచ్చిన రేగుపళ్లు 
అమ్మచూడకుండ గుట్టుకు మనటము, చెరుకు ముక్కలు చప్పరించటము
చిన్న అల్లరి పని.  నవధాన్యాలను కోడి పిల్లలు, పిట్టలు తింటుంటె చూడటము
సరదాగా వుండేది.  ఆ నాటి హైద్రాబాదు - సికింద్రాబాదులొ మామూలు మధ్య
తరగతి బస్తీలో ఇది చాలా సాధారణము.
పండగ నాడు ఇంట్లో పెద్దవాళ్ళు స్పెషల్ వంటల ప్రిపరేషన్లొ వుంటె పిల్లలు, 
ముఖ్యంగా మగపిల్లలు, పతంగులు ఎగరేయటములో, 'కాట్' అయి కింద
పడుతున్న పతంగులు పట్టుకోవడంలో బిజిగా వుంటరు.  చిన్న చెల్లెల్లు
తమ్ముళ్ళకు చక్రి పట్టుకునే పని వుండెది.  రకరకాల పతంగులు, రకరకాల
పేర్లు - నామందార్, డొప్పన్, గిల్లార్, లంగోట్, గుడ్డిదార్, గుడ్డిలంగోట్, నామ
డొప్ప, బాచ్‍కోర్ మొ.  ఆ పతంగులకు కన్నాలు కట్టడము ఓ పెద్ద టెక్నికల్
పని.  ఆ కన్నాల సరిగ్గ కడితేనె పతంగి మంచిగ ఎగురుతుందని నమ్మకము.
గాల్లో గిర్కిలు కొడ్తుంది తప్ప ఏ మాత్రము పైకి ఎగురదని భయము.
పిల్లలు చాలసార్లు పెద్దవాళ్లతో, అనుభవమున్నవాళ్లతో పతంగి 'కన్నాలు' 
కట్టించుకుంటారు.  తరువాత దానికిమాంజ కట్టాలె.  మాంజాల్లో కూడ రకాలు, 
రంగులు.  ఈ మాంజలు పండగకు నెలరోజుల ముందునుండె తయారు చేసి పెట్టుకుంటరు. 
 సీసముక్కలు చాలా మెత్తటిపొడి చేసి, మెత్తగ ఉడికిన అన్నము, కావలసిన రంగు కలిపి, 
దాన్ని పిడికిట్లో పట్టుకొని, గోడకు కొట్టిన రెండు మొలల మధ్య కట్టిన దారం వరసలకు
రుద్దుతారు.  ఈ మాంజదారం తట్టుకొని, చుట్టుకొని పక్షులకి, మనుషులకు
కోసుకపోవటము, కొన్ని సార్లు ప్రాణాలు పోవడము జరిగేది! అట్లా వార్తలు 
వచ్చేవి.  
పతంగికి ముందు కొంత మాంజదారం, దాని తరువాత సాదా ట్వైన్ దారముండేది.
మగపిల్లలు, దోస్తులతోనో, బంధువులతోనో గుంపులు, గుంపులుగా ఇండ్లముందు, 
లేదా మిద్దె మీద, లేదా దగ్గరలో వున్న మైదానములో కాని పతంగులు ఎగురేసేది.
అందులొ కొందరు డోలు కూడ దగ్గ్రర పెట్టుకునేటోళ్ళు.  పతంగులు ఎగిరేసేటప్పుడు
పక్కన ఎగురుతున్న పతంగితో 'పేంచ్' ఎయ్యటము, లేదా పేంచ్లో చిక్కుకోవటము 
తప్పదు. 'పెంచ్' పడటమంటె పతంగుల యుద్ధమన్నట్టే.  పక్కవాడి వదులుతున్నడా,
లాగుతున్నాడా అన్నదాన్ని బట్టి ఇవతలి వాడి రెస్పాన్స్ వుండేది.  అప్పుడు చక్రి
పట్టుకోవడము, దాని దారము వదలటము ఓ పెద్ద ఇష్యు.  దారం గుంజుతుంటే, 
దస్తికొట్టాలా మెల్లగ చుట్టాలా ఓ ఆర్డర్.  పేంచ్ అవతలి వాడు మాంజతో మాములు 
ట్వైన్తొ పెంచ్ పెడ్తె అది ఎవరిదొ తెలిస్తె వాడిమీద అరవడమే.  మాంజ, మాంజలో
వున్న పతంగిలే పేంచ్ వేయాలి.  అది 'కీంచ్ కాట్' కావచ్చు, 'డీల్' కావచ్చు.
పతంగి కాట్ చేయ్యగానే చేసినోడి గ్రూప్ పెద్దగా 'అఫా' అని అర్సుడు, డోలు ఉన్నోడు
అది 'ఢం ఢం' అని బజాయించుడు.  పతంగి కాట్ అయినోడు గబగబా దారం 
చక్రికి చుట్టేసికుంటడు.  లేకపోతే అది కిందికి అందితె దారిలో ఎవడన్నా మంచి
మాంజ అయితె కొట్టేస్క పోతడని భయం.  కొంత మంది బీద పిల్లలు, వాళ్ల 
పతంగులన్ని అయిపోగొట్టుకున్నోళ్లు ఓ కట్టెకు పై చివరకు ఓ కంప కట్టినది 
పట్టుకొని మెడలన్ని నొప్పి పుట్టేవరకు ఆకాశకెల్లె చూసుకుంట నిలబడ్తరు.  
ఎక్కడైన పతంగి కాట్ కాంగనే అది ఎటు పడ్తుందనుకుంటె ఆ దిక్కు చూసుకుంట
ఉరుకుడె, ఆ పతంగిని ఆ కట్టేతో పట్టుకుందామని.  ఆ ఉరుకుట్ల  పిల్లలకు దెబ్బలు 
తగలటమే కాదు, మోర్లనో, మోటరు కిందనో పడటము,  అట్లాగే మిద్దలమీద 
ఎగిరేసోటోళ్ళు ఎగురేసుకుంటనో, కింద పడబోయెదాన్ని పట్టుకోబోయి జారి 
పడటము అప్పుడప్పు జరిగేవి.  అందుకని పెద్దవాళ్ళు ఆప్పుడప్పుడు 
వచ్చి జాగ్రత్తలు చెప్పడము జరిగేది.  అట్ల్లాగె వచ్చి తినిపొమ్మని చెప్పటము 
జరిగేది.  బాగా ఆకలేస్తె గాని తిండికి పోవుడు కష్టమే.  లేదా కొన్న 
పతంగులన్ని అఫా అన్న కావాలె.  
సంక్రాంతి నాడు సాయంత్రము ఒకరో, ఇద్దరో దీపం పతంగు లెగిరేసెటోల్లు.  
అవి ఆకాశంలో చుక్కల్ల కాసెపు అటు, ఇటు కదిలేవి.  తర్వాత దించేటోళ్ళు.  
వాటికి పేంచ్‍లు వుండవు. ఎక్కడో ఎవరో ఒకరు మూడునాల్గు పతంగులను 
కలిపి సీర్యలు పతంగులు ఎగిరేస్తు అట్ల కాసేపు ఆశ్చర్యంగ చూట్టమే.
చిన్నపిల్లలు, ఆడ పిల్లలకు పతంగి బాగా పైకి ఎగిరినంక వాళ్ళ అన్నదమ్ములు
కాసేపు దారం పట్టుకునే అవకాశమిచ్చేటోళ్ళు.  మొత్తానికి సంక్రాంతి పండుగ
మగపిల్లల పండగనిపించేది.
సికింద్రాబాదు, హైద్రాబాదులో జరిగినంత బాగా పతంగుల పండుగ తెలంగాణలో 
వేరే ఎక్కడైనా జరుగుతుందా?  ఆంద్రాలో అయితె అసలే జరగదు.  వరంగల్లులో 
అయితె సంక్రాంతి అంటె సకినాలు, అరిసెలు, ఇంక కొన్ని పిండి వంటలే.  
పతంగులు ఎగిరేసుడు తక్కువే.
ఏది ఏమైనా సంక్రాంతి పండగ రాష్ట్రములో వాళ్ల వాళ్ల ఆచారలను బట్టి అందరు 
గొప్పగానే జరుపుకుంటరు.  

Saturday, January 11, 2014

News - Views

ఎవడు? ఎక్కడివాడు? 
"కిరణ్ కుమార్ రెడ్డికో అనుమానం వచ్చింది."
"దాన్ని హరీశ్ రావ్ తీర్చెసిండు కదా."
"అవుననుకో.  అసలు కిరణ్‍కు తాను హైద్రాబాది అనె ఫీలంగ్
బలంగా వున్నట్టుంది, కాని తెలంగాణ వాడని మాత్రమనుకోడు.
అలా అనుకునేవాడైతె ఆనాడు అసెంబ్లిలో "రాసి పెట్టుకో! తెలంగాణకు
ఒక్క రూపాయివ్వను" అనేవాడా?"
"హైద్రాబాది ఫిలింగ్ కూడ ఏముందో నాకు డౌటే.  ఆ ఫీలింగే వుంటే తను
చదువుకున్న కాలేజిల్లో పిల్లల మీద పోలీసుల జులుం ఎట్ల చేయిస్తడు.
ఆంధ్రాలో సమ్మె నడిపించిండు.  ఒక్కనాడైనా ఒక్కడిని కొట్టిన్రా? అరెస్టు
చేసిండ్రా?  అక్కడ స్టూడెంట్ల పట్ల దౌర్జన్యం చేయాలని కాదు.  కాని మన
తెలంగాణ స్టూడెంట్లను ఎన్ని విధాల హింసించిన్రు!"
"ఆయనకు తెలంగాణలో సీటోస్తది, ఓట్లు కూడ పడ్తయని అంటున్నడు."
"ఓట్ల్లు కాదు, సొట్లు పడ్తయి.  ఈ ఆంధ్ర లింకున్నోల్లంతా అంతే.  ఇక్కడ
పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ అన్ని హక్కుల్లు అనుభవించుకుంట అక్కడి
పాట పాడ్తరు."
"వాళ్లకు చాలానే జాతి అహంకారము.  తెలంగాణ వాళ్లంటె చిన్న చూపు.
పైగా తెలుగు మాట్లాడుతున్నాము కాబట్టి ఒకే జాతని పైకి చెప్పుడు.
విడదీయడం దారుణమంటు గగ్గోలు!  వాళ్ల అహంకారానికి మన అత్మ
గౌరవానికి జరిగిన పొరాటం ఈ తెలంగాణ ఉద్యమము.  అర్వై ఏండ్ల ఈ
పోరాటం ఎప్పుడెప్పుడు ఓడుస్తుందాని ఎదురుచూసిడైతుంది."
"ఇంకో నెలరోజులకంటె ఎక్కువ పట్టదనుకుంట."
"ఏమో?  నాలుగేండ్లబట్టి ప్రతి పండగప్పుడు మళ్ళిసారి దీన్ని మన
తెలంగాణలో జరుపుకుంటమని అనుకుంటు ఆశపెట్టుకుంటున్నము.  ఈ
ఏడన్న అన్ని పండగలు తెలంగాణలో అనుకుందామంటె ఇప్పుడు సంక్రాంతి
పండుగ అయిపోతనేవున్నది.  సమ్మక్క జాతరవరకన్న బిల్లు పార్లమెంటులో
చర్చకు రావలని కోరుకుంటున్న."
"ఆ విప్లవ వనదేవతల అనుగ్రహముతో ఆసరికి బిల్లె పాసౌతుంది, చూస్తుండు."
"ఆ అమ్మల అనుగ్రహముండాలని మొక్కుతా."