Friday, August 30, 2013

News - Views

ప్రజాస్వామ్యం
"ఇది విన్నవా?"
"ఏంటిది?"
"కిరణ్‍కుమార్ రెడ్డి నిన్న ఓ మీటింగలో అధిష్టానానికే వార్నింగ్
ఇస్తున్నట్టు మాట్లాడిండు."
"ప్రజాస్వామ్యములో ప్రజలే నిర్ణయిస్తరు, పార్టీలు కాదన్నడు."
"అంతేనా.  లేకపోతె ప్రజలు ప్రభుత్వానికి సెలవిస్తరన్నడు."
"అవును మరి.  కరక్టె కదా.  తెలంగాన రాష్ట్రము కోసము
60 ఏండ్ల బట్టి ఇక్కడి ప్రజలు పోరాడవట్టిరి.  ప్రజల కనుకూలమైన
నిర్ణయము తీసుకోక పోతె గెలువలేమనే కదా ఆ నాడు రాజశెఖర్
రెడ్డి తెలంగాన ఎమ్మెల్యేలతో సంతకము పెట్టిచ్చి విన్నపాన్ని సోనియా
గాంధికిచ్చిండు.  తెలంగాన అన్నడనేకదా అప్పుడు కాంగ్రేసు గెలిచింది.
ఆ తర్వాత తెలుగు దేశం కూడ తెలంగాన ఎత్తుకున్నందుకు ఆ పార్టికి
 సీట్లెక్కువ రాలేదా?  ప్రజారాజ్యం బెట్టి చిరంజీవి సామాజిక తెలంగాన అని
సీట్లు కొట్టలేదు.  అసలు పిఆర్పి లేకుంటే టిడీపేనె గెలిచేదనుకుంటా .
బిజేపి కూడ ఇప్పుడు తెలంగానకు సరెనంటుంది.  అసలు
వాళ్ళ హయాంలో ఇవ్వలేక పోయినందుకు అడ్వాని  బాధపడుతు అనలేదా-
చంద్రబాబు వల్లె మేము తెలంగాన ఇవ్వలేదు.  ఇప్పుడు అనవసరంగా
కాంగ్రేసు ఆ క్రెడిట్ కొడుతుందని బిజేపోల్ల బాధ కూడ వుంది."
"అట్లంటే, జగన్‍కు సపోర్ట్ గా ఆంధ్రాలో ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మళ్లి
ఎలక్షన్లో నిలుచున్నప్పుడు టిజి వెంకటేషు ఒక్కటె మొత్తుకోలేదా,
జగనుకు ఓటెస్తె రాష్ట్రము విడిపోతదని, సమైక్యంగ వుండాలంటే
కాంగ్రేసుకే ఓటెయ్యాలని.  అయినా కట్టగట్టుకొని అక్కడోళ్లు
జగన్నే గెలిపియ్యలేదా?  అంటె రాష్ట్రము విడిపోయినా వాళ్లకేమి
బాధ లేదన్నట్ట్టేగద.  అక్కడ ‘జై ఆంధ్రా’ అనేటోల్లు వున్నరు,
‘జై రాయలసీమ’నేటోల్లున్నరు, మన దగ్గర అంత ఒకటె మాట”
‘జై తెలంగాన, జై జై తెలంగాన.’"
"అవును.  మనోళ్ళందరికీ,  అక్కడ సామాన్య ప్రజలందరికి రాష్ట్రము వేరు
పడాలనేవుంది.  ‘థూ, థూ’ అన్నా ఎన్ని రోజులు పడుకుంట వుండాలని
అక్కడ మామూలోళ్ళు అనుకుంటుండ్రు.  వాళ్లకు రాజధాని వస్తె వాళ్లకు
కూడ మంచి అవకాశాలు వస్తయని.  అక్కడ, ఇక్కడ కూడ వేరు పడితె
బడుగులకు రాజ్యాధికారము వచ్చే అవకాశముందని.  ఈ బలిసినోళ్లు
చెయ్యబటికే ఈ గొడవంతా."
"ఎట్లైనా ఆంద్రాలో తెలంగాన ఇచ్చినా ఇయ్యకున్న జగని పార్టీ, తెలుగుదెశం
వస్తది.  చంద్రబాబు తెలంగానకు ఓకే అన్నా మొన్న పంచాయితి ఎలక్షన్లో
బాగానే గెలిచిండు.  అక్కడ చంద్రబాబు జెండా ఎగిరేశినా ఆశ్చర్యం లేదు.
తెలంగానలో మాత్రం తెలంగాన ఇస్తె ప్రజలు కాంగ్రేసును తప్పకుండా గెలిపిస్తరు.
లేకపోతె గుండు సున్ననే పెడ్తరు. టిఆరెస్‍నె గెలిపిస్తరు.  ఇది ప్రజాస్వామ్యము కదా.
ప్రజలే నిర్ణయిస్తరు.కిరణ్ కుమార్ రెడ్డి సొంతూల్లో కూడ గెలుస్తడో లేక ప్రజలు
సెలువిస్తరో చూడాలె."

Thursday, August 29, 2013

News - Views

వికారాంధ్ర సభ
విశాలాంధ్ర మహాసభ వాళ్ళు హైదరాబాదులో ప్రెస్ మీటింగ్ పెడితె
అది కాస్తా రసాభాసగా ముగిసిందట.  వాళ్ళేమో లెక్చర్లు ఇస్తారట.
విలేఖరులు నోర్మూసుకొని చెప్పిందంతా రాసుకొని ప్రసారము/ప్రచారము
చేయలట.  ప్రశ్నలు అడిగితే మర్యాద వుండదట.  మీడయావాళ్ళను
నోర్మూసుకోమంటే వురుకుంటారా?  ఇల్లెక్కి  మరీ కూస్తరు.  దాంతో
పోలీసుల రక్షణ వలయంలో ఆ పెద్ద మనుషులు బైట పడ్డారు.  విశాలాంధ్ర
సభ కాస్త వికారంధ్ర సభగా మిగిలింది.
విశాలాంధ్ర సభ పెద్దమనుషులు కనబడితె నాక్కూడ కొన్ని ప్రశ్నలు అడగాలని
వుంది.
- విశాలాంధ్రా అంటె ఏమిటి? అది ఎవరి గురించి పనిచేస్తుంది?
-అది తెలుగు వారికోసమైతె, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు తెలంగాణలో
తెలుగు మాట్లాడె ప్రాంతాలను కొన్నిటిని కర్ణాటకా, తమిళనాడు, మహా
రాష్ట్రా, ఒరిస్సలో కలిపినప్పుడు ఎందుకు ఊరుకున్నరు?  ఆ కలిపేసిన
జిల్లాల్లన్ని కూడా తెలంగాణలో వుంటే తెలంగాణ సీమాంధ్ర కన్నా పెద్ద
ప్రాంతము అయ్యెది కాదా?  అప్పుడు ఆంధ్ర, తెలంగాణ సమంగా వుండేవి
కదా.  అట్లావుంటే మీ అధిపత్యము చెల్లదని, తెలంగాణను చిన్న రాష్ట్రము/
ప్రాంతము చేసి ఉపాయముతో ఆధిపత్యపు దురాలోచనతో కలసినది నిజము
కాదా?
-రజాకర్లతో విసిగి, ఇండియన్ యూనియన్లో కలిసిన తెలంగాణ ప్రజలు ఇష్టము
లేకున్నా, ఆంధ్రోళ్ళు ఇచ్చిన హామీలే కాక కొన్నాళ్ళు కలిసివున్నా కష్టమనిపిస్తె
విడిపోవచ్చని కేంద్రము అన్నది నిజము కాదా?
-ఆంధ్రోల్లు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఆరక్షణలు అన్ని అటకేక్కించుడో, చెత్తబుట్టలో
వేసి తెలంగాణ ప్రజలను అన్యాయము చేసినప్పుడు విశాలాంధ్ర పెద్దమనుషులు
ఏమి చేసిండ్రు?
-తెలంగాణ ఉద్యమములో మొదటిసారి 400 మంది తుపాకి గుళ్ళకు బలి అయినప్పుడు,
వారి చదువులు దెబ్బతిని, కేసులువలన ఉద్యోగావకాశాలు కోల్పోయి నక్స్లలైట్లుగా మారి
తల్లిదండ్రులకు, కుటుంబానికి, సమాజానికి దూరమైనప్పుడు వీరంతా ఎక్కడున్నరు,
ఏంజేసిండ్రు?
-తెలుగుజాతి ఒకటిగా వుండాలని ఇప్పుడు గొంతు చించుకునేవాళ్ళు,
జై ఆంధ్ర ఉద్యమము చేసి, ముల్కిరూల్స్ తెలంగాణలో
లేకుండా రాజ్యాంగ సవరణ పట్టుకొచ్చి యదేఛ్చగ తెలంగాణ వారి ఉద్యోగాలన్నీ
శాశ్వత ప్రాతిపదికన కొల్లగొట్టడము మొదలైనప్పుడు తెలుగువారి పట్ల వుండాల్సిన
అభిమానము గౌరవము యాడికి పొయింది?  తెలుగుజాతి ఒక్కటి వుండాలనుకునే
వాళ్ళు అప్పుడు జై ఆంధ్రా ఉద్యమము ఎట్ల చేసిండ్రు?
-తెలంగాణ మలిదశ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు, ఎంతో మంది యువకులు
యువతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఒక్కసారైన ఒక్క ఓదార్పుమాట మాట్లాడిండ్రా?
తెలంగాణలో తెలుగు యువత నిరాశ నిస్పృహలకు పోయి అత్మహత్య చేసుకోకుండ
ఏ కార్యక్రమము చేసిండ్రు?
-ఉస్మానియాలో యుద్ధవాతవరణము సృష్టించి, విద్యార్థులను కొట్టి కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి
చంపినప్పుడు, హాస్టల్ రూముల్లో వున్న విద్యార్థినలను చీకట్లో బైటకులాగి అసభ్యంగా, అమానుషంగా
ప్రవర్తించినప్పుడు ఆ తెలుగు జాతి పిల్లల గురించి ఏ మాత్రము స్పందించకుండా విశాలంధ్ర పెద్దలు ఏ
కలుగులో దాక్కున్నరు?
-ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్త్రమైనా రాజ్యాంగము ప్రకారము భారత పౌరలకు వుండె హక్కులన్ని
హైదరాబాదులో వుంటాయన్నా ఉద్యమము చేసేది కేవలము మీరు ఇన్నాళ్ళు చేస్తున్న దోపిడి ఇక
ముందు సాధ్యము కాదన్న దుగ్ధతోనే కాదా?
-ఇప్పుడు మీరు చేసేది సమైక్యాంధ్ర ఉద్యమమా లేక సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమమా? సమైక్యాంధ్ర
ప్రదేశ్ ఉద్యమములో తెలంగాణ వారు లేకుండా అది ఆంధ్ర ఉద్యమమేకాని సమైక్యాంధ్రప్రదేశ్
ఉద్యమమెట్లైతది?  ఒకవేళ సమైక్యాంధ్ర ఉద్యమమంటె, మీ ఆంధ్రోళ్ళంతా ఒక్కటి, ఇక ముందు
తెలంగాణ వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టే కుట్రవున్న మాట నిజము కాదా?

Wednesday, August 28, 2013

News - Views

కార్యదీక్ష 
మొన్న సాయంత్రము ఆహారభద్రత బిల్లు గురించి లోక్ సభలో
ఏం జరుగుతుందో చూద్దామని టివీ పెట్టాను.  పెట్టిన కాసేపటికే
శ్రీమతి సోనియా గాంధి మాట్లాడటము మొదలైంది.  అమెను లోక్
సభలో మాట్లాడుతుండగా చూడటము అదే మొదటి సారి.  హిందీలో
మొదలు పెట్టారు.  చక్కగ స్థిరంగా, గంభీరంగా మాట్లాడుతున్నారు.
కాని నాకు వింతగా అనిపించిందో విషయము.  ఆమె చేతిలో కాగితాలు
రెపరెపలాడటం.  చేతులు వణుకుతున్నాయా అనిపించింది.  ప్రపంచములో
వున్న శక్తిమంతుల జాబితాలో ఒకరు , ప్రస్తుతం ఈ దేశన్ని నడిపించేది
ఆమెనే, మాట్లాడుతుంటె కంఠంలో స్థిరత్వముంది, నిలబడటములో ఠీవి,
నిబ్బరముంది, మరి చేతుల్లో ఆ వణుకెందకు అనిపిస్తుంది? నా చూపులో
లోపమా, లేక ప్రసారములో లోపమా, లేక ఆమెకేదైనా జబ్బు వుందాని
నాకు ఒకటే డౌటు.  ఆమె మాట్లాడటము చెవుల్లో పడుతున్నా నా చూపు
లన్ని ఆమె చేతులు, చేతిలో వున్న పేపర్ల మీదే.  ఆమె ప్రసంగము పూర్తి కాక
ముందే నాకు పని వుంటే టీవి బంద్ చేసి వెళ్ళిపోయాను.
మళ్ళి రాత్రి తొమ్మిదికి టీవి పెడితె కింద స్క్రోల్ వస్తుంది.  ఆహారభద్రత
బిల్ ఓటింగ్‍కు మేడం గారు గైర్హాజరని, ఒంట్లో బాగాలేనందు వలన ఆమెను
ఆసుపత్రికి తీసుకెళ్ళ్లారని.  అప్పుడు నాకర్థమైంది, అమె చేతులో పెపర్లు
ఎందుకంత రెపరెపలాడాయో.  ఆమె పట్టుదల, ఆమె శక్తి నాకర్థమైంది.
ఆమె అనారోగ్యంగ వున్నా పార్లమెంట్‍కు వచ్చిందని, బాగా జ్వరతీవ్రత వున్న
ఒప్పిగ్గా చర్చల్లన్ని విని బిల్లు పెట్టెవరకు కూర్చుందని.  జ్వరతీవ్రత వున్న
కారణంగా నిలబడి మాట్లాడెసరికి బహుశ కళ్ళకు చీకట్లు వచ్చేసరికి తప్పని
సరై సభను విడిచి వెళ్ళవలసి వచ్చిందనుకుంటా.  గ్రేటే.  అంత అనారోగ్యంగా
వున్నా తన బాధ్యతగా బిల్లు ప్రవేశ పెట్టేకోసం గంటల కొద్ది ఒపిగ్గా కూర్చోవటం.
ఆమె అనుకుంటే సరిగ్గా సమయానికి కూడా రావచ్చు.  కాని ఒప్పిగ్గా ఇక
కూర్చోలేని స్టెజి వరకు కూర్చోవటం గొప్ప విషయమే.  మన రాజకీయ
నాయకుల్లో ఎంత మంది అట్లా వుంటారు?
ఆహారభద్రత బిల్లుకు ఇచ్చినంత ప్రాముఖ్యత మరి తెలంగాణ బిల్లుకిస్తె ఈ
తెలంగాణ ప్రజలు ఆమె తెలంగాణ ప్రదాతగ గుర్తుంచుకుంటారు.

Tuesday, August 27, 2013

News - Views

హరికృష్ణ - హరే క్రిష్ణ!
తెలంగాన ఉద్యమము పుణ్యమాని ప్రజల్లో రాజకీయ చైతన్యము,
రాజ్యాంగము గురించి ఓ పిసరంత ఙ్ఞానము పెరిగింది.  అలాగె నాక్కుడ.
హరిక్రిష్నరాజ్యసభ మెంబర్షిప్‍కు రిజైన్ చేస్తానని తండ్రి సమాధి దగ్గర ఓ
పెద్ద ఉత్తరము పెట్టి, అది మీడియాకంతా చూపెట్టి మరీ సంతకము
పెట్టాడు.  అది చూసి నేను ఇది చెల్లని కాగితములె అనుకున్నా.  ఆ
తరువాత ఆయన రిజిగ్నేషను అక్సెప్ట్ చేసిండ్రని న్యూస్ విని ఆశ్చర్యమని
పించింది.  మళ్లి స్పీకర్ ఫార్మాట్‍లో రాజీనామా ఇచ్చిండని చెప్పిండ్రు.
ఎంతో మంది కాంగ్రేసోల్లు కూడా స్పీకర్ ఫర్మాట్లో రాజీనామా ఇచ్చినా అవి
పెండింగ్‍లో పెట్టి హరిక్రిష్నది మాత్రమే అంత అర్జెంట్‍గా ఎందుకు ఆక్సేప్ట్
చేశారా అని ఆలోచించాను.  కాస్తా బుర్రకు పనిబెడితె అర్థమైపోయింది.
హరిక్రిష్నవాగ్ధాటికి స్పీకర్ కురియని బెదిరిపోయిండని నా కనిపించింది.
హరిక్రిష్నా రాజ్యసభలో మాట్లాడింది  తప్పక చూడాల్సిన ఘటన.  అమ్మో!
ఎట్ల మాట్లాడిండని!  తెలుగు జాతిగౌరవాన్ని రాజ్యసభలో తన హావభావలతో
ఎంత బాగా చూపెట్టిండని!  తెలుగులో మాట్లాడ్డం మొదలు పెట్టాడు.  "నువు
మాట్లాడెదేమిటి అది నీ సీటేనా" అని స్పీకర్ సార్ అడిగారు.
"అవును.  నాదే.  నేను తెలుగువాడిని. తెలుగులోనే మాట్లాడుతా" అని గంభీరంగా
అన్నాడు.
"మరి ముందే చెప్పాలి కద.  నాకు తెలుగు రాదు.  ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా"
"నాకు నా భాషలో మాట్లాడె హక్కులేదా" ఉరిమాడు హరిక్రిష్న.
అతని తీరుకు పక్కన కూర్చున్న తెదేపా సభ్యులు కంగారు పడి హరిక్రిష్నకు
ఏదో సర్ది చెప్పబోయిండ్రు.  ఆ పక్కన కూర్చున్న వెంకయ్య నాయుడెమో హరిక్రిష్నకే
వత్తాసుగ ఏదో అన్నడు.
అప్పుడు హరిక్రిష్న "హమ్ హిందుస్తాని, మేర భారత్ మహాన్" అంటుంటె స్పీకర్ తన
కుర్చీలో సర్దుకొని, "అయితె ఫర్వాలేదు, హిందిలో మాట్లాడ"న్నాడు.
"లేదు, లేదు నేను తెలుగులోనే మాట్లాడుతాను.  నా జాతిని...." అంటు ఓ రెండు నిమిషాలు
సీమాంధ్రకు సపోర్టగా అద్భుత హావభావ ప్రదర్శనలతో ఒకసారి అందరికి తన నటనా
చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ( రాష్ట్రము విడిపోయాక ఈ సీను ఎదైనా సీమాంధ్ర ఉద్యమ
సీనిమా తీసినప్పుడు అందులో పెడ్తె ‘వాహ్ క్యా సీన్ హై’ అని మళ్లి మళ్ళి చూస్తరు).
పాపం కురియన్ ఏం చేయలేక అయోమయం మొకమ్ పెట్టుకొని కుర్చిలో కూర్చున్నడు.
అందుకేనేమో హరిక్రిష్న స్పీకర్ ఫర్మాట్‍లో రాజీనామా ఇయ్యంగనే వెంటనే తన ఆమోద ముద్ర
వేసినట్టున్నడు.  ఇంకోసారి హరిక్రిష్న రాజ్యసభలో మాట్లాడితె ఎదురు కూర్చునే ధైర్యము
ఆయనకు లేదనుకుంటా!

Monday, August 26, 2013

News - Views

అమరణ నిరాహార దీక్ష
గాంధి పుట్టిన దేశములో సత్యాగ్రహానికి, ధర్మాగ్రహానికి అర్థాలు మారిపోతున్నాయా?
స్వార్థాగ్రహాలు, స్వలాభేక్ష దీక్షలు ఎక్కువుతున్నాయా?  నిరాహార దీక్షలు
బరువు తగ్గే ప్లాన్ లో భాగమవుతున్నాయా?  ఆమరణ దీక్షలు
రాజకీయ ప్రచార మార్గాలవుతున్నాయా?  అవుననే నాకనిపిస్తుంది.
మహాత్మాగాంధి,  ఆమరణ దీక్షతో ఎవరైనా
చెప్పుకోదగ్గ ఫలితాన్ని సాధించారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరావు
మాత్రమే.  రాజకీయ అవసరాల కోసము దీక్ష చేసినవాళ్ళను
ఎంతమందిని చూస్తున్నాము? అందులోఎంత మంది పట్టుదలగా
దీక్షకొనసాగిస్తున్నారు? దీక్ష మొదలు పెట్టిన రెండో నాటి నుండె దీక్ష
చేసెవాళ్ల ఛానల్లు గంటలు లెక్క పెడుతు ఆరోగ్యము విషమిస్తుంది,
ఎప్పుడైనా కోమాలోకు వెళ్ళొచ్చని బ్రేకింగ్ న్యూస్లు ఇస్తుంటారు.
ప్రభుత్వము కూడ ఓ రెండు రోజులు తమాషా చూసి, అరెస్ట్ చేసి
డెక్సట్రోస్, సలైన్ మొదలు పెట్టెస్తారు.  బతుకు జీవుడాని ఆ దీక్ష
చేసెవాళ్ళు "నా దీక్ష ప్రభుత్వము భగ్నం చేసింది, త్వరలోనే మరో
ఉద్యమము చేపడ్తామ"ని  చెప్పి, అందుకు శక్తి కావాలి కాబట్టి వెంటెనే ఆహారము
తీసేసుకుంటారు.  అట్లా తీసుకోని వాళ్ళకు కొన్ని తప్పని పరిస్థితిలో
ముక్కులో గొట్టమేసి దాని ద్వారా పోషకాహార మిస్తు ఏండ్లు గడెపేస్తారు -
ఇరోమ్ షర్మిలాను అరెస్ట్ చేసి వుంచినట్టు.  రాజకీయ నాయకులకు అంత
నిబద్ధత వుండటము కష్టమే.  ఒక వేళ వుంటె ఆ నాయకుడికి వున్న
అనుయాయులు చేసె రకరకాల ఆందోళనలు తగ్గించటానికి ప్రభుత్వము
తాత్కాలికంగా ఏదో ఒక హామీ ఇచ్చి గండము గట్టెకుతుంది. అలాగే కేసిఆర్
బతికి బట్ట కట్టాడు.
నాకు తెలిసినంత వరకు మన దేశ చరిత్రలో నిరాహార దీక్షలో చనిపోయిన
నాయకుడు పొట్టి శ్రీరాములే.  ఆయనను కూడ కొంత మంది స్వార్థపరులు
ఆంధ్ర రాష్ట్రము ఏర్పడ్డా, మద్రాసు కావాలనే దురుద్దేశముతో దీక్షలో కూర్చో
బెట్టారు.  అప్పట్లో బ్రిటిష్ వాళ్ళే గాంధి నిరాఆహార దీక్షలో చనిపోకుండా
జాగ్రత్త పడ్డారు.  ఆ తరువాత నెహ్రూ ప్రభుత్వము కూడా ఆ జాగ్రత్త తీసుకుంది.
మరి పొట్టి శ్రీ రాములుని ఎందుకు చనిపోనిచ్చారు?  అసలు కారణము వేరే ఏమైనా
వుందా?  ఇప్పుడు ఆంధ్రా వాళ్లు చేస్తున్న విధ్వంసము, అరాచకము చూస్తుంటె
మొదటి సారిగా నా కనుమానము వస్తుంది.  పొట్టి శ్రీరాములు అమాయకంగా
ఎవరి కుట్రలకైనా బలి అయ్యాడా?

Sunday, August 25, 2013

News - Views

ఆవు - దూడ 
"హాయ్!  ఏంటీ సర్ప్రైస్?  రా రా రా."
"ఏం లేదోయ్. ఒక రోజు సెలవు పెడితె మూడు రోజులు కల్సొస్తున్నాయని వచ్చా."
"చాలా సంతోషం.  చాల రోజులైంది కదా కల్సుకొని.
అంతా ఓ.కే నా.  ఆఫీసులో ఎట్లుంది."
"అంతా బాగె.  తెలంగాన గోడవలతో ఆఫీస్ లో పరిస్థితులంతా
మారిపోయాయి.  ఆంధ్ర తెలంగానోళ్ళు ఒకరినొకరు అనుమానంగ
చూసుకుంటున్రు.  ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్న ముందెనక
చూసుకొని మాట్లాడుతున్నరు.  తప్పనిసరైతెనె మాట్లాడుతున్నరు ."
"ఇట్ల అనుమానాలు పడుకుంట వుండె కంటె ఎవరికాళ్ళమైతె పని
ఒడుస్తది కదా."
"అమ్మో!  వాళ్లట్ల అనుకుంటలేరు."
"వాళ్లు తెచ్చిందేమన్న ఇక్కడుందా?  ఈడికొచ్చి ఇక్కడ ప్రజలను
దోచుకొని వాళ్ళు కూడబెట్టుకున్నరు గని."
"వాళ్ళేమంటున్నరో  తెలుసా?  దూడగ వున్నప్పుడొచ్చినము.  ఇప్పుడు
ఆవై పాలిస్తుంటె ఎట్ల వదిలి పోతమని అంటున్నరు."
"అవునవును.  మన దగ్గర అవుండే. దూడుండే.  మనొళ్లు చెపుతరు కదా,
తెలంగాణ - ఆంధ్ర విలీనమైనప్పుడు మన హైదరాబాదుకు చక్కటి రాజధానికి
కావల్సిన అన్ని హంగులతో పాటు 30 కోట్ల మిగులు బడ్జెట్ వుండెనట.
వాళ్ళకు రాజధానే లేదు. గుడారాలు తప్ప.  అందుకే ఉరుక్కుంట వచ్చిండ్రు.
అవు మనది.  దూడ మనది.  గడ్ది మనది.  నేల మనది.  వాళ్లు వచ్చినా రాకున్న
దూడ పెరగక మానుతదా? పాలియ్యకుంటదా?  జీతగాడు మన ఆవు పాలు మన
కియ్యకుండ తాగుతుండనే కదా ఈ లోల్లి మొదలైంది.  జీతగాడు ఎక్కడున్నా జీతం
కోసం పని జేస్తడు.  కావాలంటె బోనస్ అడుగుతడు.  కాని అంత నా సొంతమంటె
ఎట్ల కుదుర్తది?  అప్పుడు వాడిని ఎళ్ళగొట్టాల్సి వస్తుంది.   అదే ఇప్పుడైతుంది."
"గిన్నెళ్ల తర్వాత పొమ్మంటె ఎట్ల పోతమని అంటరు."
"ఎన్నేండ్లున్నా కిరాయికున్న ఇల్లు సోంతమంటె, సెంట్ మెంట్ అంటె సొంతదారు
ఊరుకుంటడా.  ఎట్ల ఖాళీ చేయించాలో అట్ల చేస్తడు.  కాస్త వెనుకా ముందు అంతె.
సర్లె.  ఇప్పటికిది పక్కన పెడ్దాం.  మీ పిల్లల విషయాలు చెప్పు......."

Saturday, August 24, 2013

News - Views

వార్తలు - విశ్లేషలు : మనుషులేనా?
"ఇవ్వాల న్యూస్ చూసినవా?"
"ఏమి న్యూస్?"
"అదే..ముంబైలో..."
"అవన్ని నీకెందుకు?"
"ఇది అన్యాయం కదా. ఘోరం కద.  అసలు ఆడవాళ్లకు
రక్షణే లేకుండ పోతుంది."
"రక్షణ ఏవరికి వుంది చెప్పు.  ప్రతి రోజు దోపిడి హత్యల
గురించి వింటలేమా"
"అవుననుకో.  నిర్భయ కేసు తర్వాత అంత గోడవైంది కదా.
ప్రపంచమంత తెలిసింది.  అందులో ఒకడు చచ్చిండు.  ఫాస్ట్
ట్రాక్ అన్నరు.  ఇంకేమైందో తెల్వదు.  దేశముల మాత్రం ఈ
రేపులు ప్రతిరోజు వింటనేవున్నము."
"రేపులు ఎప్పుడు లేవని?  రామాయణ, భారత కాలముల నుండి
నడుస్తనే వున్నయి."
"నువ్వేదో చెప్తవ్.  మరీ ఈ మధ్యే ఈ గాంగ్ రేపులు ఎక్కువైనై."
"అవును.  అమ్మాయిలు ఇదివరకులాగ లేరు కద.  తెలివితేటలు
ధైర్యము ఎక్కువైనయి.  కొట్లాడుతారు కద.  అందుకని ఒక్కరితో
కాదని ముగ్గురు నలుగురు కలిసి, కొట్టి భయపెట్టి చేస్తరు.  లేక
పోతె అది సాధ్యం కాదుకద."
"ఎదురు తిరుగుతరని అట్ల చేస్తరంటవా? అంటె ఎదురు తిరుగొద్దంటవా"
"అరే, నీకు కోపమెందుకు.  విషయం చెప్తున్నా.  ఎదురు తిరుగాలి, కొట్టాలి.
కుదిరితే దగ్గర ఎప్పటికి ఒక చాకు పెట్టుకొని చంపడానికి సిద్ధంగా వుండాలి.
తన ప్రాణం మీదికి వచ్చినప్పుడు చంపటములో తప్పులేదు."
"అంటె ఇంట్లో నుండి కాలు బైటపెడుతున్న అమ్మాయి వెంట చాకు తీసుకు
పోవాలంటవ్."
"తెలివైన అమ్మాయి సమయస్ఫూర్తి, పెప్పర్ స్ప్రేతో  కూడ ప్రమాదాన్ని
తప్పింకోవచ్చు."
"మరి చిన్నపిల్లల గురించి ఎట్లా?"
"పిల్లలకు తల్లిదండ్ర్లులె జాగ్రత్త చెప్పాలె.  కొత్తవాళ్ళ దగ్గరకు అసలె వెళ్లొద్దని
ఏమి ఇచ్చినా తీసుకోవద్దని చెప్పాలె.  తెలిసిన వాళ్లతో కూడ ఇంట్లోవాళ్ళు
లేకుండా కలిసి వెళ్ళోద్దని చెప్పాలె.  చిన్నపిల్లలను ఉత్తనె భయపెట్టొచ్చు.
పిల్లలు భయముతో ఏడవటము తప్ప ఎదురు తిరుగలేరు.  అయినా కూడ
రేపిస్టులు, పిల్లలు కాని పెద్ద్లలు కాని, వాళ్ళ నేరాన్ని బైటకు చెప్తారనుకున్నప్పుడు
చంపేస్తారు.  వాళ్ళు చెప్పరనుకున్నప్పుడో, లేదా చట్టమంటే అసలే భయము,
లేకపోతెనో, లేదా తాము చాల పెద్దవాళ్ళు కాబట్టి తమను ఏ న్యాయము,
చట్టము ఏమి చేయదని ధైర్యమున్నవాళ్లు చంపకుండా వదిలేస్తరు.
చిన్నపిల్లల్ను సామాన్యంగ ఒక్కడె రేపు చేయడముంటుంది."
"అసలు ఈ రోజుల్లో న్యాయము, చట్టము ఏమైనా పని చేస్తున్నయంటవా.
ఎమ్మెల్యేలు, ఎమ్పీలు సగానికి సగమంది గుండాలు, దొంగలు, డాన్లే వున్నారు.
వాళ్ళ మీదనే బోలేడు కేసులున్నయి.  ఇవన్ని చూస్తుంటే ఆడపిల్లలను కనక
పోవడమే మంచిదనిపిస్తుంది."
"అట్లనకు.  అప్పుడు కూడ తక్కువ మంది ఆడావాళ్ళుండటముతో అట్లా కూడ
ప్రాబ్లమ్ ఎక్కువె అవుతుంది.  కాకపోతె చిన్నప్పటి నుండి అబ్బాయిల పెంపకములో
ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.  మగవాళ్ళు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది, అనే భావము తీసెయ్యాలి
చదువుతో పాటు మానవత్వము, ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవించడము నేర్పాలె."
"అంతేనా?  లా &  ఆర్డ్రర్ స్ట్రిక్ట్ గా వుండాలే.  నేరస్తులు ఎవరైనా కేసు తొందరగా పూర్తి చేసి,
శిక్ష తొందరగా పడెటట్లు చూడాలె.  శిక్షలు అన్ని ఛానల్లు, పేపర్లు బాగ ప్రచారము చేయాలి.  
రాను రాను ఆడోళ్ళ బతుకులు అధ్వాన్నమౌతున్నయి.  పశువుల్లాగ ప్రవర్తించె వాళ్ళకు
మనుషుల మధ్య వుండె హక్కు వుండదు.  రేపిస్టులు ఎవరికైనా మినిమం యావజ్జీవ శిక్ష
వేయాల్సిందే.  తప్పనిసరి కేసుల్లొ మరణశిక్ష వేయ్యాలే.  పక్కవాడి ప్రాణాన్కి విలువివ్వని వాడికి
బతుకె హక్కు ఎందుకుండాలి?"
"సరెలే. ఆడపిల్లలు తప్పనిసరిగా చదువుకొని, ఆర్థిక స్వావలంబన, ఆత్మస్థైర్యము పెంచుకొవాలే.
సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ లో  చేరి కొట్లాడే శక్తి, సమయస్పూర్థి పెంచుకోవాలె.  రోడ్డు మీదకెళ్తే  
ఆక్సిడెంట్ కుఎట్లా అవకాశముందో అట్లాగె ఇవ్ టీజింగ్ కు, రేపుకు అవకాశముంటుంది.
ఎప్పుడైనా అప్రమత్తంగా వుండక తప్పదు."
"ఇట్లా రేపు చేసెటోల్లు అసలు మనుషులేనా."
"కాదు.  కాని అందరు పశువులు కాదు కదా.  దొంగతనాలు, దోపిడీలు, హత్యలు జరిగినట్టె
రేపులు కూడా జరుగుతుంటయి."
"అన్నిటికంటె రేపు హేయమైంది కాదా?  జీవాతంతము మనిషిని కుంగదీస్తుంది కదా."
"కరక్టె.  జీవతములో ఎన్నో ప్రమాదాల్లో ఇది కూడ ఒకటి.  ఇట్లాంటివి జరిగినప్పుడు
కుటుంబము, సమాజము, ప్రభుత్వము ఆ స్త్రీకి అన్ని విధాలుగ అండగా నిలువాలె."
"ఎంతైనా లా స్త్రిక్ట్ గా వుండి శిక్షలు వెంటెనె పడితేనె ఈ నేరాలు తగ్గుతాయి.  మగవాళ్ళు
ఆడవాళ్లను ‘చీజ్ బడీ మస్త్, మస్త్ ’ అనుకోకుండా వ్యక్తిగా గౌరవించటము నేర్చుకోవాలె"
"అవును"

Friday, August 23, 2013

News-views

వార్తలు - విశ్లేషలు 
సమన్యాయం
"అంతా సమన్యాయం, సమన్యాయం అంటుండ్రు.
సమన్యాయం అంటె ఏంది?"
"అందరిని సమానంగ చూసుకునుడు, ఒక్క తీరుగ
మంచిగ చూసుకునుడన్నట్టు."
"మరి ఈ మధ్య గీ విజయమ్మ సమన్యాయం అని
ఒక్క తీరుగ పాట పాడుతుంది.  గదేంది?"
"గదేందంటే...తెలంగాన వస్తుంది కదా, అందుకని
ఆంధ్రొల్లకు తను సపోర్టని ఏదో చేస్తుంది."
"అసలు ఆ ఆంధ్రోల్లు మనల్ను అన్యాయం చేస్తుండ్రనే
‘మా తెలంగాన మాగ్గావల’నే గొడవ మోదలైంది.  మన
కన్యాయము జరుగుతుందని అని రకాల కమీటీలు
కమీషన్లు చెప్పినవి కద.  ఆ క్రిష్న కమీషను కూడ
వీల్లు పెద్దమనుషుల ఒప్పందం కాన్నుంచి అన్ని హామీలు
అటకెక్కించండ్రని అందుకే తెలంగాన బాధలన్ని అని చెప్పి
తెలంగాన విడగొట్టుడుతో ఆంధ్రోల్లతొ గొడవ వచ్చిన ఎట్లైనా
ముందు వడి చేయమని ఇన్ డైరక్ట్ గా చెప్పింది.  మన
కన్యాయము జరిగింది మొర్రో అని మనము మొత్తుకుంటుంటే
ఈ సమన్యాయమేందంటా?"
"అసలే ఆడోళ్ల మాటాలకు అర్థాలే వేరంటారు. ఓట్ల కోస-"
"ఇగో.  ఆడాళ్ళో గురించి మాత్రము అట్లా మాట్లాడకు.  కావాలంటే
రాజకీయ పార్టీల మాటలకు అర్థాలే వేరను.  తెలంగానను ఆంధ్రోల్ల
పాలననుంచి విడిపించినట్టు జగన్ను చెంచల్ గూడ జైలు నుండి
విడిపించమంటుందేమో!"
"ఏమో కొత్త అర్థాలు చెపుతున్నవ్.  నీకు ఈ మధ్య రాజకీయ తెలివి
బాగనే పెరిగినట్టుంది!"

News-Views

వార్తలు - విశ్లేషలు
ఒడువని ముచ్చట 
"తెలంగాన వస్తుందంటవా?"
"వస్తదొస్తది."
"ఏమో.  రోజుకో కొత్త కత పెడుతుండ్రు ఈ ఆంద్రోల్లు."
"ఎన్ని కతలు పెట్టినా తెలంగాన రాక తప్పదు."
"పదమూడేండ్ల బట్టి ఉద్యమం నడుస్తుంది. పిల్లల చదువులు
చెడిపోతున్నయి.  జరిగే అన్యాయం ఇంక ఎక్కువనే అయి
తుంది.  మొన్నటిదాక తెలంగానకు వ్యతిరేకము కాదన్న్లొల్లు
ఇప్పుడు కేంద్రము తెలంగాన ఇస్తె మేమొద్దంటమా అన్నరు.
కాంగ్రేసోల్లు అధిష్టానం నిర్నయానికి కట్టుబడి వుంటమన్నరు.
అందరొప్పుకున్నరు కదాని కాంగ్రేసు ఒప్పుకొని తెలంగాన
ఇస్తనంటే అంతా అట్లేట్ల ఇస్తరని ఒకటె ఎగురుతున్నరు."
"ఎవలేమన్నా తెలంగాన రాక తప్పదు.  గీ అలర్లు చూసి
కాంగ్రేసు తెలంగానా ఇయ్యకుంటె రేపు బిజేపి ఇస్తది."
"అప్పుడు మాత్రం గీ సీమాంధ్రోల్లు మళ్ళి గాయి చేయకుంటరా?
రాజ్యసభల ఆ వెంకయ్యనాయుడు సీమాంధ్ర ఎంపిలకు ఎంత
సపోర్టుగ మాట్లాడినడనుకున్నవ్.  తెలంగాన విషయ మొచ్చేసరికి
మోకమెంత మాడ్చుకూచన్నడో నువు చూడలేదు."
"గవన్ని చూసి నన్ను పరెషాన్ చేయ్యకు.  ప్రజలు తెలంగాన
మర్చిపోయె ముచ్చటే లేదు.  టిఆరెస్స్ పార్టి వున్నంత వరకు
అది తెలంగానను మర్చిపోనియ్యదు.  అది కాకపోతె ఇంకో
రాజకీయ పార్టీ వస్తది.  అధికారం కోసమె కదా ప్రతి పార్టీ
తెలంగానకు జై కొట్టింది."
"కరక్టె.  కాని సీమాంధ్రోల్ల్లు మాటలు చూస్తుంటె నాకైతె టెన్షన్
పెరుగుతుంది.  ముందేమొ అధిష్టానమన్న్రరు.  ఇప్పుడామెను
ఇష్టమొచ్చినట్టు తిడుతున్నరు.  అన్నదమ్ములంటున్నరు.
మనోల్లను ఆంధ్రలో తన్నవట్టిరి.  కడుపుతోటి వున్నామే అవస్థతోటి
ఆస్పటల్కు పోతే, ఆమేమి డాక్టరమ్మో "తెలంగాన అంటేనె అసహ్యము
నీ తెలంగానలోనె చుపెట్టుకో పో" అని ఎళ్ళగొట్టిందట.  ఇక్కడ మనోల్లు
కూడ అట్ల చేస్తె ఎట్లుంటది?"
"వాల్లు ఏదో చెసినరని మనము చేస్తమా?  వాళ్లలాగ మనము కుళ్ళు
కుయుక్తులతో వుండుంటె మన పరిస్థితి ఇప్పుడు ఇట్లా వుండేదా?"
"మన మంత్రులంత చేతగానోళ్ళ లెక్కున్నరు.  అధిష్టానమేమి చెప్తే
గంతే నని ఊకుంటరు.  ‘బాంచెను కాల్మొక్తా’ని గమ్మునుంటరు.  గా
వాల్లు చూడు అధెష్టానాన్ని ఎన్నెన్ని మాటలంటుండ్రు, ఎన్నెన్ని
శాపనార్థాలు పెడుతుండ్రు.  గిదంత చూస్తుంటే కాంగ్రేసోల్లు మళ్ళి
ఎన్కకు పోతరేమోన్పిస్తుంది."
"వాల్లు మళ్ళి మళ్ళి చెపుతుండ్రు కద, తెలంగాన ఇచ్చుడు తప్పదని.
నువ్వు ఇంక మాట్లాడకు.  గా ఆంధ్ర పేపరు చదివి, టివిలు చూసి
నువ్వు పరేషానై నన్ను పరేషాని జెయ్యకు.  ఆ కేబల్ టివి కట్ చేయిస్త.
ఆంధ్రోల్ల తెలుగు పేపరు కూడ బందువెట్టిస్తా.  గా తెలంగాన పేపరు
ఒక్కటి చదివు. లేకపోతె నువ్వు రంది పడి నన్ను పరేషాని జేసి
హార్ట్ అట్టాక్ తెప్పిచ్చేటట్టునవ్."

Wednesday, August 14, 2013

Jai Samaikyaandhra

జై  ఆంధ్ర - సీమాంద్రా  

సీమాంధ్రాలో సమైక్య ఉద్యమము రెండు వారాలుగా ఆగక సాగుతుంది.
ప్రజాప్రతినిధుల ప్రేరణతో, ప్రభుత్వ ప్రోత్సాహముతో, పోలీసుల పర్యవెక్షణలో,
ఛానల్ల ప్రచార ప్రభంజనాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సమైక్య సమ్మె
సాగుతుంది జోరుగా హుషారుగా!  ప్రజల ఇక్కట్ల్లు అవసరము లేదు,
పేదలు, రోజు వారి కూలీల పొట్టకూటి గురించి పట్టింపు లేదు,
విద్యార్థుల చదవు చెడినా ఫర్వాలేదు, ప్రయాణికుల కష్టాలు తెలుసుకునే
పనిలేదు, ధరలు ఆకాశాన్నిఅంటి పేద మధ్యతరగతి వారి ఆకలి మంటల
గురించి ఆలోచించే ధ్యాసె లేదు, తోటి తెలుగు వాడిని అణచి, దోపిడి
చేసుకునే హక్కుని వదులుకునే ప్రశ్నేలేదు!  సమైక్య ఉద్యమము
ఒక ప్రాంతాన్ని, ప్రజలను దోచుకునె హక్కును వదులుకోమని
చేస్తున్న ఉద్యమము.  తెలుగుజాతని, అన్నదమ్ముల్లని సెంటి
మెంటుతో ఒక ప్రాంతాన్ని శాశ్వతంగా వలసవాసుల ఆధిపత్యానికి
లోబడి వుండె విధంగా చేసేయత్నమే ఈ సమైక్య ఉద్యమము.
సమైక్యమన్నది ఒకే స్థాయిలో, ఒకే వర్గానికి, ప్రాంతానికి చెందిన
వారి మధ్య మాత్రమే సాధ్యము.  ఇన్నేళ్ళు ఆం.ప్ర. జరిగిన ఘటనలే
ఇందుకు సాక్ష్యము.
ఇప్పుడు ఆంధ్రాలో జరిగేది జై సమైక్యాంధ్ర ఉద్యమమే కాని జై ఆంధ్ర
ప్రదేశ్ ఉద్యమము కాదు.  ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలో కలిసి ఆంధ్ర
ప్రదేశ్ గా ఏర్పడప్పుడు కొన్ని ఒప్పందాలు జరిగాయి.  అవి ఆంధ్ర
రాష్ట్రము వాళ్ళు నీటి రాతలుగా మార్చి తెలంగాణ నిధులు, నీళ్ళు
వనరులు దోచుకోవటము, అది నిరాటంకంగా సాగేందుకు వాళ్ళ
ప్రాంతము వాళ్ళనే అన్నికీలక ఉద్యోగాల్లో నియమాకాలు చేసి
తెలంగాణ వారి ఉద్యోగాలను కూడ కొల్లగొట్టారు.  తెలంగాణా వారు
ఆంధ్ర దోపిడికి వ్యతిరెకంగా పోరాటము చేసి ఎన్నిఆరక్షణ హక్కులు
తెచ్చుకున్నా ఆంధ్రా పెత్తెందార్ల్రు వాటిని బుట్టదాఖలు చేసి వారి దోపిడిని
యధేచ్చగా సాగించారు.  ప్రతిసారి తెలంగాణ వాళ్ళుపోరాటము చేసి
కేంద్రము ద్వారా హక్కులను తెచ్చుకునేటప్పుడు ఆంధ్రా పాలకులు
వాటిని అమలు చేస్తామని కేంద్రములో హామి ఇచ్చిరాష్ట్రములో మాత్రము
వాటిని అటకెక్కించె వారు.
తెలంగాణ పోరాటము ఎందుకు వచ్చిందో అందరికి తెలుసు.  ఇదివరకు
ఏవో హామిలతో బుజ్జగించ యత్నించిన ఆంధ్రా పాలకులు ఈసారి మాత్రం
అలా చేయదలచుకోలేదు.  ఇన్నాళ్ళు వాళ్ళు ఈ ప్రాంతానికి చేసిన
అన్యాయాన్ని కూడ తప్పిదముగా భావించట్లేదు.  ఇప్పుడు వారు
పూర్తిగా సిగ్గువిడిచారు.  వారు చేసె సమైక్య ఉద్యమము వారు తెలంగాణకు
ఎలాంటి అస్థిత్వము లేకుండా చేయాలనే ఉద్దేశముతో చేస్తున్నది.
తెలంగాణాలో తెలంగాణ వారినే పరాయిలగా, బానిసలుగా మిగిల్చాలని
కొనసాగిస్తున్నది.  అందుకె వారు చేసేది సమైక్య ఆంధ్ర ఉద్యమము లెదా
జై సమైక్యాంధ్రా ఉద్యమము.  ఇది జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమము కాదు.
వారికి కావలసింది ఆంధ్ర అస్థిత్వమె కాని తెలుగు జాతి అస్థిత్వము కాదు.
వారికి కావలసింది తెలంగాణలో చరిత్రాత్మకమైన హైదరాబాదు నగరమే
కాని తెలుగుజాతి సామరస్యము కాదు. వారికి కావలసింది తెలంగాణతో,
తెలంగాణ ప్రజలతో తెలుగుజాతిగా తెలంగాణ గడ్డమీద సహజీవనము
చేయటము కాదు,  తెలంగాణ అంతర్భాగమైన ప్రపంచ ఖ్యాతిగాంచిన
హైదరాబాదు నగరముపైన ఆధిపత్యము.  వారు నిస్సిగ్గుగా చెప్పుతున్నారు,
మాకు దక్కని హైదరాబాదు తెలంగాణాకు కూడ దక్కొద్దని తెలుగు
జాతి సోదరప్రేమ అంతా ఆ విషయానికి వచ్చెసరికి గాల్లో కల్సిపోయింది.

ఆంధ్రప్రదేశ్  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిస్తె ఏర్పడింది.  తెలంగాణ విడి
పోతే వుండేది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్.  తెలంగాణ అంతా ఒక్కటె.  ఆంధ్రా
లోనె ప్రాంతీయ బెధాలు వున్నాయి.  ఆంధ్రా అని, కోస్తాంధ్రా అని, రాయల
సీమా అని, ఉత్తరాంధ్రా అని.  ఇన్ని ప్రాంతీయ బెధాలు, వాటి మధ్యలో
విబేధాలు వుండి కొత్తగా ఏర్పడె ఆంధ్రప్రదేశ్ లోనైన ఆంధ్రులంతా సహ
జాతి భావముతో మెదులుకుంటూ అన్ని ప్రాంతాలకు న్యాయము చేస్తు,
అభివృద్దిలో అన్నింటిని సమంగా ముందుకు తీసుకెళ్ళు సహజీవనము
చేస్తె ఎంతో ప్రగతిని సాధించవచ్చు.  సమైక్యంగా పురోగమించవచ్చు.  అట్లా
కాకుండా తెలంగాణను అణగదొక్కినట్టు అక్కడ కూడా సీమనో, ఉత్తరాంధ్రనో
వెనకబడేసినా, ఏ విధంగా అన్యాయము చేసినా అక్కడ మరో ఉద్యమము
రాక తప్పదు.  తెలుగు మాట్లాడె వారికి మరో రాష్ట్రము ఏర్పాటు చేయక
తప్పదు.
మనసులో ఏ భావము పెట్టుకొని చేసినా ఈ సమైక్యాంధ్ర ఉద్యమము ఆంధ్రాలో
అందరిలో సామరస్యము తీసుకురావాలి.  ఆంధ్రా, రాయలసీమ తెలుగు సొదరులు
సఖ్యంగా వుండాలి.  ఇప్పుడు వారు చేస్తున్నఈ సమైక్యాంధ్రా స్ఫూర్తితో వారు
రాబోవు కాలములో కలిసి వుండి ప్రపంచ ఖ్యాతి గాంచె విధంగా వారి ఆంధ్ర
ప్రదేశ్ లేదా సమైక్యాంధ్రాని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ ప్రజలంతా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!!
జై ఆంధ్రా/సీమాంధ్రా/సమైక్యాంధ్రా!

Saturday, August 10, 2013

Andhra Junta

తెలుగు జాతి - ఆంధ్రుల అహంకారం 
ఇది ఆంధ్రోళ్ళ పట్టుదల అనుకోవాలా?  లేక వాళ్ళ దురహంకార
దౌర్జన్యమనుకోవాలా?  తెలుగు జాతి మీద ప్రేమ మాత్రం
అస్సలే కాదు.  తెలుగుజాతి అని జాతి మీద ప్రేమ వుంటె ఆంధ్ర
రాష్ట్రమును తెలంగాణతో కలిపినప్పుడు జరిగిన ఒప్పందాలకు
కట్టుబడి వుండేవారు.  అట్లా వుండుంటే `69 లో తెలంగాణ ఉద్య
మము వచ్చేది కాదు.  ఆ తరువాతైనా తెలంగాణ వాళ్ళకు అన్యా
యము జరుగుతుందని నిర్ద్దారించి పట్టుకొచ్చిన పథకాలు కాని,
సూత్రాలు కాని సక్రమంగా అమలుపరచినా మళ్ళి తెలంగాణ
ఉద్యమము వచ్చేది కాదు.  ఆంధ్రా నుండి ఈ ప్రాంతానికి వచ్చిన
వారు తమను తాము 'సెట్లర్స్' గా పిలుచుకుంటు ఇక్కడి ప్రజలు
‘తెలుగుజాతి’ భావముతో వారితో కలవడము జరిగిందని మరిచి
పోయి, ఇక్కడి వారి భాషను, వేషాన్ని వెక్కిరించటము, అక్కడి రాజకీయ
నాయకులు అక్కడ ఎన్నికై ఇక్కడ వుంటు, ఇక్కడి నిధులు, వనరులు
అక్కడకు తరలిస్తు అక్కడి అభివృద్ధికి పెద్ద పీట వేసి, తెలంగాణను
ఎడారిని చేస్తు, తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా అణగదొక్కటముతో
తెలంగాణ ప్రజలు ఉద్యమించక తప్పలేదు.
 తెలంగాణ ప్రజలను వారు ఏ విధంగా అణిచివేసినరో తెలుసుకోవాడానికి
ప్రత్యక్ష్యంగా కనిపిస్తున్న పరిస్థితులే సాక్ష్యం.  తెలంగాణ ఉద్యమమప్పుడు
తెలంగాణ ప్రజల శాంతియుతంగా నిరసన తెలుపుదామన్నా, సామరస్యంగా
సభలు పెట్టుకుందామన్నా ఆంధ్రా పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినరు!
ఎన్ని విధాల అడ్డుకున్నరు!  ఎన్ని కేసులు పెట్టినరు!  ఎంత నిర్బంధము!
ఎంత దమనకాండా!   ఒక్క రోజు బందు పెడితె ఆంధ్ర చానల్లు రోడ్ల మీద
ఆంధ్రోళ్లను పట్టుకొని వాళ్లకు బంద్ వల్ల కలిగి ఇబ్బందుల గురించి ఏమి
సానుభూతి చూపినరు! చర్చలు పెట్టి నష్టాల గురించి, పేద, కూలి ప్రజల
కష్టాల గురించి జనాన్ని ఊదర గొట్టినరు!  ఇప్పుడు ఆంధ్రాలో తొమ్మిది
రోజులబట్టి బందని ఘనంగా చెప్పుతున్నరు.  ఇప్పుడు అక్కడ ఉద్యమాలు
పోలీసుల సంరక్షణలో నిరాఘాటంగా తొమ్మిది రోజులనుండి జరుగుతున్నాయి.
చూస్తుంటే పోలీసులే అక్కడ విధ్వంసానికి, దమనకాండకు సహకారమందిస్తు
న్నట్టుంది.  అక్కడ ప్రతి రోజు జరుగుతున్న విధ్వంసము 12ఏళ్ళ తెలంగాణ
ఉద్యమములో కూడ జరగలేదు.  అక్కడ పేదలు, కూలీలు లేరా?  విద్యార్థుల
చదువు చెడిపోవట్లేదా?  ఉద్యోగస్తులకు, ఇతర ప్రయాణికులకు రవాణా సౌకర్యము
లేక కష్టము అయితలేదా?  వివిధ రంగాల్లో ఎలాంటీ నష్టము రావట్లేదా?  పైగా
DGP ప్రజాస్వామ్యములో ప్రజలు శాంతియుతంగా నిరసనలు తెలుపె హక్కు
వుందని అంటారు.  తెలంగాణలో తెలంగాణ వారికి ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతి
యుతంగా నిరసనలు తెలుపుకునె హక్కుకాని, సభలు నిర్వహించుకునె అధికా
కారము కాని లేదు.  సీమాంధ్ర వారికి మాత్రం వుంటుంది.  దానికి పోలీసు అధిపతే
వత్తాసు పలుకుతాడు.  తెలంగాణ వారికి సీమాంధ్ర ఏలుబడిలో వున్న ఏపిలో
ఎంత అణచివేతకు గురౌతున్నారో ఇప్పటికిప్పుడు కనబడుతున్న ఈ దృష్తాంతము
చాలదా.  తెలివి, మానవత్వము వుండి, తెలుగు జాతిగా కలిసివుండాలనుకునె
సీమాంధ్ర సోదరులకు తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో
ఇప్పటికైనా అర్థం కావాలి.
ఇప్పుడు జరిగే గొడవంతా ఏపి అలాగే కొనసాగలనా అంటె కాదనే అనాలి.  వాళ్ళ
బాధంతా తెలంగాణ ఏర్పడితె తెలంగాణ వాళ్ళు వాళ్ళ హక్కు నీళ్ళను, నిధులను
వాళ్ళు అధికారంగా వాళ్ళే వాడుకుంటారని, సీమాంధ్రా ఆ దోపిడి ఇక ముందు
సాగించలేరని. హైదరాబాదులో ఇక ముందు అక్కడి వారు వచ్చి అధికారికంగ
తెలంగాణవారి ఉద్యోగాలను దొడ్దిదారిన చేపట్టలేరని వారి బాధ.  తెలంగాణ పోతె
పోని, మాకు హైదరాబాదు కావాలంటరు.  మాకు ఇవ్వకపోతే వాళ్లకు కూడ
హైదరాబాదుపై హక్కు వుండొద్దని అంటరు. అన్నదమ్ములంటరు, తెలుగుజాతి
ఒక్కటంటరు.  మరి ఇదేమి కుళ్ళు?  ఇంత కుళ్ళు బుద్ద్ది, పక్షపాతము చూసి
నంక వాళ్ళతో తెలంగాణ వాళ్ళు ఎట్లా కల్సుండెది?
తెలంగాణ రాష్టంఏర్పడుతుంది కాని దేశము కాదు కదా.  ఈ భారత దేశములో
ఎవరైనా ఎక్కడైనా వుండవచ్చు కదా,  వ్యాపారాలు, చిన్నచితక పనులు చేసు
కునే వాళ్ళను వదిలేస్తె, విద్యావంతుల్లో 10% కు మించి ప్రభుత్వ ఉద్యోగాలు
వున్నాయా?  విద్యావంతులు ఉద్యోగాలుఎక్కువగా చేసుకునేది ప్రైవేటు రంగములోనే.
ఆ ఉద్యోగాలకు అర్హతలే ముఖ్యంగా చూస్తారు కాని ప్రాంతము కాదు కదా.
అయినా ఎందుకింత అలజడి? అంటె అది రాజధాని కదా అని అనొచ్చు.
రాజధాని అయినా అక్కడ రెండు మూడు రోజులకొకసారి ఎదో సమయములో
మంచినీళ్ళు వస్తాయి.  భార్యా భర్తలిద్దరు ఉద్యోగస్త్లులైతె నీళ్లు పట్టుకునే కోసం
ఒకరు సెలవు పెట్టివుండటమో, ఇంట్లో ఒక మనిషిని ప్రత్యేకంగా ఆ పనికి వుంచుకోవ
టము చేయాల్సి వస్తుంది.  రోడ్ల పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటె అంత
మంచిది.  ఎవరు ఎప్పుడు ఏ గుంతల్లో పడి, ఆక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు
విరగ్గోట్టుకుంటారో, ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు.  వర్షాకాలమోస్తె
పడవల్లో ప్రయాణము చేయాల్సిన పరిస్థితి.  ట్రాఫీక్ సమస్య ఎంతంటె 10కిమి
వెళ్ళ్డాడానికి వాహనమైతె గంటా, నడిచె వెళితె ముప్పవు గంట పడుతుంది.
కాలుష్యం సంగతి చెప్పక్కర్లేదు.  ఎక్కువవుతున్న ఊపిరితిత్తుల వ్యాధులు
వాయు కాలుష్యానికి సాక్ష్యమ్.  రాజధాని నగరములో కలరా రావటము
ఆ రాజధాని నగరము అభివృద్ధి ఏపాటిదో తెలుస్తుంది.  అరవై ఏళ్ల పాలనలో
రాజధాని్ని ఆస్థితిలో వుంచిన సీమాంధ్రులకు రాజధాని అంటే ఎంత ప్రేమో,
ఎందుకు ప్రేమో తెలివైన సీమాంధ్ర యువకులు అర్థం చేసుకోవాలి.  ఉపాధి
కోసము వున్న వూరిని కన్నతల్లిని విడిచిన వాళ్ళకు బతకటానికి ఏ వుళ్ళొ
వుంటె, ఏ వూరు ఆదరిస్తె అది సొంతూరు కాదా?  50 ఏళ్ళగా హైదరాబాదులో
వుంటున్న ఆంధ్రోళ్ళు తెలంగాణ - హైదరాబాదు వాళ్ల సోంతూరని నిజాయితిగా
గుండెల మీద చెయ్యి వెసుకొని చెప్పారంటే, వాళ్ళు తెలంగాణ వాళ్ళే.  వాళ్ళకు
తెలంగాణ రావటము సంతోషమే, వాళ్ళు ఇక్కడ వుండటానికి ఎలాంటి భయము
వుండదు.  తెలంగాణ వనరులు దోచుకోవాలనే ఆలోచన వున్న వలసవాదులకే
తెలంగాణ ఏర్పడటము ఇష్టముండదు.  అందుకని రకరకాల అభ్యంతరాలు చెప్పుతారు.
ప్రస్తుత కాలములో రాజకీయనాయకులు వారికి, వారి అశ్రితులకు లాభాలే
పరమావధిగా పనిచెస్తున్నారు.  రాష్ట్రాన్ని ఇవ్వమని, విడదియొద్దని ఏ
ఎం.పి గాని, ఎం.ఎల్.ఏ రాజీనామాలు ఇచ్చినట్టు నటిస్తారు కాని అసలు
సిసలు రాజీనామాలు ఇవ్వరు.  మంత్రులు సంగతిని చెప్పనే అక్కర్లేదు.  బడుగు
బలహీన పేద ప్రజలు విషయాలను అవగాహన చేసుకొని రాజకీయనాయకుల
చేతిలో పావై జీవతాలను పాడు చేసుకోవద్దు.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!!

Monday, August 5, 2013

Telangaana State - Democratic Right

ప్రజాస్వామ్య గెలుపు
నాకు ఇంకా గుర్తు, డిసెంబర్ 9, 2009 నాడు మధ్యహ్న
ప్రసారాలలో KCR స్థితి - అతను restlessగా వుండి
IV లైన్ పీకేసుకునే ప్రయత్నము చేయటము, అతను
షాక్ (బి.పి ప్రమాదకర స్థితికి పడిపోవటము) లోవున్నాడని
అర్థమవుతుంది.  ఆ స్థితిలో అతను మరిన్ని గంటలు బతికి
తెలంగాణ సానుకూల ప్రకటన సాధించటము KCR పట్టుదలే
కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రార్థనలు, వారి తెలంగాణ
ఆకాంక్షతో పాటు దైవానుగ్రహమె.  KCR దీక్షతో, విద్యార్థుల
ఉద్యమశక్తితో, తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దత్తుతో జరిగిన
ఉద్యమము, అన్నిపార్టీలు తెలంగాణకు జై కొట్టక తప్పని
పరిస్థితి ఏర్పడింది.  అందుకే అఖిల పక్షములో తెలంగాణ
బిల్లు అసెంబ్లిలో పెట్టితే మద్దతిస్తామని దాదాపు అన్ని పార్టీలు
తెలిపినవి.  వీరిని నమ్మి, ఎన్నికలు అప్పుడు ఇచ్చిన మాట
నెరవెర్చుకోవటము కోసము, కేసీఆర్‌ స్థ్తితి అతిప్రమాదకరంగా
వుండటము, అతనికి ఏదైనా అయితే తెలంగాణ
అగ్నిగుండమౌతుందని నాటి కేంద్రహోమ్ మంత్రి, రాత్రి 11.35
నిమిషాలకు "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవు
తుంద"ని ప్రకటించటము జరిగింది.  కాని ఆ వచ్చిన ప్రకటనకు
తెలంగాణ ప్రజలు కొద్ది గంటలు కూడ ఆనందాన్ని
అనుభవించకుండా ఆంధ్రోల్లు, రాయలసీమోల్లంతా కలిసి,
పార్టీలకతీతంగా కలసిపోయి, ‘U' టర్న్ తో అదరగొట్టి,
విధ్వంసాలతో వైషమ్యాలు సృష్టించి, రాజీనామాల డ్రామాలతో
గవర్నమెంటును పడగొడతామని బెదిరించి, కేంద్ర ప్రకటన
అమలులోకి రాకుండా ఆపినరు.  అప్పటినుండి మూడున్నర
ఏళ్ళు తెలంగాణ ప్ర్జజలు తీరేన్ని రకాలుగా ఉద్యమము చేయని
రోజు లేదు. 
జయశంకర్ సార్ తెచ్చిన ప్రజాచైతన్యముతో ప్ర్జజలంతా ఏకమై,
కేసీఆర్ రాజకీయ శక్తితో, ప్రజా ఐకాసల అండతో ఆగకుండా
ఉద్యమము సాగింది.  కులమతవర్గ భేదము మరిచి ప్రజలందరు
ఉద్యమములో ఎవరికి తోచిన విధంగా, చేతనైన విధంగా ముందుకు
సాగినరు.  ఈ సుదీర్ఘ ఉద్యమములో అటుపోట్లకు తట్టుకోలేక,
ఉద్వేగముతో కొందరు,  నిరాశా నిస్పృహలో కొందరు తెలంగాణ
తల్లి చెర విడిపించ, కేంద్రానికి బలమైన ఆకాంక్ష తెలిపే ఉద్దెశముతో
మరెందరో యువకులు ప్రాణాలు అర్పించినరు.  వారి త్యాగఫలముతో,
ప్రజోద్యమాల బలముతో యెట్టకేలకు కాంగ్రేసు అధిపత్యములో వున్న
UPA ప్రభుత్వము తెలంగాణ ఏర్పాటు దిశగా సానుకూల నిర్ణయము
జులై 30న రాత్రి 7.25 నిమిషాలకు ప్రకటించినది.  అది తెలంగాణ అంతా
సంతోషములో మునిగి పోవలసిన సమయమైనా, తెలంగాణ ప్రజలు
సంబురాన్ని ఆపుకోలేక కొద్ది సందడి చేసినా అందరి మనసుల్లో
అనుమానాలే.  ఆంధ్రోల్లు మళ్లి ఏం తుంపులు పెడతారోనని.  అందుకే
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టటమే కాదు అది పాసైతేనే తెలంగాణ
రాష్ట్రమంతట మిన్నంటే  సంబురాలు చేసుకోవలనె నిర్ణయము.
తెలంగాణ సాధనకు, ఉద్యమానికి ఎందరో మహానుభావులు తమ
జీవితాన్నిఅర్పించారు.  జయశంకర్ సార్ తెలంగాణకు జరుగుతున్న
అన్యాయాల గురించి ప్రజలను చైతన్యవంతులని చేసి శాంతియుతంగా
తెలంగాణ సాధించె దిశగా వారిని నడిపించడానికి తన జీవితాన్ని
అర్పిస్తె కొండాలక్షమణ్ బాపుజి తెలంగాణ తొలి తీవ్ర ఉద్యమంలో
మంత్రిగా రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్రములో మాత్రమె తను
మళ్ళి రాజకీయ పదవి చేపడతానని్ శపథము చేసి దానికి
కట్టుబడి, తెలంగాణ మలి ఉద్యమములో కూడా క్రీయాశీలక
పాత్ర పోషిస్తూనే చివరి శ్వాస తీసుకున్నారు.
కేసిఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల ‘హీరో’.  తెలంగాణ ప్రజల
నాయకుడిగా తెలంగాణ సాధకుడిగా ఇప్పుడతనికి ఎదురులేదు. 
ఒక్క రక్తపుబొట్టు చిందకుండా, రాజకీయంగా ఉద్యమాలతోనే
తెలంగాణ సాధిద్దామని అన్నాడు.ఆ మాట నిలబెట్టుకున్నాడు. 
జయశంకర్ సార్ గురుత్వములో తెలంగాణ గురించి అన్ని
అంశాలను ఆకళింపు చేసుకొని, కొండాలక్షమణ్ బాపుజి
ఇంట్లో, ‘జలదృశ్యం’లో, తెలంగాణ రాష్ట్రసమతికి పురుడు పోసి
తెలంగాణ రాష్ట్రసాధన దిశగా ప్రస్థానము మొదలు పెట్టాడు. 
2001,ఎప్రిల్ 27 నుండి సాగిన ఈ పోరు పయనము ఎన్నో
ఒడిదొడుకులను తట్టుకొని చివరకు తన గమ్యాన్ని ముద్దాడే
రోజు రానే వచ్చింది.  రాజకీయశక్తితో, మేధావుల యుక్తితో,
ప్రజాసంఘాల అండతో తెలంగాణ ప్రజల స్వపరిపాలన కల
అతి త్వరలో నెరవేరబోతుంది.  కేసిఆర్, కోదండరాంల
నాయకత్వములో ఎలాంటి హింసా,విధ్వంసము లేకుండా
ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ ప్రజలు తమ స్వరాష్ట్రాన్ని
తిరిగి సాధించుకున్నరు.  నాయకులు ఎంత ధైర్యము
చెప్పినా, బ్రతికి సాధిద్దామన్నా కొంతమంది పోరాటములో
ప్రాణలర్పించి, పోరాటాన్ని తీవ్రతరము చేసినా వారి లోటు
వారి తల్లిదండ్రులతో పాటు తెలంగాణ తల్లికి కూడ తీర్చలేని
వేదనగ మిగిల్చారు. 
తెలంగాణ ప్రజలు, డిసెంబర్ 10, 2009 నుండి ఎంత వేదన
అనుభవించినరు!  ఎంత పోరాటము చేసినరు!  ఆంధ్రా
ప్రభుత్వము వారిని శత్రువులును చూసినట్లు చూసినరు. 
వేలమంది విద్యార్థులపై వందల కొద్ది కేసులు, అక్రమ
అరెస్టులు,  రకరకాల నిర్భంధాలు, కొట్టి కొట్టి కాళ్ళు
చేతులు విరగ్గొట్టడాలు, తలలు పగలగొట్టడాలు, ముందు
జీవితము లేకుండా చేయడము, చివరకు అవకాశము
వుంటె ప్రాణాలు కూడ పోయెటట్టు చేయడము.  ఉస్మానియా
యునివర్సిటిలో విచ్చుకున్న భాష్పవాయు గోళాలకు పేలిన
రబ్బరు తుటాలకు లెక్కెలేదు.  లేడీస్ హాస్టల్లో రూముల్లో
వున్న విద్యార్థినులను   చీకట్లో బైటకు లాగి పోలీసులు
చేసిన దుశ్చర్యలు బహుశ చరిత్రలో మొదటిసారి అనుకుంటాను.
స్వరాష్త్రములో స్థానిక ప్రజలపై పోలీసులు ఇలాంటి దౌర్జన్యము
చేయటము కేవలము ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలపైనె
సాధ్యము.  అహింసాయుతంగా ఎలాంటి విధ్వంసాలకు
పాలుపడకున్నా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకాని
సభలు పెట్టుకునె హక్కుకాని ఆంధ్ర ప్రభుత్వములో తెలంగాణ
ప్రజలకు లేదు.  అదే సమయములో2009 డెసెంబర్ రెండవ
వారములో సీమాంధ్రలో జరిగిన విధ్వంసానికి ప్రజల మనోభావాలు
దెబ్బతిన్నాయంటు ఎపి ప్రభుత్వము, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు,
పోలీసులు వత్తాసుగా నిలిచారు.  తెలంగాణ ప్రజల మనోభావలకు
మాత్రము ఎలాంటి విలువ లేదు!  తెరాసా నాయకులు తప్ప
మిగిలిన ప్రజాప్రతినిధులకు వారి పదవులు తప్ప ప్రజల తిప్పలు
పట్టింపు లేదు.  భావస్వేచ్చ ప్రకటనలకు కూడ కోర్ట్ నుండి పర్మిషను
తెచ్చుకోవల్సిన పరిస్థితి.  కోర్ట్ పర్మిషను ఇచ్చినా సభలకు వెళ్ళాలంటె
ఎన్నెన్ని అడ్డంకులో!  రవాణా సౌకర్యాలు ఒక రోజు ముందునుండె
బంద్. ఎట్లో అట్ల కష్టపడి పోయినా దారిలో ఎన్ని ముళ్ళకంచెలో,
ఎన్ని అడ్దంకులో, ఎన్ని చెకింగ్ లో.  ఎన్ని పోలీసు ఔట్ పోస్ట్ లు,
ఎన్నిన్ని నిబంధనలు! 
ఆంధ్రోళ్ళు వారం రోజులు ఆడిన  డ్రామాలతో, కుతంత్రాలతో,
దౌర్జన్యముతో అడ్డంబడి ఆపిన తెలంగాణ ప్రక్రియ తిరిగి మొదలు
పెట్టించడానికి మూడున్నరేళ్ళుగా తెలంగాణ ఉద్యమము సాగింది.
ప్ర్జజలను చైతన్యపరుస్తు, ఉత్సాహపరుస్తు, ఎలాంటి హింసా,
విధ్వంసము లేకుండా ఉద్యమము ఇన్నేళ్లు నడపటము అన్నది
కెసిఆర్, కోదండరాం ఘనతని చెప్పక తప్పదు.
ఈ మూడున్నరేళ్ళలో పలు రకాలుగా ప్రజాభిప్రాయ సేకరణ,
పార్టీల, పార్టీనాయకుల అభిప్రాయాల సేకరణ జరిగినది.  క్రిష్ణా కమిటి
ఊరూరు తిరిగి ప్రజల మనోభావలను తెలుసుకుంది.
పార్టిల అభిప్రాయాలూ తెలుసుకుంది .  తెలంగాణ
ప్రజల కోరిక ధర్మబద్దమైనదని,  అది అణచిపెట్టి వుంచటము
అప్రజాస్వామిక పద్దతుల వలనె సాధ్యమని చెప్పింది. 
ఆంధ్ర ప్రభుత్వము అప్రజాస్వామిక పద్ధతుల వలన అణచాలని
చూసింది.  కాని ప్రజాస్వామ్యములో ఎన్నికలు తప్పవుకదా! 
తిరుగులేని తెలంగాణ శక్తిగా, రాజకీయ అస్థిత్వము
సాధించుకుంటున్న తెరాసావల్ల ఎపిలో కాంగ్రేసు కోట
బీటలువారుతుంటె, యుపియెలో వున్న కాంగ్రేసుకు తెలంగాణ
రాష్ట్ర ప్రక్రియ ముందుకు తీసుకు పోక తప్పలేదు. 
అరవై ఏళ్ళుగా పోరాటము చేస్తుంటె మొత్తానికి మరో ఆరు
నెలల్లో తెలంగాణ రాష్ట్రము భారత పటములో 29వ రాష్ట్ర ముగా
రూపు దిద్దుకోబోతుంది.  తెలంగాణ రాష్ట్ర సాకారము ప్రజాస్వామ్య
విజయము.  అహింసా, ప్రజాచైతన్యము. మెధాశక్తి, రాజకీయయుక్తి
ముందు కుతంత్రము, మోసము దౌర్జన్యము ఎప్పటికైన ఓడిపోక
తప్పదని ఋజువైనది. 
ఇకనైన సీమాంధ్రాలు దురాశ మానుకొని వారి రాజధాని వారు
నిర్మించుకొని వారి స్థానములో  వారి ప్రజల మేలుకొరకు పాటుపడాలి.
అంతె కాదు.  వారి కృత్రిమ ఉద్యమములో భాగస్వాములను చేసు
కున్నా ఉత్తరాంధ్రులకు, రాయలసీమావారి హక్కులకు, అధికారాలకు
భంగము కలగకుండా ప్రవర్తించాలి.  ఇప్పటి ఈ తెలంగాణ ఉద్యమము
వల్ల వచ్చిన అనుభవముతో ఉత్తరాంధ్రులు, సీమ వారు కోస్తాంధ్రులతో
ముందునుండె జాగరూకతతో మెదలాలి.  లేకపోతే మరో ఇరవయ్యొ,అరవై
ఏళ్ళ తరువాత మరో ఒకటో, రెండో తెలుగు రాష్ట్రాలు ఏర్పడె పరిస్థితి
వస్తుంది. 
బతుకు - బతుకనివ్వు అనే సూత్రానికి కట్టుబడి అందరు వుంటె
ఈ ప్రపంచములో గొడవలుండవు కదా!
జై తెలంగాణ! జయహో తెలంగాణ!!